జాతీయ వార్తలు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవానికి తాపత్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ శ్రీకారం చుట్టారు. సోమవారం రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడును కలిసి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించారు. ఏకగ్రీవ పద్ధతిలో ఎన్నుకునేందుకు తాను ప్రతిపక్షంతో జరుపుతున్న చర్చల గురించి ఆయన వెంకయ్యనాయుడుకు వివరించారు. మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపిన విషయాన్ని కూడా ఆయన వెంకయ్యనాయుడు దృష్టికి తెచ్చారు. ప్రతిపక్షంతో చర్చలు జరిపిన తరువాతనే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తేదీని ఖరారు చేయాలని నిర్ణయించారు. 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలోనే్న డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగవలసి ఉంది. ఇంతకాలం డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీజే కురియన్ జూలై ఒకటో తేదీన డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ సభ్యత్వానికి విరమణ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై విజయ్‌గోయల్ ఈ వారంలో ప్రతిపక్ష పార్టీల నాయకులతో చర్చలు జరుపుతారు.
బీజేపీ ప్రతిపాదించే అభ్యర్థి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కాకుండా చూసేందుకు ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టీఎంసీ, తెలుగుదేశం తదితర ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నించటం తెలిసిందే. ప్రతిపక్షానికి చెందిన నాన్-కాంగ్రెస్ నాయకుడిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకోవాలన్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ వ్యూహం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మమతా బెనర్జీ ప్రతిపాదించే అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు అంగీకరించారు. మమతా బెనర్జీ తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సుఖేందుశేఖర్ రాయ్, బీజేడీ సీనియర్ నాయకుడు ప్రసన్న అచార్య పేర్లు ప్రతిపాదిస్తున్నారు. అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో ఒడిశ్శా ముఖ్యమంత్రి, బీజేడీ అధినాయకుడు నవీన్ పట్నాయక్ ఆచితూచి అడుగు వేస్తున్నారు. ప్రతిపక్షానికి మద్దతు ఇచ్చే అంశంపై ఆయన ఇంతవరకు నోరు విప్పలేదు. నవీన్ పట్నాయక్ ఆఖరు నిమిషయంలో బీజేపీకి మద్దతు ఇస్తే ప్రతిపక్షం అభ్యర్థి విజయం సాధించలేడు. అందుకే ప్రతిపక్షం తమ అభ్యర్థి పేరును బైటపెట్టటం లేదు. ప్రతిపక్షం సీనియర్ నాయకులు ఈ వారంతంలో ఢిల్లీలో సమావేశమై అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని ఎంపిక చేయవచ్చు.
ఇదిలా ఉంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి దక్కకుండా చూసేందుకు బీజేపీ ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. డిప్యూటీ చైర్మన్ పదవి తీసుకునేందుకు శివసేన నిరాకరించటంతో బీజేపీ అధినాయకత్వం ప్రత్యామ్నాయంగా అకాలీదళ్ సీనియర్ నాయకుడు నరేష్ గుజ్రాల్ పేరును తెరపైకి తెస్తోంది. తమ పార్టీ అభ్యర్థికి బదులు మిత్రపక్షాల అభ్యర్థిని రంగంలోకి దించితే తొమ్మిది మంది సభ్యులున్న బీజేడీ మద్దతు లభిస్తుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అకాలీదళ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు ఆరుగురు రాజ్యసభ సభ్యులున్న టీఆర్‌ఎస్, ముగ్గురు సభ్యులున్న వైఎస్‌ఆర్‌సీపీలకు అభ్యంతరం ఉండకపోవచ్చునని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ మూడు పార్టీలు ఏ గ్రూపుకు మద్దతు ఇస్తే ఆ గ్రూపు అభ్యర్థి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని అలంకరిస్తారు.