జాతీయ వార్తలు

ఇక మనమే సూపర్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 10: భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చైనా, అమెరికాకన్నా కూడా భారత్ ఎక్కువ పెట్టుబడులు సుమారు 51 బిలియన్ డాలర్లను ఆకర్షించిందని ఆయన అన్నారు. మన దేశం ‘ఎకనమిక్ సూపర్‌పవర్’గా అవతరించే రోజు మరెంతో దూరంలో లేదని ఆయన అన్నారు. ‘అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వం కన్నా ముందు భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా ఉండింది. వాజపేయి ప్రభుత్వ హయాంలో వృద్ధి రేటు 8.4 శాతానికి చేరింది. యుపిఏ హయాంలో ఆరు శాతం కన్నా దిగువన ఉన్న వృద్ధి రేటు గత రెండేళ్లలో 7.6 శాతానికి పెరిగింది. పదేళ్ల యుపిఏ హయాంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) తగ్గింది’ అని రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఇక్కడి చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వివరించారు. రైల్వేలను ఆయన అత్యంత ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రంగంగా ఆయన అభివర్ణించారు. రైల్వేలు అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాయని చెప్పారు. రానున్న రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల కన్నా ఎక్కువ సౌకర్యాలను భారత్‌లో రైల్వే ప్రయాణికులు పొందుతారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో లోక్‌సభ నియోజకవర్గంలో సర్క్యులర్ రైళ్లను ప్రవేశపెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన మంత్రి ఇది సాధ్యమవుతుందో, కాదో రైల్వేలు నిర్ణయించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సింహ మాట్లాడుతూ రైల్వేల్లో పెట్టుబడులు నిరుడు రూ. 48 వేల కోట్ల నుంచి రూ. ఒక లక్ష కోట్లకు పెరిగాయని తెలిపారు. ఈ పెట్టుబడులు ఇంకా రూ. ఒక లక్షా 21వేల కోట్లకు పెరుగుతాయని పేర్కొన్నారు. 2020 నాటికి 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు రూ. 27వేల కోట్ల విలువ గల ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ఇండియన్ రైల్వే టెలికం విభాగమైన రెయిల్ టెల్.. గూగుల్‌తో కలిసి హైస్పీడ్ పబ్లిక్ వైఫై సేవలను ఈ సందర్భంగా ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించేందుకు బిజెపిలో సమర్థులయిన నాయకులకు కొదువ లేదని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఊహాగానాలు సాగుతున్న తరుణంలో అడిగిన ఒక ప్రశ్నకు బదులుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు అలహాబాద్‌లో జరుగనున్న నేపథ్యంలో యుపి ఎన్నికల్లో బిజెపి ప్రచారానికి రాజ్‌నాథ్ సింగ్ ‘నాయకత్వ పాత్ర’ వహిస్తారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే బిజెపి మాత్రం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజ్‌నాథ్ సింగ్ పేరును ఇప్పటి వరకు ప్రకటించలేదు.

లక్నోలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో
ఓ వికలాంగుడికి రిక్షా పంపిణీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్