జాతీయ వార్తలు

దక్షిణాదిపై వివక్ష లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 12: నిధుల పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేంద్రం నుంచి అందే నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని తగ్గంచేందుకు ఆయన యత్నించారు. ఇక్కడ అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వం సహకార సమాఖ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల పట్ల తమ ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. జనాభా నియంత్రణను సమర్ధవంతంగా పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా శిక్షించడం కేంద్రానికి ఎంతవరకు సబబని ఇక్కడి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో మోదీ... 15వ ఆర్థిక సంఘం కొన్ని రాష్ట్రాల పట్ల వివక్షగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు అర్థంలేనివని కొట్టిపారేశారు. ‘జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రం, 15వ ఆర్థిక సంఘాన్ని కోరింది. జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు ఈ ప్రోత్సాహకాలను అందుకోవచ్చు. ప్రయోజనం పొందవచ్చు’ అని ప్రధాని అన్నారు. కానీ ప్రోత్సాహం ఎంతమేర ఉంటుంది ఆయన స్పష్టం చేయలేదు. మా మంత్రం ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ అన్నారు. అందరం కలిసి మన స్వాతంత్య్ర సమరయోధులు గర్వించేలా సరికొత్త భారత్‌ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. కాగా మోదీ చెన్నైకి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు జరిగాయి. నల్లని ఒక పెద్ద బెలూన్‌ను ఎగురవేశారు. రాష్ట్రాలకు నిధులు కేటాయించడంలో, 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం, 15వ ఆర్థిక సంఘాన్ని కోరడం దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తికి కారణమైంది. జనాభా నియంత్రణలో పూర్తిగా విఫలమైన ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అధిక నిధులు మంజూరు చేయడం, జనాభా తక్కువ పేరుతో తమకు నిధుల్లో కోత విధిస్తారంటూ దక్షిణాది రాష్ట్రాల నేతలు విమర్శిస్తున్నారు. ‘మేం మీకు ఇచ్చేది ఎక్కువ, బదులుగా మీనుంచి పుచ్చుకునేది చాలా తక్కువ’ అని వారు పేర్కొంటున్నారు. ఎప్పటిమాదిరిగానే 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని వారు కోరుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరింత ముందుకెళ్లి, ఉత్తర భారత్‌కు, దక్షిణ భారత్ ‘రాయితీ’ కల్పిస్తున్నదని విమర్శించారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై నేరుగా ఇప్పటివరకు ఏవిధమైన ప్రకటన చేయలేదు.డిఎంకె నేత స్టాలిన్ పది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. మోదీ ప్రభుత్వం చర్య ఏవిధమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందీ ఇందులో స్పష్టంగా వివరించారు. ఇటీవల తిరువనంతపురంలో సమావేశమైన దక్షిణ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా కేంద్రం తీసుకున్న ఏకపక్ష చర్యపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.