ఈ వారం స్పెషల్

కొత్తగా... గమ్మత్తుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఒక వింత...
కొత్త ఒక ఆశ..
కొత్తదనం ఎప్పుడూ ఆస్వాదించదగ్గదిగానే కన్పిస్తుంది.
కొత్త అనుభవం ఎంత మధురంగా ఉంటుందోనన్న ఆలోచనే మనసును నిలవనీయదు. చిన్నాపెద్దా అందరికీ ఈ భావనలో మినహాయింపు ఏమీ లేదు. అప్పుడే పుట్టిన బిడ్డకు ఈ కొత్తప్రపంచంగురించి వెంటనే ఏమీ తెలియదు. ఆ పసికందుకు తెలిసిందల్లా తన కొత్త ప్రపంచం అంతా అమ్మే.
ఒకరికి కొత్త ఆలోచనలు ఆనందాన్నిస్తాయి.
మరొకరికి కొత్త ఆవిష్కరణలు ఉత్సాహాన్నిస్తాయి.
ఓ ఇంటికి కొత్తకోడలు సుఖసంతోషాలను మోసుకువస్తుందన్పిస్తుంది.
పిల్లలకు కొత్తబట్టలు మురిపెంగా కన్పిస్తాయి.
రైతుకు చేతికొచ్చిన కొత్తపంటలు వెన్నుతట్టి ప్రోత్సహిస్తాయి...
తను కోరుకున్న ప్రియుడో, ప్రేయసో తనతో జీవితాంతం నడవాలన్న కుర్రకారు ఆలోచలన్నీ ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటూనే ఉంటాయి. ఇచ్చిపుచ్చుకోవడాలు దగ్గర్నించి... మనసు విప్పి మాట్లాడుకునేందుకు కొత్తదారులు వెతుక్కుంటూనే ఉంటుంది ఆ ప్రేమపక్షుల జంట.
కొత్త సినిమా విడుదలరోజు మొదటి షో చూస్తే కొందరికి తెగఆనందం.
సరే మనిషన్నాక కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరాలని, తీర్చుకోవాలని తెగ ఉబలాటపడటమూ మనిషి లక్షణమే. అవి తీరాలన్న తపనా సహజమే. కానీ తీరితే మనిషి నేలమీద నిలవడం కష్టమే. అందుకే చాలామందికి కష్టనష్టాలు, సుఖసంతోషాలు చీకటివెలుగుల్లా వెన్నాడుతూ, తట్టిలేపుతూ పలకరిస్తూంటాయి. ఇబ్బందులపడ్డవాడు మంచిరోజులకోసం, కొత్తజీవితంకోసం తహతహలాడతాడు. ఆనందంగా ఉన్నవాడు..తనజీవితం సాఫీగా సాగిపోవాలనుకుంటాడు. కలలబేహారులు తన ఆలోచలన్నీ కాసులుకురిపించాలని కోరుకుంటారు. అవన్నీ నిజం చేసే కొత్తరోజుకోసం ఎదురుచూస్తూంటారు. గడచిపోయిన కాలంలో అన్నీ తనకు అనుకూలంగా జరిగిపోతే తనకు తిరుగులేదనుకుంటాడు. భవిష్యత్ మరింత బ్రహ్మాండంగా ఉండాలనుకుంటాడు. దెబ్బతిన్నవాడు వచ్చేరోజులైనా బాగుండాలని కోరుకుంటాడు. దేవుడినో, నమ్మినవాడినో గుర్తుకుతెచ్చుకుని తోడుండాలని అభిలషిస్తాడు. తనకు జరిగే మంచికి కొత్తసంవత్సరం తొలిరోజు నాంది కావాలంటాడు..అదే ఆంగ్లసంవత్సరాది. అందరినోటా నానే ‘న్యూఇయర్’ డేకోసం అంతా ఎదురుచూస్తున్నారు. పాత సంవత్సరం అనుభవాలు గుర్తుకొస్తున్నాయంటూ..కొత్తసంవత్సరం కలసిరావాలని అభిలషిస్తూ పండగచేసుకోవడం ఇప్పుడు ప్రపంచంలో పరిపాటైపోయింది. ఒకప్పుడు మత సంబంధమైన కార్యక్రమంగానే ప్రారంభమైన ఈ న్యూఇయర్ వేడుక ఇప్పుడు ప్రపంచం అంతటా జరిగే పెద్ద సంబరంగా మారిపోయింది. భాష, ప్రాంతాలు, క్యాలెండర్‌ను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కప్పుడు కొత్త సంవత్సరాది సంప్రదాయంగా వస్తుంది. గ్రెగొరియన్ క్యాలండర్ ప్రకారం జనవరి 1వ తేదీ ఆంగ్ల సంవత్సరాదిగా పాటిస్తున్నారు. ఇది ఒక ప్రాంతం లేదా ఒక మతానికి సంబంధించిన కార్యక్రమంగా కాక, ప్రపంచజనం చేసే జపంగా మారిపోయింది.
