జాతీయ వార్తలు

మరో కేజ్రీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: రాష్ట్ర హైకోర్టు విభజన కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తానని బెదిరించటం ద్వారా తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ మాదిరి వ్యవహరిస్తున్నారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ ఎద్దేవా చేశారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధాని కనుక, హైకోర్టునూ ఉమ్మడిగా కొనసాగించే అవకాశం ఏపీ సిఎం చంద్రబాబుకు ఉందని సూచించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. తెలంగాణ న్యాయవాదుల ప్రతినిధుల బృందం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ నాయకత్వంలో సదానందను కలిసి హైకోర్టు విభజన తక్షణం చేపట్టాలని విజప్తి చేసింది. ఈ సందర్భంలో గౌడ మీడియాతో మాట్లాడుతూ ‘కేజ్రీవాల్ పనిచేయకుండా ఎప్పుడూ కేంద్రాన్ని విమర్శిస్తుంటారు. ఇప్పుడు కెసిఆర్ అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. సిఎం ఇలాగే పనిచేస్తే రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో సరైన గుణపాఠం నేర్పిస్తారు’ అని హెచ్చరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నేను వత్తిడి తీసుకురావడం సాధ్యమవుతుందా? అని సదానంద ప్రశ్నించారు. నేను జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని మళ్లీ ఆరోపిస్తారు’ అన్నారు. కేసిఆర్ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తానంటే నేనెలా ఆపుతాను అని ప్రశ్నిస్తూనే, అక్కడ ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు. ఆయన ధర్నాను స్వాగతిస్తున్నాను అంటూ వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన గురించి మాట్లాడితే కోర్టు ధిక్కారం అవుతుందని సదానంద హెచ్చరించారు. రాష్ట్ర హైకోర్టు విభజన వ్యవహారం కేంద్రం పరిధిలో లేదు. రెండు రాష్ట్రాల సిఎంలు పరస్పరం చర్చించుకుని ఉమ్మడి హైకోర్టు సిజెతో సంప్రదింపులు జరపటం ద్వారా హైకోర్టు విభజన పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు విభజన అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌కు లేఖలు రాస్తారని సదానంద గౌడ చెప్పారు. హైకోర్టు విభజన కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని కెసిఆర్ తలపోయటం పట్ల సదానంద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిధిలో లేదని సదానంద గౌడ ఉద్ఘాటించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయటం గురించి, సబార్డినేట్ జ్యుడీషియరీ చేస్తోన్న ఆందోళన గురించి దత్తాత్రేయ తనకు వివరించారని అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఏపీ సిఎం చంద్రబాబుపై ఉందన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులను విభిజించి రెండు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ఇది జరిగిన తరువాతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు విభజన కార్యక్రమం చేపడతారని సదానంద వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రానికి ఎలాంటి పాత్రా ఉండదని కుండబద్దలుకొట్టి చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధాని. ఏపీలో అన్ని సౌకర్యాలూ ఏర్పడేంత వరకూ హైకోర్టును ఉమ్మడిగా కొనసాగించే అవకాశం చంద్రబాబుకు ఉందన్నారు. హైకోర్టు విభజన బాధ్యత ఏపీ సిఎం, హైకోర్టు సిజె బాధ్యతగా సదానంద గౌడ తేల్చేశారు. ఈ విషయంలో సబార్డినేట్ కోర్టులు సైతం కేంద్రం పరిధిలోకి రావన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి చర్చించుకుని సబార్డినేట్ కోర్టు న్యాయమూర్తులను నియమించుకోవాలన్నారు. హైకోర్టులో తెలంగాణకు చెందిన న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉందని సదానంద గౌడ అంగీకరించారు. రాష్ట్ర హైకోర్టులో తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారనేది అధ్యయనం చేయించాం. తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు తక్కువమంది ఉన్నారని అధ్యయనం తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదిక తనవద్ద ఉందని సదానంద వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం హైకోర్టులో ఆంధ్ర న్యాయమూర్తులు 37మంది, తెలంగాణ న్యాయమూర్తులు 24మంది ఉండాలన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్ర న్యాయమూర్తులు 18మంది ఉంటే, తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ముగ్గురే ఉన్నారన్నారు. ఇక సబార్డినేట్ కోర్టుల్లో నియామకాలకు స్థానికతే ప్రమాణికత. రాష్ట్ర సిఎం, హైకోర్టు సిజె కలిసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైకోర్టు సిజె విభజన చట్టానికి లోబడి ఆంధ్ర, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సి ఉంటుందని సదానంద గౌడ ప్రకటించారు. హైకోర్టు విభజనకు కేంద్రం బాధ్యత వహించాలని తెలంగాణ సిఎం మాటిమాటికీ విమర్శించటం, ఢిల్లీకివచ్చి ధర్నా చేస్తానని బెదిరించటం ఎంతమాత్రం మంచిదికాదని హితవు పలికారు. రాజ్యాంగాన్ని, రాష్ట్ర విభజన చట్టాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవటం కెసిఆర్‌కు మంచిదని సలహా ఇచ్చారు. కేంద్రంపై మాటమాటకు తప్పుడు ఆరోపణలు చేయటం సిఎం హోదాకు సరిపోదన్నారు. కెసిఆర్ ఈ విషయంలో రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సదానంద గౌడ విమర్శించారు. తెరాస ఎంపీలు తనను పలుమార్లు కలిసినప్పుడు అన్ని విషయాలు తెలియజేశానని న్యాయ మంత్రి అన్నారు. ఉమ్మడి హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజనాల వాజ్యం మూలంగా కొంత ఆలస్యమైంది. ఇప్పుడు విభజన విషయం హైకోర్టు పరిశీలనలో ఉంది. హైకోర్టు విభజనపై తాను మాట్లాడితే కోర్టు ధిక్కారమవుతుందని సదానంద గౌడ హెచ్చరించారు. అందుకే తాను హైకోర్టు విభజన గురించి ఎలాంటి వ్యాఖ్యా చేయలేనని చెప్పారు.
chitram...
హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయంపులో న్యాయం చేయాలంటూ
కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు విజ్ఞాపన పత్రం అందిస్తున్న తెరాస ఎంపీలు