జాతీయ వార్తలు

ఆంధ్రుల ఆత్మాభిమానంపై మోదీ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు త్వరలో సరికొత్త వ్యూహాన్ని ప్రకటిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుడు ఆరోపణలతో ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని, అవమానపరిచారని ఆయన ఆరోపించారు. శనివారం హడావిడిగా ఢిల్లీకి వచ్చిన ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ సీఎం అయిన తనను అవమానించారని, అయినా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం జరుగుతున్న పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే పంజాబ్, అసోం, జమ్మూకాశ్మీర్‌లో ఏంజరిగిందో తెలియదా? అని ఆయన ప్రధానిని పరోక్షంగా హెచ్చరించారు. తాము కూడా ఈ దేశ పౌరులమేనని, తమకు న్యాయం చేయకపోతే ఎలా అని ఆయన నిలదీశారు. అవినీతిపరుడైన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో తనను పోల్చడం ఏమిటంటూనే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును ప్రశంసించడం ద్వారా తనను కించపరిచారని అన్నారు. ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోదీ మాటలు తనను గాయపరిచాయన్నారు. ప్రత్యేక హోదా సాధనతోపాటు విభజన చట్టం హామీల అమలు కోసం తాము ప్రారంభించిన పోరాటం కొనసాగుతుందని, లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి వేంకటేశ్వరుడి ముందు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోతే మట్టికొట్టుకుపోతారని ఆయన శాపనార్థాలు పెట్టారు. అమరాతి శంకుస్థాపనకు వచ్చినపుడు కూడా పలు హామీలు ఇచ్చి, ఇప్పుడు అన్నీ ఇచ్చేశామంటే ఎలా అని ప్రధానిని ఆయన నిలదీశారు. మోదీకి మెజారిటీ ఉంటే తమకు నైతికశక్తి ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. 29సార్లు ఢిల్లీకి వచ్చి విభజన హామీల గురించి అడిగినా పట్టించుకోలేదు కాబట్టే అవిశ్వాస తీర్మానం పెట్టామని ఆయన అన్నారు. ఏపీకి న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదా? లేదా? అని ఆయన నిలదీశారు. రాజ్యసభ తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారని, పిల్ల కోసం తల్లిని చంపారని మోదీ పలుమార్లు చెప్పారు కానీ ఏపీకి మాత్రం న్యాయం చేయడం లేదని అన్నారు. పిల్ల కోసం తల్లిని చంపారంటారు కానీ ఆ తల్లిని కాపాడేందుకు మోదీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేశంతో అన్నా రు. కాంగ్రెస్‌ను తప్పుపట్టిన మోదీ తన బాధ్యతలను విస్మరిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తాను మాట మార్చినట్లు ప్రధాని ఆరోపించడాన్ని చంద్రబాబు ఖండించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినవారు తరువాత మాట మార్చి ప్రత్యేక ప్యాకేజీ అన్నారని, అయితే వారే మళ్లీ మాట మార్చి ఎస్.పి.వి ఉంటేగానీ ప్యాకేజీ ఇవ్వలేమంటూ మోదీ, అరుణ్‌జైట్లీ మాట మార్చారని ఆయన ఎదురు దాడికి దిగారు. హోదా ఇవ్వరు, ప్యాకేజీ ఇవ్వరు..ఈ పరిస్థితుల్లో తానేమి చేయాలని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణం వల్లనే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామంటూ మోదీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కానందుకు తాము ఎన్.డి.ఏకి రాజీనామా చేస్తే పి.ఎం మాత్రం తనకు టెలిఫోన్ చేసి జగన్‌మోహన్ రెడ్డి ఉచ్చులో పడుతున్నావనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

టీడీపీని వైకాపాతో పోలుస్తారా?
తన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని అవినీతి ముద్రపడిన వై.ఎస్.ఆర్.సి.పితో మోదీ ఎలా పోలుస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రతివారం కోర్టుకు వెళుతున్నారని, అలాంటి వ్యక్తితో తనను పోలుస్తారా? అని ఆయన ఆవేశంగా ప్రశ్నించారు. తాను అధికారంలోకి రాగానే జగన్‌లాంటి వారినందరినీ జైల్లోపెడతానని ఎన్నికలకు ముందు చెప్పిన ప్రధాని ఇప్పుడు వారితో దోస్తీ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కర్నాటకలో గాలి జనార్దన్‌రెడ్డి లాంటి అవినీతిపరుడికి టికెట్ ఇచ్చిన మోదీ తనను వారితో పోలుస్తారా? అంటూ బాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అవినీతిపరులతో చేతులు కలుపుతూ అవినీతిని అరికడతామంటారా? ఇదేమి చోద్యం అంటూ అని ఆయన ప్రశ్నించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరిణితి చెందాడట. నేను పరిణితి చెందలేదట, ప్రధాన మంత్రి ఇలా మాట్లాడవచ్చా?’ అని చంద్రబాబునాయుడు నిలదీశారు. చంద్రశేఖరరావు తన సహచరుడని, ఒకప్పుడు కలిసి పనిచేశామని, అతనితో తనను పోల్చడం ఏమిటని అన్నారు. నరేంద్ర మోదీ 2002లో రాజకీయాల్లోకి వచ్చారని, కానీ తాను 1995లోనే ముఖ్యమంత్రిగా పనిచేశానని, తాను చాలా సీనియర్ నాయకుడనని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ తనను ఎందుకు విమర్శిస్తున్నారనేది అర్థం కావడం లేదన్నారు. ఆయన శాంతికోసం పాటుపడుతుంటే తాను గొడవ చేస్తున్నానట ఏమిటిది? ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిపి ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయనివారు మాట్లాడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌మోహన్ రెడ్డి పార్టీతో రాజకీయ గొడవల మూలంగా తానిలా చేస్తున్నానని మోదీ ఆరోపిస్తున్నారని, ఇలాంటివారితో తనను పోలుస్తారా? తాము గాయపడ్డామని, మదనపడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ.పి పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని, వేధింపులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. శాసనసభ సీట్లు పెంచమన్నా పెంచడం లేదన్నారు.