పాశ్చాత్య పోకడంటూ నోరునొక్కుకుని, నొసలు చిట్లించే జనం క్రమంగా అసహనాన్ని తగ్గించుకుని ఆ వేడుకకు ఆహ్వానం పలుకుతున్నారు. కుర్రకారుకి ఆనందమే అవధి కనుక పడమటి సంధ్యారాగాన్ని ఆలపిస్తున్నారు. మనవాళ్లు ఒఠ్ఠి అల్లరివాళ్లోయ్ అన్నవాళ్లూ ఉన్నా...ఆ వేడుకకు స్థానిక సంప్రదాయాన్ని మేళవించి తాళం వేస్తున్నారు. పడమటి దేశాల వ్యాపారంకోసం వారి సంప్రదాయాలను మన నెత్తిన రుద్దుతున్నారన్న సంప్రదాయవాదుల ఆగ్రహాన్ని కుర్రకారు పట్టించుకోవడం లేదు. ఏతావాతా ఏటా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ప్రపంచం వెలుదుదివ్వెగా మారిపోతుంది. జనం మోము వేయి మతాబుల వెలుగులతో కళకళలాడుతుంది. అదిగో మరోకొత్త సంవత్సరం 2016కోసం ఇప్పటికే ఈలోకం ఆహ్వానం పలుకుతోంది. అంతెందుకు తెలుగునాట ఈ సంవత్సరం చివరిరోజు అర్థరాత్రి, కొత్తసంవత్సరపు తొలి క్షణాల్లో గానాబజానాల తంతు పతాకస్థాయిలో జరుగుతోందంటే అందులో వింతేమీలేదు. కొత్త సంవత్సరపు వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి నాలుగు మంచి పనులు చేసి భేష్ అన్పించుకునే యువతరమూ మనముందు కన్పిస్తారు. మంచిచెడుల నడుమ కొత్త ఊపిరిపోసుకుంటున్న 2016కు వారంతా వేయికనులతో ఎదురుచూస్తున్నారు.
సీజర్‌తో మొదలు..
క్రిస్టియన్ సంప్రదాయంగా మొదలైన ఈ న్యూఇయర్ వేడుకలు ఆ తరువాత జనబాహుళ్యంలోకి ఇష్టమైన సందర్భంగా మారిపోయింది. మెసపటొనియా నాగరికత సమయంలో, నేటి ఇరాక్‌లో మొదట ఈ తరహాలో సంవత్సరాది వేడుకలు జరిగేవని అంటారు. ఇది క్రీ.పూ.2000 నాటి మాట. అప్పుడు మార్చి 1 సహ వేర్వేరు తేదీల్లో ఈ వేడుకలు జరిగేవి. అయితే రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ హయాంలో తొలిసారిగా జనవరి 1వ తేదీని ఆంగ్ల సంత్సరాదిగా ప్రకటించి వేడుకలను నిర్వహించడం ప్రారంభించారు. గ్రెగొరియన్ క్యాలండర్ ప్రకారం అది కొత్త సంవత్సరానికి ఆది. ముందు, వెనుక ముఖాలతో ఉండే జనస్ అనే వారి దైవం పేరుకు గుర్తుగా జనవరి మొదలైంది. ఊర్ధ్వముఖం భవిష్యత్‌కు, వెనుకమోము గతానికి గుర్తుగా భావిస్తారు. మంచిచెడుకు కూడా దానిని సంకేతంగా చెప్పుకుంటారు. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంప్రదాయం ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. మన నేలపై దాదాపు 40 ఏళ్లుగా విస్తృతంగా అల్లుకుపోయింది. ఇప్పుడైతే ఇది ఒక తప్పనిసరి కార్యక్రమంగా మారిపోయింది. వ్యాపార సంస్థలు, అధికార వర్గాలు, రాజకీయ నాయకులకు ఇది ముఖ్యమైన అంశమైపోయింది. ఇక కుర్రకారుకు పట్టపగ్గాల్లేని సందర్భమే అయిపోయింది.
లక్ష్యం మంచిదే...కానీ..
కొత్త సంవత్సరం బాగా కలిసిరావాలని, మేలు జరగాలని కోరుకోవడం ఈనాటి విశేషం. సరిగ్గా కొత్తసంవత్సరం ప్రారంభమైన క్షణాల్లో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం రివాజు. కొందరు కేక్‌లు, మరికొందరు బహుమతులు, ఇంకొందరు ముద్దులు మురిపాలతో మునిగితేలుతారు. చాలామంది మద్యంతో విందు చేసుకుంటే మరికొందరు ఆటపాటలతో అల్లరిచేస్తారు. అందరి లక్ష్యం ఒకటే...అంతా మంచే జరగాలని. జనం మనస్సు తెలుసుకుని కాసులు రాశులు కొల్లగొట్టేందుకు ఈ వేడుకను వ్యాపారమయం చేసేశారు. గ్రీటింగ్ కార్డులు, గిఫ్ట్‌ప్యాక్‌లు, రిసార్టుల్లో బృందగానాలు శ్రుతిమించి వీధినపడుతున్నాయి. పబ్‌లలో డబ్బున్నవారి ఆటలు హద్దులు దాటుతున్నాయి. యువతరం అటే మొగ్గుచూపి తూలిపోతోంది. చాలామంది బతుకులు దారితప్పుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యాపారం సాగిపోతోంది. కొందరు మాత్రం తమ జీవితస్వప్నాన్ని సాకారం చేసుకోవాడనికి ఈ క్షణాలను మంచి ముహూర్తంగా భావించి తొలి అడుగులు వేస్తున్నారు.
ప్రపంచం చుట్టేస్తాం..
