జాతీయ వార్తలు

అది భిన్న సంస్కృతిపై దాడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: భిన్న సంస్కృతులకు వ్యతిరేకంగానే అఫ్గానిస్తాన్‌లో దాడి జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన, మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. అఫ్గాన్ జలాలాబాద్‌లో ఆదివారం జరిగిన మానవ బాంబు దాడిలో 20మంది సిక్కు జాతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. సిక్కులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని, భిన్న సంస్కృతి వేళ్లూనకుండా భయోత్పాతం సృష్టించేందుకు ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దాడికి తీవ్రంగా ఖండిస్తున్నాననీ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో అఫ్గాన్‌కు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, సిక్కు మైనారిటీలే లక్ష్యంగా మానవ బాంబు దాడి జరిగిందని, మరణించిన 20మందిలో ఎక్కువమంది సిక్కులేనని జలాలాబాద్ జిల్లా అధికారులు వెల్లడించారు. నగరంలోని ఓ ఆసుపత్రి ప్రారంభానికి విచ్చేసిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పర్యటన ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. దాడి ధాటికి ముఖాబెరత్ స్క్వేర్‌లోని పలు దుకాణాలు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధ్యక్షుడు ఘనీని కలిసేందుకు ఓ వాహనంలో విచ్చేసిన సిక్కులను లక్ష్యంగా చేసుకుని మానవ బాంబు పేలిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. తాలిబన్ ఉగ్రవాదులను అణచివేయాలంటూ అధ్యక్షుడు అఫ్గాన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తమ ఉనికిని చాటుకునేందుకు, ఉద్రిక్తతలను పెంచేందుకు జరిగిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు.