జాతీయ వార్తలు

పది రాష్ట్రాల్లో దళితుల నిరసనలు ఏడు రాష్ట్రాల్లో ఘర్షణలు.. విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగార్చేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆరోపిస్తూ దళిత సంఘాలు సోమవారం చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు, రైళ్ల రాకపోకలను అడ్డుకోవడం, పలు వాహనాల ధ్వంసంవంటి సంఘటనలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఉత్తరాదిలోని దాదాపు ఏడు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. భారత్ బంద్ సాధారణ జనజీవనంపై పెనుప్రభావం చూపింది. ఘర్షణలు, కాల్పుల కారణంగా పదిమంది వరకూ మరణించగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయ. మధ్యప్రదేశ్‌లో ఐదుగురు, యూపీ, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ఐదుగురు మరణించినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని భిండి జిల్లాలో పరిస్థితులు చేయిదాటిపోవడంతో కర్ఫ్యూ విధించి సైన్యాన్ని రంగంలోకి దించారు. పంజాబ్‌లోనూ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసు కోవడంతో, అవసరం మేరకు సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉంచారు. ఆందోళనకారుల చర్యల కారణంగా దాదాపు వంద రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ఇటీవల ఇచ్చిన తీర్పు ఆయా వర్గాల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా ఉందని, దీనిని పునఃసమీక్షించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరినప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు.
భారత్‌బంద్ సందర్భంగా సోమవారం ఉదయం నుంచే ఆందోళనకారులు కదం తొక్కారు. మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పంజాబ్, ఒడిశాల్లో బంద్ హింసాత్మకమైంది. అల్లరిమూకల విధ్వంసక చర్యలు, దాడులు, పోలీసుల కాల్పులతో పలు ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పంజాబ్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి. ఇంటర్‌నెట్, మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేశాయి.
ఇదిలావుంటే, శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాల్సిందిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు అల్లర్లతో అట్టుడికిన మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు 800మంది అల్లర్ల నిరోధక పోలీసు బలగాలను తరలించింది. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌పై సుప్రీంకోర్టులో నడచిన వ్యాజ్యంలో కేంద్రం భాగస్వామి కాదని, ఆ తీర్పుతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టుపై తమకు సమున్నత గౌరవం ఉందని, అయితే ఆ తీర్పుతో తమ ప్రభుత్వం ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై ప్రభుత్వం సమగ్ర పునఃసమీక్ష పిటిషన్‌ను దాఖలు చేసిందన్నారు. కాగా ఆందోళనకారులకు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. అజాంఘర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెండు బస్సులను తగులబెట్టారు. ఆగ్రా, హపూర్, మీరట్ సహా పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. ప్రీమియర్ రాజధాని, శతాబ్ది సహా పలు రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. హపూర్ రైల్వేస్టేషన్‌లో దాదాపు 2వేల మంది ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. కాగా శాంతిభద్రతల పరిక్షరణకు అందరూ సహకరించాలనీ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. అదనపు బలగాలను పంపాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరామని యూపీ డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు.
హర్యానాలోని అంబాలా, చండీగఢ్‌లలోనూ ఆందోళనలు పెచ్చుమీరాయి. రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు సీబీఎస్‌ఈ సోమవారం జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కేపిటల్ రీజియన్ ప్రాంతంలో రాంచీ రాజధాని, డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లను ఆందోళనకారులు అడ్డుకోగా ఘజియాబాద్, ఢిల్లీ, మండిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే బారాఖంబా రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్పించిన ఆందోళనకారులు ‘జై భీమ్’ నినాదాలతో హోరెత్తించారు. విధ్వంసానికి పాల్పడిన 50 మందిని పోలీసులు వివిధ ప్రాంతాలలో అదుపులోకి తీసుకున్నారు. కాగా సుప్రీం తీర్పుపై చర్చించి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తీర్మానం చేసేందుకు శాసనసభను సమావేశపరచాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో అధికార విపక్షాలకు చెందిన శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. స్థానిక రైల్వేజంక్షన్‌లో టిక్కెట్ విక్రయ కేంద్రాన్ని బలవంతంగా మూసివేయించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో పలు రహదార్లలో రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. మరోవైపు గుజరాత్‌లోనూ భారత్‌బంద్ ప్రభావం కనిపించింది. వాహనాల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

చిత్రం: దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విధ్వంసానికి దారితీసింది. మీరట్‌లో ఆందోళనకారుల ఆగ్రహానికి దగ్దమవుతున్న వాహనాలు