న్యూఇయర్ వేడుకల వేళ చిన్ననాటి స్నేహితులతో గడపాలని చాలామంది సొంతఊళ్లకు వెళతారు. మరికొందరు కుటుంబ సభ్యులందరినీ ఒకచోటకు చేర్చి పండుగ చేసుకుంటారు. కాలనీలు, సంఘాల వారీగా ఒకచోటకు చేరడమూ ఆనవాయితీయే. పాశ్చాత్యదేశాల్లోనూ ఇలాగే జరుగుతుంది. సాగరతీరాలు, రిసార్టుల్లో వేలాదిమంది ఒకచోట చేరి కేరింతలు కొట్టడం సర్వసాధారణం. చిన్నాపెద్దా ఒక్కటై ఆటపాటల్లో మునిగితేలడం సామాన్య కుటుంబాల్లో కన్పించే దృశ్యం. మన దీపావళిలా ఇతర దేశాల్లో ఆరోజు 12 గంటలవేళ బాణాసంచా వెలుగులు తిమిరాన్ని తరిమేయడం అందమైన అనుభూతిని అందిస్తుంది. మనదగ్గరా ఈ వెలుగులు ఈమధ్య ఎక్కువగానే అలరిస్తున్నాయి. తెలుగునాట దండిగా దాండియా నృత్యాలు కన్పించడంలో ఈ నూతన వేడుకలో భాగమే. ఆ దేశాల్లో కేకులు, మద్యం ఏరులై ప్రవహిస్తే మనదగ్గర సంప్రదాయ పిండివంటలు ఘుమఘులాడతాయి. పదహారేళ్ల ప్రాయం కొందరిని మత్తెక్కిస్తే, చిత్తవకుండా చిత్తాన్ని కట్టడి చేసే యువతరమూ మనకు కన్పిస్తుంది. గ్రీటింగ్ కార్డుల్లో శుభకామనల వెనుక మహత్తర శక్తి ఉంది. అయినవారిని ముగ్గులోకి దించడం, ఆశీస్సులు పొందడం, అభినందించడం ఓ కాగితపు ముక్కతో మన మనసు విప్పిచెప్పడం మామూలు విషయం కాదు. ఇది ఓ కళ. ఓ వ్యాపార మెళకువ. ఒకటిరెండు వాక్యాలు లేదా పదాల మాటున దాగిన మన మనసుతెర తొలగించడం అవతలివారి ఇష్టాయిష్టాల్ని, అభిరుచులను బట్టి ఉంటుంది. ఈ కార్డుపై ఉన్న సాహిత్యం చదివితే కాళిదాసులు, శ్రీనాధులు మనకళ్ల ముందు మెదిలే అవకాశమూ ఉంది. సంప్రదాయం పాశ్చాత్యులదైనా మనసు మనదే కనుక మనవైఖరులు, అలవాట్లు, అభిరుచులు ఆ కార్డుపై ప్రస్ఫుటమవుతూంటాయి. ఈ వేడుక సందర్భంగా ప్రేమికులు తమకు నచ్చిన ప్రాంతాలకు ఎగిరిపోతారు. కొత్తజంటలు అందమైన దూరతీరాల్లో మునిగితేలుతారు. మధ్యతరగతి మందహాసం ఇంటికే పరిమితమవుతుంది. ఈ ప్రపంచం పోకడను చూసే పేదతరగతి వర్గాల మోముపై చిరునవ్వులు చిందినా మనసు భారంగానే ఉంటుంది. తమకూ మంచిరోజులు రావాలన్న ఆశ..పెదవిదాటదు. మదిలో బందీగా ఉండిపోయే ఆ వర్గం మిగతావారి సేవలో నిమగ్నమైపోతుంది.
అక్కడ ఎలా..
నిజానికి న్యూఇయర్ డే వేరు, న్యూఇయర్ వేడుకలు వేరు. డిసెంబర్ 31 అర్థరాత్రి జరిగే వేడుకలు న్యూఇయర్ డేగా చెబుతారు. అంతకుముందు రోజు, ఆ తరువాతి రోజుసహా క్రిస్మస్ వేడుకలతో కలిపి న్యూఇయర్ ఈవ్‌గా పిలుస్తారు. బంధువులు, స్నేహితులు ఒకచోట కలిసి ఫ్యామిలీ ఫంక్షన్ నిర్వహిస్తారు. కేకులు, చాక్లెట్లు, ఇతర పదార్థాలు, మద్యంతో విందు ఆరగిస్తారు. ఈ ఏడాదిలో ఏం చేయాలో నిర్ణయించుకుంటారు. అది ఆచరించాలన్న సంకల్పం చెప్పుకుంటారు. అమెరికాలో దాదాపు 50శాతం జనాభా కొత్తసంవత్సరంలో ఏం చేయబోతున్నారో అవేళ నిర్ణయించుకుంటారు. కానీ రెండువారాలు తిరిగేసరికల్లా వారిలో సగంమంది తమ లక్ష్యాన్ని మరచిపోతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇవీ నమ్మకాలు..
