జాతీయ వార్తలు

పదవి కోసమే విపక్షాల ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రాంతీయ పార్టీల స్థాయికి కాంగ్రెస్ పడిపోయింది *కొన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే కరవయిందని ఎద్దేవా
న్యూఢిల్లీ, జూలై 3: తనను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ప్రతిపక్షాలు మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నాయి తప్ప దేశంకోసం, దేశ ప్రయోజనాల కోసం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటు విమర్శలు గుప్పించారు. స్వరాజ్య పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతిపక్షాలపై మోదీ విమర్శల వర్షం కురిపించారు. దేశం కోసం, దేశ ప్రజల ప్రయోనాల పరిరక్షణ కోసం ఒకటి కావాలి తప్ప ఇలా ఒక వ్యక్తి (నరేంద్ర మోదీ)ని ఓడించేందుకు ఒకటి కావటం ఏమిటని ఆయన నిలదీశారు. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతిపక్షాల కూటమి వలన ఎన్‌డీఏకు దెబ్బ తగులుతుందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు మోదీ బదులిస్తూ- ప్రతిపక్షాలు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న మహాకూటమిని 1977, 1989లో ఏర్పడిన ప్రతిపక్షాల కూటమితో పోల్చటం సరైంది కాదు. 1977లో అత్యవసర పరిస్థితుల మూలంగా ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిన పరిస్థితుల్లో ప్రతిపక్షాల మహాకూటమి ఏర్పడింది. అదేవిధంగా బోఫోర్స్ తదితర కుంభకోణాల మూలంగా దేశం అవినీతిలో మునిగిపోవటం వలన ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం మహాకూటమిని ఏర్పాటు చేసిందని అన్నారు. కాని ఇప్పుడు ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాలు, ప్రజలకోసం మహాకూటమిగా ఏర్పడటం లేదు. కేవలం అధికారమే పరమావధిగా, రాజకీయ మనుగడను కాపాడుకునేందుకు మహాకూటమిగా ఏర్పడుతున్నాయని ప్రధాన మంత్రి దుయ్యబట్టారు. 2014 తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారు. తమ పార్టీకి ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో లభించిన విజయం చారిత్రాత్మికం. అందుకే 2019లో కూడా ప్రజలు తమను గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం తనకున్నదని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం సంకీర్ణ రాజకీయాల్లో బీజేపీ కంటే ఒక్క అడుగు ముందున్నట్లుందని విలేఖరి సూచించగా సంకీర్ణ రాజకీయాల గురించి కాంగ్రెస్ ఏమనుకుంటుందనేది దేశ ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మోదీ సూచించారు. కాంగ్రెస్ 1998లో మధ్య ప్రదేశ్‌లోని పచ్‌మడీలో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంకీర్ణ రాజకీయాలు ఎక్కువ కాలం నిలవవు. ఏక పార్టీ పరిపాలన త్వరలోనే వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేయటం మరిచిపోరాదని ప్రధాని గుర్తు చేశారు. నాడు పచ్‌మడీలో సంకీర్ణ రాజకీయాలను ఎద్దేవా చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సీట్ల సర్దుబాటు, మిత్రపక్షాల కోసం అంగలారుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నందుకే ఆ పార్టీకి ఈ గతి పట్టిందని మోదీ దెప్పి పొడిచారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఈనాడు ప్రాంతీయ పార్టీల స్థాయికి పడిపోయిందని ప్రధాని వ్యంగ్యంగా అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం శాసనసభల్లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లేదు. కాంగ్రెస్ తన మిత్రపక్షాల పట్ల ఎలా వ్యవహరిస్తుందనేది దేశ ప్రజలకు బాగా తెలుసు, మిత్రపక్షాలను అవమానించటం, వెన్నుపోటుపొడవటం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన దుయ్యబట్టారు. రైతు నాయకులు చరణ్‌సింగ్, హెచ్‌డీ దేవెగౌడ, సోషలిస్టు నాయకుడు చంద్రశేఖర్, వీపీ సింగ్‌ల పట్ల కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందనేది అందరికీ తెలిసిందేనని మోదీ అన్నారు. ప్రతిపక్షంలో మహాకూటమి అనేదే లేదు. ప్రధాన మంత్రి పదవి కోసం పెద్ద పరుగుపందెంలో వారంతా పాల్గొంటున్నారని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రధాన మంత్రి పదవి తాను సిద్ధమేనని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనతో తృణమూల్ కాంగ్రెస్ ఏకీభవించదు. ఎందుకంటే మమత బెనర్జీకి పీఎం పదవి కావాలి. అయితే మమతా బెనర్జీని వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ నాయకుడికి మాత్రమే ప్రధాన మంత్రి పదవి చేపట్టే అర్హతలు ఉన్నాయని ఎస్‌పీ నాయకులు చెబుతున్నారు.. దీన్నిబట్టి ప్రతిపక్ష నాయకుల దృష్టంతా కేవలం ప్రధాన మంత్రి పదవిపై ఉన్నదే తప్ప దేశ ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై కాదని అన్నారు. ప్రతిపక్షాలకు ఒకరిపట్ల ఒకరికి విశ్వాసం లేదు. పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో వీరు ఒకరిపై ఒకరు పోటీ చేస్తారు. కానీ దేశ రాజకీయాల్లో మాత్రం కలిసి పని చేస్తామంటారు. ఇదేమి సఖ్యత? ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాల కూటమి ఇటీవల కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి కదా? అని ప్రశ్నించగా కర్నాటకలో మంత్రులు గొడవ పడుతున్నారు. రాష్ట్భ్రావృద్ధి వెనకబడిపోయిందని ఆయన చెప్పారు. అవకాశవాద సంకీర్ణాలు ఎక్కువకాలం మనగలగలేవని మోదీ స్పష్టం చేశారు. ఎన్‌డీఏ మిత్రపక్షాలు కూడా మీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి కదా? అని అడుగగా ఎన్‌డీఏలోని 20 పార్టీలు సంతోషంగా ఉన్నాయి. తమ కూటమి పటిష్టంగా ఉన్నదని ఆయన బదులిచ్చారు. 1984లో కేవలం రెండు లోక్‌సభ సీట్లున్న స్థితినుండి ఇప్పుడు కేంద్రంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న స్థాయికి బీజేపీ ఎదిగిందని నరేంద్ర మోదీ వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలహీనపడిందనే వాదనతో ఆయన ఏకీభవించలేదు.