జాతీయ వార్తలు

దైవదూషణ కేసులో మహిళకు మరణశిక్ష రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 31: దైవదూషణకు పాల్పడిందన్న ఆరోపణపై మరణశిక్ష విధించబడిన ఒక క్రైస్తవ మహిళపై ఆరోపణలను కొట్టివేస్తూ ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తూ పాకిస్తాన్ సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మతపరమైన చట్టాలపై మైలురాయి అనదగ్గ ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో దేశంలో ఎలాంటి అల్లర్లు, నిరసనలు జరగకుండా అదికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నలుగురు పిల్లల తల్లి అయిన ఆసియా బీబీ (47) అనే క్రైస్తవ మహిళ 2009లో పొరుగువారితో జరిగిన గొడవలో ఇస్లాంను దూషించిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆమెపై కేసు నమోదు కాగా ఇస్లాంను అవమానించిందన్న ఆరోపణలు రుజువైనందున ట్రయల్‌కోర్టు 2010లో ఆమెకు శిక్షను విధించింది. తర్వాత ఇదే కేసులో ఆమెకు 2014లో లాహోర్ హైకోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జూలై 2015న సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. దైవ నిందకు సంబంధించిన చట్టాలు 1980లో అప్పటి మిలటరీ నియంత జియావుల్ హక్ ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం దైవనిందకు పాల్పడిన వ్యక్తులకు మరణశిక్షను విధించవచ్చు. చీఫ్ జస్టిస్ సాకిబ్‌నిసర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసను విచారించి బుధవారం తీర్పును వెలువరించింది. అంతకుముందు దేశవ్యాప్తంగా మతఛాందసవాద పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు చోటుచేసుకున్నాయి. ప్రాసిక్యూషన్ ఆమెపై చేసిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నామని, వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించామని, అయితే ఆమె దైవనిందకు పాల్పడినట్టు నిరూపించే ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. నిందితురాలు ఆసియాబీబీపై ఇతర ఎలాంటి కేసులు లేకపోయినట్టయితే వెంటనే ఆమెను లాహోర్‌లోని షేక్‌పురా జైలు నుంచి విడుదల చేయాలని జస్టిస్ నిస్సార్ తీర్పుచెప్పారు. సహనం అనేది ఇస్లాం మతంలో ప్రాథమిక సూత్రమని, మతం కూడా హింసను, అన్యాయాన్ని సహించదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పు నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్‌లో ముందు జాగ్రత్త చర్యగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధానికి వచ్చే అన్ని రహదారులను నిరసనకారులు దిగ్బంధించారు. రావల్పిండితో పాటు సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పారా మిలటరీ దళాలను మోహరించారు. ముఖ్యంగా సున్నిత ప్రాంతమైన పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. నవంబర్ 10 వరకు సభలు, సమావేశాల, ధర్నాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. లాహోర్‌లో తెహ్రీక్-ఇ-లబాయిక్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే కరాచిలో కొన్ని మతసంస్థల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగినట్టు పోలీస్‌వర్గాలు తెలిపాయి.
ఆసియా బీబీని విడుదల చేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొన్ని విదేశీ శక్తుల ప్రభావం వల్లే ఈ తీర్పు వెలువడిందని జమియత్ ఉలేమా-ఇ-ఇస్లామ్‌ఫాజ్ అద్యక్షుడు ఫజలూర్ రెహమాన్ ఆరోపించారు. తీర్పుపై బీబీ లాయర్ సయిఫుల్ ముల్లోక్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు చాలా సంతోషం కలిగించే రోజని ఆమె వ్యాఖ్యానించారు. దైవదూషణకు సంబంధించిన చట్టాలు మొదటి నుంచి వివాదాస్పదమైనవేనని, ఇవి పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవని, మతస్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, ఇతర హక్కులను అవి హరిస్తున్నాయని ఆమె అన్నారు. కాగా బీబీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తీసీర్ 2011లో హత్యకు గురైన అనంతరం ఈ కేసు గురించి దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.