ఉగాదినాడు తెలుగువారు పరగడుపున ఉగాది పచ్చడి తినడం సంప్రదాయంకదా. అది తిన్నాకే ఇంకేదైనా తినడం, లేదా తాగడం చేయడం ఆనవాయితి. అలాగే న్యూఇయర్ డేనాడూ విదేశాల్లో అలాంటి అలవాట్లు ఉన్నాయి. అమెరికాతో సహా చాలాదేశాల్లో ఆరోజు నల్లమచ్చ ఉన్న బఠాణీలు తినడం అదృష్టంగా భావిస్తారు. దాదాపు అమెరికన్లంతా ఆ రోజు అది తినకుండా గడపరు. ఇప్పుడు బహుమతులు, గ్రీటింగ్‌కార్డులు ఇస్తున్నారు కానీ చాలాకాలం క్రితం కోడిగుడ్లను శుభాకాంక్షలు చెబుతూ ఇచ్చేవారు. గుడ్డు ‘ప్రొడక్టివిటి’ సంకేతంగా భావించి అలా చేసేవారు. అంటే భవిష్యత్ ఉండేది, ఎదుగుదల ఉండేదని అర్థంకదా. ఇక అమెరికాలో న్యూఇయర్ డేనాడు మరే రోజుల్లో లేనన్ని వాహనాల చోరీలు జరుగుతాయట తెలుసా. ఇక ఆ వేడుకల్లో మద్యం తాగేవారి సంఖ్య తక్కువేం కాదు. ఒక్క అమెరికాలో ఆ రోజు 36కోట్ల గ్లాసుల మద్యం పూటుగా తాగేస్తారు. ఇక ఆ రోజు మాంసాహారం తింటే కొత్త సంవత్సరంలో దురదృష్టం వెంటాడుతుందని భావిస్తారు. ముఖ్యంగా చికెన్ తింటే కష్టాలేకష్టాలని వారి విశ్వాసం. కొలంబియా, కోస్టారికా, క్యూబాలో ఈరోజు ప్రత్యేకంగా ఓ బొమ్మను తయారు చేస్తారు. బట్టలు తొడిగిన ఆ బొమ్మను సరిగ్గా అర్ధరాత్రి (డిసెంబర్ 31) 12 గంటలకు దహనం చేస్తారు. దీనివల్ల గడచిపోయిన ఏడాదిలో చెడంతా పోయినట్లుగా భావిస్తారు. ఇటలీలో ప్రజలు ఆరోజున ఎర్రటి లోదుస్తులు ధరిస్తారు. అలా చేస్తే భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందని వారి నమ్మకం. ఇక ఫ్రాన్స్‌లో కుటుంబాలవారీగా వేడుకలు జరుపుకోవడం, షాంపేన్ సేవించడం ఆనవాయితీ. ఆరోజు పొద్దునే్న లేచి తమకు నచ్చినవారిని ముందుగా చూస్తే మంచి జరుగుతుందన్న నమ్మకం అన్నిచోట్లా ఉంది.
ఆధునిక యుగంలో...
ఒకప్పుడు అక్కడక్కడ జరిగే ఈ వేడుకలు ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. పబ్‌లు, డ్యాన్సులు, మద్యం, ఆటపాటలు, పోటీలు, నాటకాలు, సినిమాలు, రేసులు ఒకటేమిటి ఆనందించడానికి ఉన్న మార్గాలన్నింటినీ వాడేస్తున్నారు. వీరికి ఇప్పుడు ఆధునిక సాంకేతిక విజ్ఞానం మరింత తోడైంది. సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చింది. ఇది ఒకరకంగా మేలే చేస్తోంది. ఇంటిపట్టున ఉండి నెట్‌లో పడిపోతున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేవారికోసం టూర్‌ప్యాకేజీలు, రాయితీలు, ప్రత్యేక ఆఫర్లతో టెలిఫోన్ సంస్థలు, పర్యాటక, రవాణా సంస్థలు గోలచేస్తాయి. ఇక హోటల్ బిజినెస్‌కు పట్టపగ్గాలుండవు.
