జాతీయ వార్తలు

రండి.. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 20: భారతదేశంలోని వైమానిక, రక్షణ పరికరాల తయారీ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఇందులో పెట్టుబడులు పెట్టి, భాగస్వాములు కావడానికి పెట్టుబడిదారులు పెద్దయెత్తున ముందుకు రావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆహ్వానం పలికారు. బెంగళూరులోని యెలహంక ఎయిర్‌బేస్‌లో బుధవారం ఎయిర్‌షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఐదురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, వివిధ రకాల విమానాలు ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రంగంలో విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, మల్టీ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాణిజ్య అవకాశాలు విస్తృతం చేసుకోవచ్చునని అన్నారు. రక్షణ రంగంలో నూరు శాతం ఎఫ్‌డిఐలకు అవకాశం ఉందని, విదేశీ పెట్టుబడుదారులు సైతం ఈ రంగంలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలని ఆమె కోరారు. ఇప్పటివరకు భారత్ నాలుగు వేలకు పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేసిందని, విదేశాలకు చెందిన ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫేక్చరర్స్ వచ్చి ఇందులో భాగస్వాములు కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. వారు కనుక తమతో చేతులు కలిపితే మార్కెట్‌ను మరింత విస్తృతం చేయవచ్చునని, విదేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి సైతం చేయవచ్చునని ఆమె అన్నారు. ఇప్పటికే భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు పదివేల వరకు ఉన్నాయని, ఇవి రక్షణ ఉత్పత్తుల్లో 80 శాతం వరకు తయారు చేస్తున్నాయని ఆమె తెలిపారు. 2014-15 నుంచి 2018 అక్టోబర్ వరకు రక్షణ ఉత్పత్తుల నిమిత్తం 1,27,500 కోట్లకు సంబంధించి 150 కాంట్రాక్టులపై ఒప్పందాలు జరిగాయని ఆమె చెప్పారు. అలాగే ఇదే సమయానికి 2,79,650 కోట్ల రూపాయల విలువైన 164 ప్రతిపాదనలు మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తమకు వచ్చాయన్నారు. ఇవి కేవలం భారత్‌కు చెందిన వ్యాపార వర్గాల నుంచి వచ్చినవేనని తెలిపారు. 2013-14లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఆధ్వర్యంలో రక్షణ ఉత్పత్తులు 43,746 కోట్లు తయారవ్వగా, 2017-18 సంవత్సరానికి ఇవి 58,163 కోట్లకు పెరిగాయని చెప్పారు. ఇందులో 40 శాతం ఉత్పత్తుల తయారీని ప్రైవేట్ సంస్థలకు అవుట్‌సోర్సింగ్ విధానంలో అప్పగించామన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి, దానికి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని, అదే సమయంలో ప్రైవేట్ సెక్టార్‌లో తయారైన వస్తువుల్లా ఎక్కువ ధర ఉండవని అన్నారు. అలాగే ప్రైవేట్ సంస్థలకు కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తుండటంతో వాటికి చేతినిండా పని తగిలి మంచి లాభాలను ఆర్జిస్తున్నాయన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా అటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రెండింటికీ ప్రయోజనం కలుగుతోందని ఆమె అన్నారు. రక్షణ రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు వీలు కల్పించడం, కొన్ని రక్షణ ఉత్పత్తులపై లైసెన్సింగ్ విధానాన్ని తొలగించడం వంటి చర్యలు డిఫెన్స్ ఆఫ్‌సెట్ పాలసీ కింద 2016లో చేపట్టడం వల్ల ఇందులోకి పెట్టుబడుల ప్రవాహం ఎక్కువైందని మంత్రి తెలిపారు.
ఆకట్టుకున్న విన్యాసాలు
ఎయిర్ షో సందర్భంగా వివిధ విమానాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి తెచ్చిన రాఫెల్ విమానం సైతం తక్కువ వేగంతో నడిపి ప్రదర్శించారు. మంగళవారం ఇక్కడ జరిగిన రిహార్సల్స్‌లో సూర్యకిరణ్ విమాన ప్రదర్శనలో రెండు విమానాలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వింగ్ కమాండర్ సాహిల్ గాంధీకి ఈ సందర్భంగా నివాళి అర్పించారు. అమెరికాకు చెందిన రక్షణ నిపుణుడు మార్టిన్ ఈ సందర్భంగా ఎఫ్-21 మల్టీ రోల్ ఫైటర్ జెట్‌ను ప్రదర్శించారు.
చిత్రం.. బెంగళూరులోని యెలహంక ఎయిర్‌బేస్‌లో ఏరో ఇండియా 2019 ఎయిర్ షోను బుధవారం అధికారికంగా ప్రారంభిస్తున్న రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు, కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, నేవీ చీఫ్ ఎడ్మిరల్ సునీల్ లన్బా, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ సింగ్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా తదితరులు