జాతీయ వార్తలు

కార్మికులు తిరిగొస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వందలాది మంది భారతీయుల సమస్య సంతృప్తికరంగా పరిష్కారమైందని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం పార్లమెంటుకు చెప్పారు. భారత్ చేసిన విజ్ఞప్తికి సౌదీ రాజు అంగీకరించారని, రెండు రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారని సుష్మా స్వరాజ్ పార్లమెంటు ఉభయ సభల్లో తనంత తానుగా చేసిన ప్రకటనలో వివరించారు. ఉద్యోగాలు కోల్పోయి సౌదీలో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి తిరిగిరావడానికి సౌదీ ఎగ్జిట్ వీసాలు ఇస్తుందని, సహాయక శిబిరాల్లో ఉన్న కార్మికులకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించడంతోపాటు ఆహారం అందజేస్తుందని ఆమె చెప్పారు. ఈ కార్మికులను భారత్‌కు పంపించడానికి అయ్యే రవాణా వ్యయాన్ని సౌదీ ప్రభుత్వమే భరిస్తుందని ఆమె చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం నయాపైసా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. కార్మికులు భారత్‌కు తిరిగి రావడానికి ముందు తమకు రావలసి ఉన్న వేతనాలు, ఇతర బకాయిల వివరాలను సౌదీ అరేబియా లేబర్ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలన్నారు. కార్మికులు ఈ బకాయిలను అన్నింటినీ పొందడానికి రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ అక్కడి లేబర్ కార్యాలయంలో ఫాలోఅప్ చేస్తుందని మంత్రి చెప్పారు. ఒకవేళ అర్హత కలిగి ఉండి ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారిని అనుమతిస్తుందని ఆమె తెలిపారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తికి అంగీకరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నందుకు సౌదీ రాజుకు, ఆ దేశ ప్రభుత్వానికి సుష్మా స్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఆ దేశ రాజుతో పటిష్ఠమైన వ్యక్తిగత సంబంధాలను నెలకొల్పుకోవడానికి, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చేసిన కృషి ఫలితంగా ఈ సమస్య సత్వరమే పరిష్కారమైందని ఆమె అన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి సౌదీలో ఉన్న భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ భారతీయ కార్మికులు స్వదేశానికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత తిరిగి వస్తారని సుష్మా స్వరాజ్ వెల్లడించారు.
రాజ్యసభలో కార్మికుల సమస్య పరిష్కారానికి భారత, సౌదీ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రశంసించారు. సభలో సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనపై సుష్మా స్వరాజ్ స్పందించినట్లుగానే ఇతర మంత్రులు స్పందించడం అలవాటు చేసుకోవాలని జ్యోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్) అన్నారు. ప్రభుత్వం చైనా, పాకిస్తాన్, ఒమన్‌లతో ఉన్న సంబంధాలపై కూడా మాట్లాడాలని ఆయన అన్నారు.