* * *
మొత్తంమీద ఆనందం కోసం పరితపించేవారికి ఈ న్యూఇయర్ వేడుక ఓ వరం. అనుకున్నది సాధించుకోవాలన్నవారికి ఈ వేడుక ఓ అద్భుతమైన ఆరంభం. ఎన్నో తరాలను, అంతరాలను, అంతర్జాలాన్ని దగ్గరుండి చూస్తున్న పెద్దవాళ్లు...‘ప్చ్...లోకం మారిపోతోంది’ అని నిట్టూర్చినా...యుగధర్మం అని సరిపెట్టుకుంటారు. తమవాళ్లు ఈ సంప్రదాయాల మాయలో పడిపోకుండా కేవలం ఆనందించి అభివృద్ధి పథంలో దూసుకెళ్తే చాలని తలుస్తారు. అదే మనకు దీవెన. హేపీ న్యూఇయర్ నాయనమ్మా అంటూ చెప్పిన బుడతడి బుగ్గలు నొక్కి...ముద్దాడి కొత్త ఒరవడికి ఓకె చెప్పడం వారి పెద్దమనసును చాటుతుంది. అందుకే కొత్త సంవత్సరం అందరికీ కొత్త బంగారులోకం అవుతుంది. అదే అందరి శుభకామన. *

*****************

ఇలా చేద్దాం...
పాత ఒక రోత అంటారు. అందుకే ఆ ఏడాదిలో చెడును తలుచుకోవద్దనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొత్తగా బతకాలనుకుంటారు. తమలోని లోపాలను తరిమేసి..కొత్త అవతారం ఎత్తాలని భావిస్తారు. కొత్తసంవత్సరం తొలిరోజునే ఆ పని మొదలెట్టాలనుకుంటారు. న్యూఇయర్ డేనాడు బాస చేస్తారు. అన్నిదేశాల్లోనూ ఇది సాధారణమే. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువే లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. అమెరికాతోసహా పలు దేశాల్లో కొత్త ఏడాదిలో చేయాల్సిన పనులను చెప్పుకుంటారు. అలా అందరూ చేయాలనుకునే టాప్ టెన్ అంశాలు తెలుసుకుంటే ఆశ్యర్యం వేస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ప్రతి ఒక్కరికీ తమ లక్ష్యాలను చెప్పుకోవడం అలవాటు. వారి తొలి పది ప్రాధాన్యతలు ఇవి
1.బరువు తగ్గడం
2.ఆరోగ్యకరమైన ఆహారం తినడం3
3.వ్యాయామం విధిగా చేయడం
4.పొగతాగకుండా ఉండటం
5.బడ్జెట్‌కు కట్టుబడి ఉండటం
6.పొదుపు పాటించడం
7.పద్ధతిగా జీవితాన్ని సాగించడం
8.సహనశీలత పెంచుకోవడం
9.ఉన్నతమైన ఉద్యోగం సాధించడం
10.ఉత్తమ వ్యక్తిగా మారడం
కానీ ఓ విషయం తెలుసా. ఈ బాస చెసిన పక్షం రోజులకల్లా వీరిలో చాలామంది సగం అంశాలను పట్టించుకోవడం మానేస్తారట. మనవాళ్లలోనూ అంతే కాకపోతే. లక్ష్యాలను నిర్దేశించుకునేవాళ్లూ మనదగ్గర తక్కువే. మనం న్యూ ఇయర్ వేడుకలో పాల్గొనడం కేవలం ఆనందించడానికే కదా.

