జాతీయ వార్తలు

రక్తమోడుతూ రోడ్డుమీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: వ్యాన్ ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయిన సాటి మనిషిని ఆస్పత్రికి తరలించకపోయినా కనీసం పోలీసులకు కూడా సమాచారం అందించని అమానుష ఘటన ఇది. రోడ్డుమీద పడిపోయి అల్లల్లాడుతున్న ఓ సెక్యూరిటీ గార్డును ఆ రోడ్డు మీదుగా పోయే ఎంతోమంది చూస్తూ వెళ్లిపోయారే తప్ప అతడిని ఆదుకోవడానికి మాత్రం ప్రయత్నించలేదు. పైగా ఒక వ్యక్తి బాధితుడి దగ్గరికి పోయి అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను తీసుకొని వెళ్లిపోయిన వైనం కూడా సిసిటివి కెమెరాలో రికార్డయింది. తీరా పోలీసులకు విషయం తెలిసి వెళ్లేసరికి బాధితుడు తుదిశ్వాస విడిచాడు. హృదయవిదారకమైన ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని సుభాశ్‌నగర్ ప్రాంతంలో జరిగింది. సుభాశ్‌నగర్‌లోని మీరజ్ సినిమా థియేటర్ సమీపంలో బిగించిన సిసిటివి కెమెరాలో రికార్డయిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున సుమారు మూడు గంటల సమయంలో విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మతిబుల్ (35) అనే సెక్యూరిటీ గార్డును ఒక డెలివరీ వ్యాన్ ఢీకొంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మతిబుల్ తీహార్ గ్రామ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఢీకొన్న తరువాత డ్రైవర్ వ్యాన్‌ను ఆపకుండా వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన మతిబుల్ భరించలేని నొప్పులతో గిజగిజలాడుతున్నా పక్కనుంచి ఎంతోమంది పోతున్నా ఎవరూ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. పైగా ఒక రిక్షా కార్మికుడు మతిబుల్ దగ్గరకు చేరుకొని అతని మొబైల్ ఫోన్‌ను తీసుకొని వెళ్లిపోయాడు. ఉదయం ఏడు గంటలకు తమకు సమాచారం అందిందని, దీంతో వెంటనే సుభాశ్‌నగర్‌లోని సంఘటన స్థలానికి చేరుకున్నామని, కాని అప్పటికే బాధితుడు రోడ్డుపై మృతిచెంది ఉన్నాడని పోలీసులు తెలిపారు. దీంతో అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. మతిబుల్‌ను ఢీకొన్న వ్యాన్ డ్రైవర్‌ను పట్టుకోవడానికి కృషి చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

చిత్రం.. వ్యాన్ ఢీకొని పడిపోయన వ్యక్తిని ఏమాత్రం పట్టించుకోకుండా అతడి సెల్‌ఫోన్‌ను ఎత్తుకుపోతున్న ఓ రిక్షా కార్మికుడు