జాతీయ వార్తలు

ఉక్కు మనిషి.. సమైక్యతా స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రపంచంలో ఎతె్తైన 182 మీటర్ల విగ్రహం ఆవిష్కరణ * 70 వేల టన్నుల సిమెంట్, 18,500 టన్నుల స్టీలు
* 1700 మెట్రక్ టన్నుల కాంస్యం వినియోగం
కేవాడియా (గుజరాత్), అక్టోబర్ 31: భారతదేశాన్ని కుయుక్తులతో విచ్ఛిన్నం చేసే శక్తులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసంతో ధీటైన బదులు ఇచ్చారని, దేశ సమైక్యతకు, పౌరుషానికి ఆ ఉక్కుమనిషి జీవితమే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన ప్రపంచంలో అత్యంత ఎతె్తైన 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి ‘సమైక్యతా విగ్రహం’ (స్టాచూ ఆఫ్ యూనిటీ) అని నామకరణం చేసినట్లు మోదీ ప్రకటించారు. సర్దార్ సరోవర్ డ్య్యాం వద్ద ఇస్లేట్ సాధుబెట్ వద్ద అతి ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ పటేల్ లాంటి గొప్ప నేత విగ్రహం నిర్మాణం దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఉత్తేజాన్ని ఇస్తుందని, ఈ తరహా స్మారక స్థూపం నిర్మించడం నేరమేమీ కాదని ఆయన అన్నారు. భారత దేశం పటేల్ సేవలు, సాహసోపేతమైన నిర్ణయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం (153 మీటర్లు) కంటే పటేల్ విగ్రహం ఎతె్తైనదని మోదీ గుర్తుచేశారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే, 2013లో ఈ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. భవిష్యత్తు తరాలు పటేల్ దేశానికి చేసిన సేవలను గుర్తు ఉంచుకునే విధంగా ఈ విగ్రహ నిర్మాణం చేపట్టామని ప్రధాని అన్నారు. మాతృభూమిని ముక్కలు చేసేందుకు జరిగే ప్రయత్నాలను పటేల్ నిలువరించారన్నారు. భారత్ ఉనికిని ప్రశ్నించే వారికి పటేల్ విగ్రహం గట్టి జవాబు అన్నారు. భారత్ అజరామరమని, ఈ దేశ గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటుతూ, దేశ ద్రోహులకు ఈ విగ్రహమే సమాధానం ఇస్తుందన్నారు. ఒకటే దేశం, అత్యున్నతమైన శక్తివంతమైన భారత్ అనే నినాదానికి ఈ విగ్రహం నిరంతరం శక్తిని ఇస్తుందన్నారు. గొప్ప నేతల చరిత్రను ప్రజలకు అందించే ప్రక్రియలో భాగంగా ఈ మహత్తర ప్రాజెక్టును నిర్మించామన్నారు. సర్దార్ పటేల్ విగ్రహం, ఢిల్లీలో మ్యూజియం, డాక్టర్ భీమారావు అంబేద్కర్ పంచ తీర్థను ప్రవేశపెట్టామన్నారు. ముంబయిలో ఛత్రపతి శివాజీ విగ్రహం నిర్మిస్తున్నామని, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు చరిత్రను వక్రీకరించే విధంగా మాట్లాడుతున్నాయన్నారు. మన జాతీయ నాయకులను స్మరించుకోవడం, వారికోసం స్మారక స్థూపాలను నిర్మించడం నేరమా అని ఆయన ప్రజలను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. మోదీ ఈ కార్యక్రమంలో 55 నిమిషాల సేపు భావోద్వేగంతో ప్రసంగించారు. కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్ ఈ విగ్రహంలో కనపడుతోందన్నారు. దేశాన్ని విభజించే పార్టీలకు పటేల్ విగ్రహం ధీటుగా బదులిస్తుందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పటేల్ సాహసమైన నిర్ణయాలు తీసుకుని ఉండకపోతే సంక్షోభాలు తీవ్రమయ్యేవన్నారు. జునాగఢ్‌లో సింహాలు, సోమనాథ్ ఆలయాన్ని చూడాలనుకున్నా, హైదరాబాద్‌లో చార్మినార్‌ను తిలకించాలనుకున్నా వీసాలు తీసుకునే పరిస్థితి ఉండేదన్నారు. భారత్‌ను ముక్కలు చేయాలనే దుష్టబుద్ధి నేతల ఆగడాలను పటేల్ తుత్తునియలు చేశారన్నారు. కౌటిల్యుడి చాతుర్యం, శివాజీ శౌర్యం కలయికనే పటేల్ అనర్నారు. భారత దేశ కళా నైపుణ్యం, కౌశల్యంకు చిహ్నం పటేల్ విగ్రహమన్నారు. జీఎస్‌టీ ద్వారా భారత్‌లో జాతీయసమైక్యతను పెంపొందించిన ఘనత తమ పభుత్వానికి దక్కుతుందన్నారు. పటేల్ చొరవ వల్ల 1947లో దేశంలోని 550 సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యాయన్నారు. హైదరాబాద్ నవాబు నిజాం, జునాగఢ్ నవాబ్ పొరుగుదేశంతో కలవాలనుకునే దుష్టపన్నాగాలను పటేల్ భగ్నం చేశారు. ఉక్కు మనిషి పటేల్ 143వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇతర సీనియర్ నేతలు, పటేల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

రంగురంగుల పూలతో కనువిందు..
పటేల్ విగ్రహం పైన వైమానిక దళానికి చెందిన విమానాలు రంగురంగుల పూలు వెదజల్లుతూ కనువిందు చేశాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2989 కోట్లు ఖర్చయింది. 182 మీటర్ల ఎత్తు, 25 మీటర్ల వ్యాసంలో నిర్మించారు. అద్భుతమైన ఈ విగ్రహం నిర్మాణానికి 70వేల టన్నుల సిమెంట్, 18,500 టన్నుల ఉక్కు, ఆరువేల టన్నుల స్ట్రక్చరల్ స్టీలు, 1700 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు. 135 మీటర్ల ఎత్తు వరకు లిఫ్ట్‌ల ద్వారా వెళ్లవచ్చు. అక్కడి నుంచి పరిసరాల్లోని డ్యాం, పర్వతాల అందమైన సముదాయాన్ని తిలకించవచ్చును. భారతదేశంలో విలీనానికి అంగీకరించిన సంస్థానాధీశుల జ్ఞాపకాలతో ఒక మ్యూజియంను నిర్మించాలన్నారు. ఈ విగ్రహం, డ్యాం నిర్మాణం వల్ల నిరాశ్రయులైన గిరిజనులకు ఉపాధి కల్పించాలన్నారు. ఉపన్యాసం తర్వాత మోదీ విగ్రహం వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. అంతకు ముందు పూజలు నిర్వహించారు.
కాగా మోదీ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కొద్ది సేపటికి ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ప్రధాని మోదీ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కానీ పటేల్ నిర్మించిన వ్యవస్థలను ధ్వంసం చేశారు’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.