జాతీయ వార్తలు

నితీష్.. భేషైన ఫలితాలు తెచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మార్చి 22: బీహార్ రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈసారి జరిగే సాధారణ ఎన్నికల్లో అధిక సీట్లను గెల్చుకుని మోదీకి కానుకగా ఇస్తారా? లేక బీజేపీతో చేతులు కలిపి తమకు ద్రోహం చేశాడని ఆర్‌జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ ఆరోపణలను నిజం చేస్తూ ప్రజల చేతిలో ఓటమి పాలవుతారా? అని ఓటర్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తం 40 ఎంపీ సీట్లు కలిగిన బీహార్‌లో అధిక సీట్లను గెల్చుకుని మోదీ మళ్లీ ప్రధాని కావడంలో ప్రధాన పాత్ర పోషించాలని జేడీ(యూ) అధినేత నితీష్‌కుమార్ కలలు కంటున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో మాత్రమే సరిపెట్టుకున్న ఈ పార్టీ 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ పార్టీ అయిన ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. కూటమిగా పోటీ చేసిన ఈ ఎన్నికల్లో లాలూ పార్టీకి అధిక సీట్లు వచ్చినా నితీష్‌కుమార్‌నే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. అనంతరం రెండేళ్లకు జరిగిన పరిణామాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ అవినీతికి పాల్పడ్డాడంటూ నితీష్‌కుమార్ రాజీనామా చేయడంతో కూటమి విచ్ఛిన్నమై రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అయితే నితీష్‌కుమార్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడంతో 12 గంటల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నితీష్ తర్వాత బీజేపీతో గతంలో తెగిపోయిన సంబంధాలను మళ్లీ కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించి బలం నిరూపించుకోవాలని లాలూ చేసిన డిమాండ్‌ను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. తమకు తీరని ద్రోహం చేసిన నితీష్‌కుమార్‌ను లాలూప్రసాద్ ‘ద్రోహి’గా అభివర్ణిస్తూ వస్తున్నారు.
పాలనలో క్లీన్ ఇమేజ్ పొందిన నితీష్‌కుమార్ రాష్ట్రంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అభివృద్ధే అజెండాగా, అవినీతి రహితంగా పాలన ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొంటూ ఆ దిశగా పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఆరునూరైనా తమ ఉద్దేశంతో నితీష్‌కుమార్ ‘ద్రోహే’నని లాలూ మండిపడుతూ తరచూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కాగా దీనిపై విపక్ష నేత చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని, జేడీ (యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పేర్కొన్నారు. మహానేతలుగా పేరొందిన జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక నాయకుడు నితీష్‌కుమార్ అని అన్నారు. సెక్యూలరిజమ్ పట్ల నితీష్ చూపుతున్న అంకితభావం ఏమాత్రం బలహీనం కాలేదని, రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి దీనికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. అలాగే ఆర్టికల్ 370, అయోధ్యలోని రామ మందిర నిర్మాణం, యూనిఫార్మ్ సివిల్ కోడ్ తదితర అంశాలపై ఆయన అభిప్రాయాలకు కట్టుబడే ఉన్నారు తప్ప బీజేపీతో పొత్తు ఉన్నంత మాత్రన ఏమాత్రం మార్చుకోలేదని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ-జేడీ (యూ) సీట్ల కేటాయింపులో నితీష్ పార్టీకి 17, బీజేపీకి 17 సీట్లను కేటాయించగా, తమకు తక్కువ సీట్లను ఇచ్చి అవమానించారంటూ ఆయన 17 ఏళ్లుగా ఆ పార్టీతో ఉన్న బంధాన్ని తెంచేసుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా పోటీ చేయగా కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకోగా, బీజేపీ 22 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో నితీష్‌కుమార్ పార్టీ గెలుపు అంత సులభం కాకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. లాలూ ప్రసాద్ ప్రస్తుతం జైల్లో ఉన్నా ఆయన పార్టీపై ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదని, ఆయన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కచ్చితంగా మంచి ప్రభావమే చూపుతాయని భావిస్తున్నారు. దీంతో జేడీ (యూ)-బీజేపీ కూటమి, కాంగ్రెస్, ఆర్‌జేడీ కూటమి మధ్య ఈ ఎన్నికల్లో పోరు హోరాహోరీగా జరగనుంది. దీనిలో విజయం ఎవరు సాధిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.