జాతీయ వార్తలు

ఒంటరిగానే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: తెలంగాణలో ఒంటరిగా పోరాటం, ఆంధ్రలో భావసారూప్యత గల పార్టీతో పొత్తు లేదా సీట్ల సర్దుబాటు చేసుకోవటం ద్వారా వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ, శాసన సభల ఎన్నికలను ఎదుర్కోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించిన ఆ పార్టీ అధినాయకత్వం తమ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది.
‘వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగనున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నాం. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తాం’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అంటున్నారు.
తెలంగాణలో నిజాం వారసత్వానికి వ్యతిరేకంగా పోరాడటం, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అవినీతిని ఎండగట్టటం, ప్రధాని నరేంద్ర మోదీ అందజేస్తున్న సుపరిపాలను ప్రజలకు వివరించటం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో పొత్తుకు బదులు ఒంటరిగా పోటీ చేయటమే తమకు ఉత్తమమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవటం ఎంత మాత్రం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉనికి లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాలనే ఆలోచనతో ఉంది. రాష్ట్ర శాసన సభలో 119 సీట్లుంటే ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి 91 స్థానాల్లో విజయం సాధించింది. ఏడు స్థానాలు ఎంఐఎమ్‌వి. ఇవి పోతే ఇక మిగిలేవి ఇరవై స్థానాలు. గత ఎన్నికలతోపాటు ఉపఎన్నికల్లో విజయం సాధించిన స్థానాలను వదులుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎటువంటి పరిస్థితిలోనూ సిద్ధ పడదు కాబట్టి టిఆర్‌ఎస్‌తో పొత్తు ఏ రకంగా కూడా సాధ్యం కాదన్నది బీజేపీ అంచనా. పొత్తుల ద్వారా తాము సాధించేది ఏదీ లేదు కాబట్టి అన్ని సీట్లలో అభ్యర్థులను నిలబెట్టటం ద్వారా రాష్ట్రంలో పార్టీ ఉనికిని పెంచుకోవాలని అధినాయకత్వం భావిస్తోంది. మొదట కాంగ్రెస్‌కు ఉనికి లేకుండా చేస్తే ఆ తరువాత స్థానం తమదేనని గట్టిగా నమ్ముతోంది. తెలంగాణలో మరింత పట్టుసాధించేందుకు తెరాస ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దాడికి దిగేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేపట్టిన పాద యాత్ర సత్ఫలితాలను ఇస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వేగాన్ని రాష్ట్ర నాయకత్వం అందుకుంటే తెంలగాణలో పార్టీ మరింత వేగంగా ప్రజల్లోకి వెళుతుందని అధినాయకత్వం భావిస్తోంది. ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లోపాలను ఎండగట్టడంతో పాటు మరోవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేయటం ద్వారా ప్రజల మద్దతు సంపాదించుకుంటామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలను ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటామని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని బీజేపీ జాతీయ నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాలేరని, తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ఆగ్రహం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు దుష్టపాలన, అవినీతి, ఆశ్రీత పక్షపాతాన్ని ఎండగట్టడంతో పాటు ప్రభుత్వం అసమర్థ పాలనను ప్రజలకు వివరించాలన్నది బీజేపీ వ్యూహం. ఎవరితో పొత్తు పెట్టుకుని చంద్రబాబును ఓడించాలన్న అంశంపై బీజేపీ అధినాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి వచ్చిన సూచనలు కనిపించటం లేదు. ఏపీలో వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన, ఈ రెండింటిలో ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తోంది. వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో వైకాపా, జనసేన కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ధరావతు కూడా దక్కదన్నది కమలనాథుల అంచనా. అయితే జగన్‌మోహన్ రెడ్డి, పవన్‌కళ్యాణ్ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతారా? అన్నది ఆ పార్టీ ముందున్న పెద్ద ప్రశ్న. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా జోక్యం చేసుకుంటే ఇది సాధ్యం కావచ్చునని చెబుతున్నారు. వైకాపా కంటే జనసేనతో బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. జనసేన పట్ల బీజేపీ కొంత మొగ్గు చూపిస్తోంది.