జాతీయ వార్తలు

నరకంగా మారిన గుర్గావ్.. ట్రాఫిక్‌జామ్‌తో జనం బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, జూలై 29: గురువారం సాయంత్రం ఢిల్లీతో పాటుగా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గుర్గావ్ నగరం పూర్తిగా స్తంభించి పోయింది. డ్రైనేజిలు పొంగి, రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచి పోవడంతో ఢిల్లీనుంచి గుర్గావ్ వెళ్లే 8వ నంబరు జాతీయ రహదారిపై వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకు పోయాయి. వాహనదారులు తమ వాసనాలను ఎక్కడివక్కడే వదిలేసి నడుంలోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్తుండడంతో పరిస్థితి దారుణంగా మారింది. గురువారం సాయంత్రం జనం ఆఫీసులనుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కుండపోత వర్షం కురవడంతో వేల సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుపడిపోయాయి. దీంతో జనం నిన్న రాత్రినుంచి అవస్థలు పడుతున్నారు. గురువారం సాయంత్రం మొదలైన భారీ వర్షాలు శుక్రవారం కూడా కొనసాగడం, దీనికి తోడు శుక్రవారం ఉదయం మరికొన్ని వేల మంది వాహనాలతో రోడ్లపైకి రావడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో దిక్కుతోచని అధికారులు గుర్గావ్‌కు ఎవరూ రావద్దంటూ విజ్ఞప్తులు చేయాల్సి వచ్చింది. నగరంలో విద్యా సంస్థలన్నిటికీ రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులను తీసుకు వచ్చే బస్సులు, ఇతర వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకు పోవడంతో పలు మల్టీ నేషనల్ కంపెనీలు కూడా శుక్రవారం సెలవు ప్రకటించాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అటూ ఇటూ దాదాపు 20-26 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి కనిపిస్తున్నాయి. దీంతో హర్యానా ప్రభుత్వం నగరంలోని అన్ని వ్యవస్థల సిబ్బందిని రంగంలోకి దించింది. ఇటు ఢిల్లీ పోలీసులు సైతం పరిస్థితిని చక్కదిద్దడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు సైతం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఉన్నతస్థాయి అధికారుతో అత్యవసర సమీక్ష జరిపింది. శుక్రవారం సాయంత్రానికి పరిస్థితి కాస్త మెరుగుపడవచ్చని భావిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ట్రాఫిక్ జామ్‌కు సైతం రాజకీయ రంగు పులుముకుంది. ఈ పరిస్థితికి బిజెపి అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వ మే కారణమని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ధ్వజమెత్తుతుండగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని బిజెపి దుమ్మెత్తిపోస్తోంది. ‘వాహనాలు ముఖ్యంగా అంబులెన్సులు కూడా గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుపడిపోతే ప్రజల పరిస్థితి ఏమిటి?’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. గుర్గావ్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, ఖట్టర్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే దీనికి కారణమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదని, ఎందుకంటే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది బిజెపియేనని, కార్పొరేషన్లు అన్నీ బిజెపి చేతుల్లోనే ఉన్నాయని ఆయన అన్నారు.
chitram...
గుర్గావ్‌లో మైళ్ల పొడవున నిలిచిపోయన వాహన శ్రేణి

బెంగళూరులో
వర్ష బీభత్సం

బెంగళూరు, జూలై 29: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరు జలమయమైంది. 26వ తేదీన మొదలైన వర్షాలు శుక్రవారం కూడా కొనసాగడంతో బెంగళూరు, సమీప ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో ఇప్పటివరకు 135 మిమీ వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో చెరువులను తలపిస్తున్నాయి.
మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

బెంగళూరులో బీభత్సం సృష్టించిన వర్షం. వర్షపునీరు నిండిన రోడ్లపై ప్రయాణికుల ఇక్కట్లు