జాతీయ వార్తలు

తేలని చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 20మంత్రి పదవులు ఇచ్చేందుకు జేడీ(ఎస్) ఓకే * కాంగ్రెస్ చర్చల బాధ్యత వేణుగోపాల్‌కు అప్పగింత
* కేబినెట్ తుది రూపుపై నేడు బెంగళూరులో భేటీ * అధికార సమతూకానికి ఇరువర్గాల యత్నం
న్యూఢిల్లీ, మే 21: కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్న జేడీ(ఎస్)-కాంగ్రెస్ కూటమి, పదవుల పంపకాల విషయంలో సోమవారం ఒక అవగాహనకు రాలేకపోయాయి. ఏ పార్టీ ఎన్ని మంత్రి పదవులు తీసుకోవాలి? ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది ఉండాలి? అనే అంశాలపై కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య ఎలాంటి అవగాహనా కుదరలేదు. జేడీ(ఎస్) అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి కేబినెట్ ఏర్పాటుపై సమాలోచనలు జరిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతిని సైతం మర్యాదపూర్వకంగా కలుసుకుని, బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. బెంగళూరులో మంగళవారం కాంగ్రెస్, జేడీ(ఎస్) సీనియర్ నేతలు సమావేశమై అన్ని అంశాలపై చర్చలు జరిపి నిర్ణయానికి వస్తారని కుమారస్వామి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసిన అనంతరం మీడియాకు వెల్లడించారు. కుమారస్వామి బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం తెలిసిందే. అయితే సీఎంగా ఆయనే ప్రమాణ స్వీకారం చేస్తారా? లేక ఒకరిద్దరు ఉప ముఖ్యంత్రులు, మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేస్తారా? అనేది స్పష్టం కావటం లేదు. సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపిన అనంతరం రాహుల్‌గాంధీతో కేబినెట్ ఏర్పాటుపై చర్చించినట్టు కుమారస్వామి వెల్లడించారు. జేడీ(ఎస్)తో కేబినెట్ ఏర్పాటుపై
చర్చించే అధికారాన్ని పార్టీ కర్నాటక ఇన్‌చార్జి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌కు ఇచ్చారని కుమారస్వామి వెల్లడించారు. కాంగ్రెస్ రెండు ఉప ముఖ్యమంత్రి పదవులతోపాటు 20 మంత్రి పదవులు కోరుతోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు 20 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగావున్నా, రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల విషయంలోనే రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదని అంటున్నారు. కాంగ్రెస్‌కు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. తమకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వటం ద్వారా అధికారాన్ని సమతూకం చేసేందుకు వీలు కలుగుతుందని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే, కుమారస్వామి మాత్రం కాంగ్రెస్ ప్రతిపాదనను ఆమోదించటం లేదు. కాంగ్రెస్‌కు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వటం వలన రెండు పార్టీల మధ్య అధికార సమతూకం సాధ్యంకాదని భావిస్తున్నారు. అందుకే కేబినెట్ ఏర్పాటుపై రాహుల్‌గాంధీతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. కేబినెట్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలకు రాహుల్‌గాంధీ ఆమోదం తెలిపారు, కర్నాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మంగళవారం బెంగళూరులో తమ పార్టీ నేతలతో సమావేశమై కేబినెట్ రూపురేఖలను ఖరారు చేస్తారని కుమార్‌స్వామి విలేఖరులతో చెప్పారు. జేడీ(ఎస్)తో చర్చించి కేబినెట్ రూపురేఖలను ఖరారు చేసే అధికారాన్ని వేణుగోపాల్‌కు రాహుల్ అప్పగించినట్టు కుమారస్వామి చెప్పారు. బుధవారం సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా? లేక ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు ‘అన్ని విషయాలు రేపు ఖరారు చేస్తాం’ అని బదులిచ్చారు. అయితే కాంగ్రెస్, జేడీ(ఎస్)లు కర్నాటకకు స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తాయన్న ధీమాను కుమారస్వామి వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మొదట సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలిసి కర్నాటక పరిణామాలు, కేబినెట్ ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. ఇది జరిగిన తరువాతే కుమారస్వామిని సోనియా, రాహుల్ కలుసుకోవటం గమనార్హం.