జాతీయ వార్తలు

లాలూ శిక్షను పెంచాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 5: కోట్లాది రూపాయల గడ్డి కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు విధించిన జైలుశిక్ష కాలాన్ని పెంచాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. పశుదాణా కుంభకోణంలోని డియోగఢ్ ట్రెజరీ కేసులో లాలూప్రసాద్ యాదవ్‌కు విధించిన మూడున్నరేళ్ల జైలుశిక్షను ఏడేండ్లకు పెంచాలని సీబీఐ ఝార్ఖండ్ హైకోర్టులో గురువారం దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించింది. డియోగఢ్ ట్రెజరీ నుంచి మోసపూరితంగా రూ. 89.27 లక్షలు ఉపసంహరించుకున్న కేసులో మిగతా నిందితులందరికీ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం ఈ సంవత్సరం జనవరి ఆరో తేదీన ఏడేళ్ల జైలుశిక్ష విధించిందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. నిందితులందరిపై ఉన్న అభియోగాలు, వారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలు ఒకేలా ఉన్నందున నిందితులందరూ ఒకే విధమయిన శిక్షను ఎదుర్కోవాలని సీబీఐ వాదించింది. మాజీ ఎంపీ ఆర్‌కే రాణా, మాజీ ఐఏఎస్ అధికారులు బెక్ జులియస్, ఫూల్‌చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్, మాజీ ప్రభుత్వ అధికారి సుబీర్ భట్టాచార్యలకు విధించిన జైలుశిక్ష కాలపరిమితిని కూడా పెంచాలని సీబీఐ ఝార్ఖండ్ హైకోర్టును కోరింది.
లాలూ మాదిరిగానే వీరికీ దాణా కేసులో మూడున్నరేళ్ల శిక్ష పడింది. ఈ కేసులో జగన్నాథ్ మిశ్రా సహా ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని కూడా సీబీఐ ఇప్పటికే సవాలు చేసింది. ఈ కుంభకోణంలో సేకరించిన సాక్ష్యాధారాలు చాలా బలమైనవే అయినప్పటికీ వీటిపై సీబీఐ ప్రత్యేక కోర్టు దృష్టి పెట్టలేదని తెలిపింది.వీరిపై కుట్ర కోణానికి సంబంధించిన సాక్ష్యాధారాలూ బలంగానే ఉన్నాయని వెల్లడించింది. లాలూపై దాఖలైన ఐదు దాణా కేసుల్లో నాలుగింటిలో న్యాయస్థానం దోషిగా నిర్థారించింది.