జాతీయ వార్తలు

ఇక వర్షాలే వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: దేశవ్యాప్తంగా ఈ వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతుండగా, రుతు పవనాల ప్రభావం కారణంగా ఈ వారంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. జమ్మూకాశ్మీర్, తమిళనాడు, అస్సాం, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వర్ష పాతం మరింత ఎక్కువగా ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది. రుతు పవనాలు ఈసారి ఎప్పటి కంటే కనీసం 17 రోజులు ముందుగానే ప్రవేశిస్తాయని, దీని ప్రభావంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా సుదూరంగా ఉండే ఉత్తరాఖండ్ రాష్ట్రంతోపాటు ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతంలోనూ అతి భారీ వర్షాలు ఉండవచ్చని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్‌లోని హిమాలయ సమీపంలోని ప్రాంతాలతోపాటు సిక్కిం, బీహార్, అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోనూ ఈ వారంలో వర్షాలు భారీగానే పడతాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్, హర్యానాలోని ఉత్తర ప్రాంతంలో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, నాగాలండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గోవా రాష్ట్రాలు, కోన్‌కణ్ తీర ప్రాంతంలో రుతు పవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. అదే విధంగా రాయలసీమ, తమిళనాడు, లక్షద్వీప్, కర్నాటక తీర ప్రాంతంలో కుండపోత తప్పకపోవచ్చని ప్రకటించింది. కాగా, అస్సాం, మేఘాలయ, ఉత్తారాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మంగళవారం నుంచే భారీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించింది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా ఈవారంలోనే వర్షాలు మొదలవుతాయని, చాలా చోట్ల భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ప్రాంతంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే, రుతుపవనాల ప్రభావం పూర్తి ప్రభావం చూపడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.