జాతీయ వార్తలు

కూటమికి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బీజేపీని ఓడించేందుకే చేతులు కలిపాం * ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్న నేతలు
న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏను వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా, ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడేందుకు రంగం సిద్ధమైంది. ఈ పార్టీలను ఒక తాటిపైకి తెచ్చే బాధ్యతను తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అప్పగించారు. చంద్రబాబుతోపాటు శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా సమైక్య ప్రతిపక్షం కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. చంద్రబాబు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులతో చర్చలు జరిపిన అనంతరం త్వరలోనే ఢిల్లీలో జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినాయకుడు ఫరూక్ అబ్దుల్లాతో విడివిడిగా జరిపిన చర్చలు ఫలించాయి. బీజేపీయేతర ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చే బాధ్యత చంద్రబాబుకు లభించింది. కష్టతరమైన ఈ పనిని సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పడుతున్న కమిటీకి చంద్రబాబు, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా కన్వీనర్లుగా వ్యవహరించాలని తీర్మానించారు. మోదీ పాలన నుండి దేశాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రకటించనున్నాయి.
బీజేపీని ఓడించేందుకు కలిసి పని చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు ఒక చారిత్రక సంయుక్త ప్రకటన చేశారు. దేశం, ప్రజాస్వామ్యం, ఆర్‌బీఐ తదితర సంస్థల పరిరక్షణకు తామంతా కలసి పని చేసేందుకు సిద్ధమయ్యామని రాహుల్, చంద్రబాబు సమావేశానంతరం విలేఖరులతో చెప్పారు. వీరిద్దరూ చర్చలు ముగిసిన అనంతరం కలిసి బైటికి నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై విలేఖరులను ఉద్దేశించి ప్రసంగించి, ప్రతిపక్ష చరిత్రలో నూతనాధ్యాయం సృష్టించారు. దేశం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తుపై దృష్టి సారించాలనే నిర్ణయానికి వచ్చామని వారు ప్రకటించారు. దేశంలోని అతిపెద్ద ప్రతిపక్షమైన కాంగ్రెస్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలన్నీ ముందుకు సాగుతాయని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణతోపాటు వివిధ జాతీయ సంస్థలను నాశనం చేస్తున్న మోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు.

విందు సమావేశం
చంద్రబాబు, ఫరూఖ్ అబ్దుల్లా గురువారం మధ్యాహ్నం శరద్ పవార్ నివాసంలో విందు సమావేశం జరిపి, ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించారు. చంద్రబాబు విమానాశ్రయం నుండి నేరుగా పవార్ నివాసానికి వెళ్లారు. ముగ్గురు నాయకులు దాదాపు గంటసేపు చర్చలు జరిపిన అనంతరం ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు ఆయా పార్టీల నాయకులతో చర్చలు జరిపే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు. ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరిపిన అనంతరం ఢిల్లీలో జాతీయ స్థాయి ప్రతిపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మోదీని ఓడించవలసిన అవసరం వచ్చిందని శరద్ పవార్ విలేఖరులతో చెప్పారు. మోదీ హయాంలో దేశం సమస్యల సుడిగుండంలో పడిపోయిందని, రోజురోజుకూ పరిస్థితి మరింత క్షీణిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఈ స్థితిలో దేశాన్ని రక్షించుకోవడానికి ప్రతిపక్షాలు ఒకేతాటిపైకి రావాలనే అభిప్రాయం గురువారం నాటి సమావేశంలో వ్యక్తమైందని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ప్రతిపక్షాలు త్వరలోనే ఢిల్లీలో సమావేశమై భవిష్యత్ కార్యక్రమాన్ని తయారు చేసుకుంటాయని ప్రకటించారు. దేశం ఎదుర్కొంటున్న గడ్డు సమస్యలను దృష్టిలో ఉంచుకొని, సమైక్యంగా పని చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉన్నదని చంద్రబాబు చెప్పారు. ‘మేము అధికారం, పదవుల కోసం కలవటం లేదు. దేశం, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవడమే మా లక్ష్యం’ అని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.