జాతీయ వార్తలు

ప్రగతే భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), జూలై 22: కులతత్వ రాజకీయాలను, బంధుప్రీతి రాజకీయాలను తిరస్కరించి, అభివృద్ధి రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ, ప్రతిపక్ష బహుజన్ సమాజ్ పార్టీలపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అయితే ఆయన ఇటీవల గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడి గురించి కాని, బిఎస్‌పి అధినేత్రి మాయావతి గురించి తమ పార్టీ నేత చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల గురించి కాని ప్రస్తావించలేదు. ‘మీకు (ప్రజలకు) కులతత్వ, ఆశ్రీత పక్షపాత రాజకీయాలకు పాల్పడుతున్న వారి అవసరం లేదు. మీరు అందరికీ అధికారం కట్టబెట్టారు. కాని, మీకు ఒరిగిందేమీ లేదు. ప్రియమైన యువతీయువకులారా! బంధుప్రీతి, కులతత్వ విషం.. అభివృద్ధికి ఏమాత్రం దోహదపడదు. అందువల్ల అభివృద్ధి రాజకీయాలకు మద్దతు ఇవ్వండి. లోక్‌సభ ఎన్నికలలోలాగే ఇప్పుడూ నాకు మీ మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను’ అని మోదీ అన్నారు. కుటుంబ రాజకీయాలకు మంగళం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కుటుంబ, కులతత్వ రాజకీయాలు ఇక చాలు. మీరు ప్రతి ఒక్కరికీ మద్దతిచ్చారు. కాని, వారు మీకు మద్దతుగా నిలిచారా? యువత, రైతులు లబ్ధి పొందారా?’ అని మోదీ సభలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)కు మోదీ శంకుస్థాపన చేశారు. మూతపడిన ఫెర్టిలైజర్ ప్లాంట్ పునరుద్ధరణ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య రంగానికి విడుదల చేసిన నిధులను కూడా రాష్ట్రంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోతోందని ప్రధాని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనలాగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నేను రూ. ఏడు వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చాను. కాని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 2,850 కోట్లు మాత్రమే ఉపయోగించుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేసే సత్తా లేకపోవడం వల్ల మిగతా నిధులను ఉపయోగించు కోలేకపోయింది’ అని మోదీ అన్నారు. ‘ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు’ అంటూ ఆయన సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.