జాతీయ వార్తలు

ఈవీఎంలు వద్దే వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం), లేదా బ్యాలెట్ పేపర్ల విధానంలో నిర్వహించాలన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది నిర్వహించే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఇక్కడ అఖిలపక్ష పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు కొన్ని పార్టీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేయగా, కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీలు అందుకు వ్యతిరేకించాయని, బ్యాలెట్ పేపర్ విధానం సరైనదని కోరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అన్ని పార్టీల నుంచి స్వీకరించిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రధాన పార్టీలు కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈవిఎం మెషీన్ల ద్వారా ట్యాంపరింగ్‌కు పాల్పడే అవకాశంపై ప్రస్తావిస్తూ బ్యాలెట్ విధానంపైనే ఎక్కువగా మొగ్గుచూపాయి. మరికొన్ని పార్టీలు బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌పై ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. అఖిలపక్ష సమావేశానికి హాజరైన పార్టీలో 70 శాతం ఎన్నికలను బ్యాలెట్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని అభిప్రాయపడినట్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి తెలిపారు. ఈవీఎంల స్థానే బ్యాలెట్ విధానానే్న ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, అఖిలపక్ష సమావేశానికి హాజరైన పార్టీల్లో ఎక్కువ శాతం బ్యాలెట్ పేపర్ విధానంపై మొగ్గుచూపడం విశేషం. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సైతం ఆయా పార్టీలు తమ అభ్యర్థనను విన్నవించాయి. ఎన్నికలు ఏవిధంగా నిర్వహించాలన్న అంశంపై అన్ని పార్టీల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ స్పష్టం చేశారు. గత ఏడాది జూన్‌లో అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. అందులో పాల్గొన్న దాదాపు 13 పార్టీలు ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు సంధించాయి. ఈవీఎంల ద్వారా ఇంతవరకు నిర్వహించిన ఎన్నికల్లో కేవలం 0.7 శాతం మాత్రమే విఫలమైనట్టు రుజువైంది. 1982 మేలో కేరళలో జరిగిన ఉపఎన్నికలో తొలిసారిగా ఈవీఎం మెషీన్లను వినియోగించారు. కాగా, ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ పార్టీల వ్యయ పరిమితిని పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ, లేదా లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు చేసే వ్యయానికి పరిమితి ఉంటుందని, కానీ ఆయా పార్టీలు చేసే ఖర్చులకు పరిమితి లేకుండా పోతోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి పేర్కొన్నారు. డూప్లికేట్, తప్పుడు ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, ఎన్నికలు నీతి, నిజాయితీగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.