జాతీయ వార్తలు

బీజేపీకి సీన్ రివర్స్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: వచ్చే ఏడాది 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి వణుకు పుట్టిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న దేశవ్యాప్త పర్యటన ముగింపు దశకు చేరుకుంది. అమిత్ షా పర్యటించిన 395 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ పరిస్థితి బీజేపీకి అంతగా అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి ఎంతమాత్రం బాగా లేదనే మాట వినిపిస్తోంది. ఒకపక్క ఉత్తరాదిలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ఫీడ్ బ్యాక్ అమిత్ షాను ఆందోళకు గురిచేస్తుంటే.. మరోపక్క దక్షిణాదిలోనూ బీజేపీకి పెద్దగా పట్టు లేదన్న విషయం స్పష్టమవుతోంది. కర్నాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పెద్దగా లోక్‌సభ సీట్లు గెలిచే పరిస్థితి లేదు. గత ఏడాది మే నుండి అమిత్ షా చేస్తున్న పర్యటన ఈ నెల 22తో ముగుస్తుంది. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డీ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు చేసుకుంటే మెజారిటీ సీట్లు కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నదని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడికి స్పష్టం చేసినట్లు తెలిసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 73 సీట్లు గెలుచుకుంటే ఎస్పీ ఐదు, కాంగ్రెస్ రెండు సీట్లలో మాత్రమే గెలిచాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మూలంగా బీజేపీకి ఇరవై కంటే ఎక్కువ సీట్లు రాకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమిత్ షా బుధ, గురువారాల్లో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పలువురు శాసన సభ్యులతో చర్చలు జరిపి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ విజయావకాశాలపై చర్చించారు. ప్రతిపక్షం మహాకూటమిని ఏర్పాటు చేస్తే బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని పలువురు ఎంపీలు పార్టీ అధ్యక్షుడికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మహాకూటమిలో కాంగ్రెస్ చేరినా, చేరకపోయినా పెద్దగా ప్రభావం ఉండదని, ఎస్పీ, బీస్పీ, అజిత్‌సింగ్ నాయకత్వంలోని ఆర్‌ఎల్‌డీ సీట్ల సర్దుబాటు చేసుకుంటే బీజేపీ విజయావకాశాలు బాగా దెబ్బతింటాయని పలువురు ఎంపీలు అమిత్ షాకు చెప్పినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ ముఖ్యంగా, యాదవ్‌లు, జాట్‌లు ఒకటైతే మెజారిటీ సీట్లు వారే గెలుచుకుంటారన్నది బీజెపీ ఎంపీలు, శాసనసభ్యుల వాదన. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏకపక్ష వ్యవహారం బీజేపీని ప్రజలకు దూరంగా తీసుకుపోతోందని పలువురు పార్టీ నాయకులు అమిత్ షాకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు పని చేయటం లేదని వారంటున్నారు. బడుగు, బలహీన వర్గాలు బీజేపీకి దూరమయ్యాయి. ఈ పరిణామం మూలంగానే గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్, కైరానా లోక్‌సభ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని వారు పార్టీ అధ్యక్షుడికి చెప్పినట్లు తెలిసింది. ఇదిలాఉంటే మిత్రపక్షాలైన శివసేన, తెలుగుదేశం పార్టీలు దూరం కావటం, అకాలీదళ్ కూడా అసంతృప్తితో ఉండటం కూడా బీజేపీకి నష్టం కలిగించే అంశమేనని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూడా బీజేపీకి దూరమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కూడా గుడ్ బై చెబితే బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటుందనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. తదుపరి అమిత్ షా నిర్వహించనున్న బిహార్ పర్యటన సందర్భంగా బీజేపీ, జేడీ(యు) సంకీర్ణ రాజకీయాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.