జాతీయ వార్తలు

ఆరోగ్యమే సౌభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ పథకం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇతర ఆరోగ్య సంబంధ పథకాల లబ్ధిదారులతో ప్రధాని వీడియో బ్రిడ్జ్‌ద్వారా సమీక్షించారు. దేశాభివృద్ధికి ప్రజారోగ్యమే మూలమని, 125కోట్ల మంది ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే గొప్ప దేశం కాగలుగుతుందని స్పష్టం చేశారు. అనారోగ్యం కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని కుంగదీస్తుందని ఆయన హెచ్చరించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు వైద్య సేవలను అందజేయాలనే లక్ష్యంతోనే ప్రధాన మంత్రి జన ఔషధ పథకాన్ని ప్రారంభించినట్లు మోదీ చెప్పారు. సరసమైన ధరలకు వైద్యాన్ని అందజేయటం ద్వారా బీద, మధ్య తరగతి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలన్నది తమ ప్రభుత్వం లక్ష్యమని ఆయన చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 3,600 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఏడు వందలకుపైగా ఔషధాలను సరసమైన ధరలకు అందజేస్తున్నామని తెలిపారు. అలాగే గుండెకు సంబంధించిన స్టెంట్ ధరలను 2లక్షల నుండి 29వేల రూపాయలకు తగ్గించామని ప్రధాని స్పష్టం చేశారు. మోకాలి చిప్పల మార్పిడి (నీ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్స ఫీజులను కూడా 60 నుంచి 70 శాతం తగ్గించామని అన్నారు. దేశంలో ప్రతి ఏటా ఒకటిన్నర లక్షల వరకు మోకాలి చిప్పల మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. దీంతో ప్రజలకు దాదాపు 1500కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని వెల్లడించారు. ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం ద్వారా ఇంతవరకు 22లక్షల మందికి డయాలసిస్ చేయటం జరిగిందని, వీరినుండి కేవలం 2లక్షల 25వేల రూపాయలు మాత్రమే తీసుకోవడం జరిగిందని చెప్పారు. దేశంలోని 500 జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ చేస్తున్నారని తెలిపారు. మిషన్ ఇంద్రధనుష్ పథకం కింద 528 జిల్లాల్లోని 3కోట్ల 15లక్షల మంది పిల్లలు, 80లక్షల మంది గర్భిణులకు టీకా మందు ఇవ్వటం జరిగిందని వివరించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు ఆసుపత్రుల నిర్మాణం, ఎక్కువ పడకల ఏర్పాటు, వైద్యులను నియమించేందుకు తమ ప్రభుత్వం 92 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయటంతోపాటు 15వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచామని తెలిపారు. ప్రజలకు సరసమైన ధరలకు వైద్య, ఆరోగ్య సేవలు అందేలా చూసేందుకే తమ ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించిందని ప్రధాని తెలిపారు. ఈ కార్యక్రమం కింద పది కోట్ల కుటుంబాలకు 5లక్షల రూపాయల విలువ చేసే ఆరోగ్య, వైద్య బీమా పథకం పరిధిలోకి తెస్తున్నామని మోదీ చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణంలో కీలకపాత్ర నిర్వహిస్తోందని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం మూలంగా దేశంలోని మూడున్నర లక్షల గ్రామాల్లోని ప్రజలకు సొంత మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయని, దేశంలో పారిశుద్ధ్య స్థాయి 38 శాతానికి పెరిగిందని ప్రధాన మంత్రి వివరించారు. ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణంకోసం ప్రజలు ప్రతిరోజు యోగా చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. యోగాను దైనందిన కార్యక్రమాల్లో భాగంగా మలుచుకోవాలని హితవు పలికారు.