జాతీయ వార్తలు

కర్నాటకలో ‘కాలా’కు నిరసనల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 7: ప్రముఖ నటుడు రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాకు కర్నాటకలో కావేరి సెగ తగిలింది. గురువారం రాష్ట్రంలో విడుదలైన ఈ సినిమాను ప్రదర్శించకుండా పలుచోట్ల కన్నడిగులు అడ్డుకున్నారు. పలు సినిమా హాళ్ల వారు సైతం ఈ సినిమాను ప్రదర్శించమని పేర్కొనడంతో తమిళ సూపర్‌స్టార్ రజనీ అభిమానులు నిరాశ చెందారు. బెంగళూరులో ఈ సినిమా ప్రదర్శితమైన అన్ని థియేటర్ల ముందు ఆందోళనకారులు నిరసన తెలిపారు. కావేరి జలాల వివాదంపై రజనీకాంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం నెలకొంది. రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలతో కర్నాటక ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందువల్ల రాష్ట్రంలో ఆ సినిమాను ఆడనీయమని కన్నడిగులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గురువారం పలు థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. బెంగళూరులో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు నిరసన వ్యక్తం చేసి, ప్రదర్శనను ఆపివేయించారు. ప్రేక్షకులు ఈ సినిమాను బహిష్కరించి, కన్నడ రైతులకు సంఘీభావం తెలపాలని వారు కోరారు. మైసూర్‌లో ఆందోళనకారుల నిరసన ఫలితంగా కొన్ని థియేటర్లను సినిమాను ఆలస్యంగా ప్రారంభించారు. బళ్లారి, రాయచూర్ జిల్లాల్లో ఈ సినిమాను ప్రదర్శించడానికి ప్రయత్నించగా కర్నాటక రక్షణ వేదిక (కెఆర్‌వి) ఆధ్వర్యంలో ఆందోళనకారులు థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ‘ఈ సినిమా కంటే కావేరి వాటర్ సమస్య మనకు చాలా ముఖ్యం’ అని తాము చేసిన విజ్ఞప్తికి ప్రేక్షకులు స్పందించారని కెఆర్‌వి ప్రతినిధి ప్రవీణ్‌శెట్టి చెప్పారు.
ఇలావుండగా కాలా సినిమాను కర్నాటక రాష్ట్రంలో ప్రదర్శింపనీయరాదని మే 29న కర్నాటక ఫిలిం చాంబర్ నిర్ణయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా రాష్ట్రంలో ఆ సినిమాను ప్రదర్శించవద్దని కాలా డిస్ట్రిబ్యూటర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే సినిమాను నిషేధించడానికి వీలులేదని ఆ రాష్ట్ర హైకోర్టు ఐదున తీర్పు చెప్పింది. అంతేకాకుండా కాలా చిత్రాన్ని శాంతియుతంగా ప్రదర్శించడానికి థియేటర్ల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆ చిత్ర ప్రదర్శనను ఆపే హక్కులేదని బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కాలా చిత్రం గురువారం కర్నాటకలో నిరసనల మధ్య విడుదలైంది.