జాతీయ వార్తలు

నవశకారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 24: భారత్-అమెరికా మధ్య చారిత్రక సంబంధాల్లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఓ నవశకాన్ని ఆవిష్కరించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా అత్యంత విస్తృతమైన, సన్నిహితమైన బంధానికి, అనుబంధానికి కేంద్ర బిందువు అయ్యాయని మోదీ తెలిపారు. గుజరాత్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ ‘కొత్త చరిత్ర ఉద్భవించింది. భారత్-అమెరికా మధ్య నవశకం ఆరంభమైంది’ అని అన్నారు. అలాగే, ఇందుకు సంబంధించి సరికొత్త సంబంధాలు, సవాళ్లు, అవకాశాలు, పరివర్తనకు సంబంధించిన పునాదులు బలంగా పడ్డాయని మోదీ అన్నారు. 21వ శతాబ్దం మనుగడను భారత్-అమెరికా మధ్య సంబంధాలే నిర్దేశించబోతున్నాయని మోదీ స్పష్టం చేశారు. భారత్-అమెరికాది సహజసిద్ధమైన భాగస్వామ్యమని దాదాపు లక్షమందికి పైగా హాజరైన ప్రజల హర్షధ్వానాల మధ్య మోదీ ప్రకటించారు. ఆద్యంతం మోదీ ప్రసంగానికి ప్రజలు హర్షధ్వానాలు పలుకుతూనే వచ్చారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా అన్నిరంగాల్లోనూ లోతైన మైత్రి కొనసాగుతోందని వెల్లడించిన మోదీ భారత్‌కు అత్యంత విస్తృతమైన వాణిజ్య భాగస్వామ్య దేశంగా అమెరికా
ఆవిర్భవించిందని అన్నారు. అలాగే, అమెరికాతో కలిసి భారత సైన్యం అతి పెద్ద యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటోందని అన్నారు. కొత్త దశాబ్ద ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ రావడం అన్నది ఓ పెద్ద అవకాశమని మోదీ వెల్లడించారు. కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల అనుబంధం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందని మోదీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు తన కుటుంబ సమేతంగా భారత్‌కు రావడం ఇరు దేశాల అనుబంధానికి నిదర్శనమని అన్నారు. ‘ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి స్వాగతం’ అంటూ ట్రంప్‌కు మోదీ ఆహ్వానం పలికారు. ట్రంప్ పర్యటనతో ఆవిష్కృతమైన కొత్త శకం ఇరు దేశాల ప్రజల ప్రగతికి, సమృద్ధికి ఓ కీలక అంకం కాబోతోందని మోదీ తెలిపారు. ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి ఎంతో అవకాశం ఉందని పేర్కొన్న మోదీ కష్టపడడంలోనూ, కొత్త ఆవిష్కరణలు చేయడంలోనూ రెండు దేశాల మధ్య ఎంతో సారూప్యత ఉందని తెలిపారు. అవకాశాలను, సవాళ్లను పంచుకుంటున్న ఈ దేశాలు ఆశలు, ఆకాంక్షలకు కూడా ఉద్దీపన పడుతున్నాయని అన్నారు. ఆరోగ్య రంగంలో ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన బంధం పరస్పర విశ్వాసమేనని మోదీ తెలిపారు. ‘విశ్వాసం చెక్కుచెదరనపుడే స్నేహం వెల్లివిరుస్తుంది’ అంటూ ఓ సామెతను ఈ సందర్భంగా మోదీ ఉటంకించారు. గత రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం బలపడుతూ వచ్చిందని, ఇప్పుడు కొత్త శిఖరాలను అధిరోహించిందని తెలిపారు. 130 కోట్ల మంది భారతీయులు ఉమ్మడిగా నవభారతాన్ని నిర్మిస్తున్నారని, భారత యువశక్తి సరికొత్త ఆశలతో వినూత్న లక్ష్యాలను నిర్దేశించుకుందని, వీటిని సాధించుకోవడమనే నవభారత నిర్మాణానికి గీటురాయని మోదీ తెలిపారు. ఏకకాలంలో గరిష్టస్థాయిలో ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్న ఘనతను సాధించి భారత్ ప్రపంచ రికార్డును స్థాపించిందని, అదేవిధంగా సమీకృత ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడంలోనూ రికార్డు సాధిస్తోందని అన్నారు. అమెరికాతోనే భారత్‌కు అత్యంత విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్యం ఉందని మోదీ అన్నారు.

*చిత్రం... మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