**********************

సిడ్నీ...డిస్నీలాండ్..లాస్‌వెగాస్

ప్రపంచంలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగే ప్రాంతాల జాబితాలో మొదటి స్థానం ఆస్ట్రేలియాలోని సిడ్నీదే. అక్కడి హార్బర్ బీచ్‌లో జరిగే ఈ వేడుకకు 1.5 మిలియన్లమంది హాజరవుతారు. 80వేల బాణసంచాలు వెలిగిస్తారు. దాదాపు వందకోట్లమంది ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారంలో తిలకిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలను ప్రసారం చేస్తారు. విశ్వంలో పెద్దఎత్తున జరిగే వేడుకగా దీనికి పేరుంది. సైడ్ హోవర్డ్ అనే సాంకేతిక శాస్తవ్రేత్త సారథ్యంలో 1983నుంచి ఈ వేడుకలు నిర్వహించడం ప్రారంభమైంది. డిసెంబర్ 31 రాత్రి 9 గంటలనుంచి 22 నిమిషాలపాటు ‘్ఫ్యమిలి ఫైర్‌వర్క్స్’ పేరిట బాణసంచా కాలుస్తారు. మళ్లీ 11.59 నిమిషాలకు మిడ్‌నైట్ ఫైర్‌వర్క్స్ పేరిట బాణసంచా వెలిగిస్తారు. ఇది 5 నిమిషాలపాటు సాగుతుంది. ఆఖర్లో ‘ఆల్‌వైట్ ఫినాలే’ పేరిట ధవళకాంతులు వెదజల్లే బాణసంచా వెలుగులు విరబూస్తాయి. లాస్‌వెగాస్‌లో ఈరోజున 6 లక్షల అమెరికన్ డాలర్ల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేసిన బాణసంచా కాలుస్తారు. ఈ వేడుకను 3.3లక్షలమంది ప్రత్యక్షంగా చూస్తారు. ఇక డిస్నీల్యాండ్‌లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు చాలారోజుల ముందునుంచే టిక్కెట్లు తీసుకోవాలి. ఇక్కడకు కుటుంబంతో కలిసి వచ్చేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. ప్రత్యేక సంగీత, నృత్య కార్యక్రమాలకు తోడుగా విందువినోదాలుంటాయి.

********************

టైమ్‌స్క్వేర్ బాల్
న్యూఇయర్ డే సందర్భంగా అమెరికాలోని టైమ్‌స్వేర్‌వద్ద నిర్వహించే ‘టైమ్‌స్క్వేర్ బాల్’ కార్యక్రమం ప్రత్యేకత అంతా ఇంతాకాదు. ఇక్కడ ఏర్పాటు చేసే వెలుగుల బంతి సరిగ్గా డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు వెలుగులు విరజిమ్ముతుంది. 1907నుంచి ఈ సంప్రదాయం వస్తోంది. ఆ సమయంలో ఆ వెలుగుల వేడుకను చూసేందుకు లక్షలాదిమంది అక్కడకు చేరుతారు. బాణాసంచా వెలుగులకు తోడుగా ఎల్‌ఇడి దీపాల కాంతులు సమ్మోహనపరుస్తాయి. ఈ సంప్రదాయం మొదలెట్టినప్పుడు కేవలం 700 బరువుతో 25 వాట్ సామర్థ్యం ఉన్న కొన్ని బల్బులను మాత్రమే ఈ బాల్‌లో వాడారు. 1942, 43లో ఈ వేడుక జరగలేదు. ఇప్పుడు ఆ బాల్‌కు ఆధునిక సొబగులు అద్దారు. దాదాపు 5వేల కిలోల బరువుతో, 12 అడుగుల వ్యాసార్థంతో, 32000 ఎల్‌ఇడి బల్బులతో వాటర్‌క్రిస్టల్స్ వెలుగులతో ఇది మిలమిల మెరుస్తుంది. సరిగ్గా కొత్త ప్రారంభమైన క్షణాల్లో ఇది వెలుగులు విరజిమ్మగానే అంతవరకు ఊపిరిబిగబట్టి ఉన్న జనం ఒక్కసారి చేతనులై చెలరేగిపోతారు. ఆనందతాండవం చేస్తారు. వేడుకల్లో మునిగితేలిపోతారు. ఇక ఆటాపాటా మొదలవుతాయి. శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆలింగనాలు...ప్రేమపూర్వక చుంబనాలు గమ్మత్తెక్కిస్తాయి

-కృష్ణతేజ