జాతీయ వార్తలు

సౌదీలో భారతీయుల ఆకలి కేకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: సౌదీ అరేబియాలో పది వేలకు పైగా భారతీయ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయి తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. వారికి ఆహార పదార్థాలను అందజేయడంతోపాటు ఇతరత్రా సహకరించాలని భారత ప్రభుత్వం సౌదీలోని తన దౌత్యసిబ్బందిని ఆదేశించింది. సౌదీలో ఉన్న 30 లక్షలకుపైగా మంది భారతీయులు ఆకలితో అలమటిస్తున్న తమ సోదర సోదరీమణులకు సహకరించాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం సాయంత్రం విజ్ఞప్తి చేశారు. భరత జాతి సమష్టి సంకల్పాన్ని మించిన గొప్ప శక్తి మరోటి లేదని ఆమె పేర్కొన్నారు. సౌదీలోని నిరుద్యోగ భారతీయ కార్మికులకు ఉచితంగా రేషన్ అందజేయాలని రియాద్‌లోని భారత దౌత్యకార్యాలయాన్ని ఆదేశించినట్లు మంత్రి సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో తెలిపారు. సౌదీ అరేబియా, కువైట్‌లోని భారతీయులు తమ ఉద్యోగాలు, వేతనాలకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సౌదీలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని మంత్రి వెల్లడించారు. జెద్దాలో 800 మంది భారతీయులు గత మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారని, ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి జోక్యం చేసుకొని ఆదుకోవాలని ఒక వ్యక్తి చేసిన ట్వీట్‌కు తొలుత మంత్రి స్పందించారు. అయితే ఆ తరువాత సౌదీ అరేబియాలో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారతీయుల సంఖ్య తొలుత పేర్కొన్నట్లు 800 మంది కాదని, పది వేలకుపైగా మంది ఆకలితో అలమటిస్తున్నారని మంత్రి ట్వీట్ చేశారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ త్వరలో సౌదీ అరేబియాను సందర్శించనున్నారు. ఆయన సమస్య తీవ్రతను అంచనా వేయడంతో పాటు దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని సుష్మా స్వరాజ్ చెప్పారు. భారత విదేశాంగ శాఖ మరో సహాయ మంత్రి ఎం.జె.అక్బర్ కువైట్, సౌదీ అరేబియా అధికారుల దృష్టికి అక్కడి భారతీయ కార్మికుల దుస్థితిని తీసుకెళ్తారని ఆమె తెలిపారు.
సౌదీ అరేబియాలోని భారతీయ నిరుద్యోగులెవరూ ఇక ఆకలితో అలమటించరని తాను హామీ ఇస్తున్నానని సుష్మా స్వరాజ్ అన్నారు. అక్కడి పరిస్థితిని తాను గంట గంటకు పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. సౌదీ అరేబియా, కువైట్‌లలో పెద్దసంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారని, యాజమాన్యాలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా తమ ఫ్యాక్టరీలను మూసివేశాయని ఆమె వివరించారు. దీంతో అక్కడి భారతీయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని తెలిపారు. అయితే కువైట్‌లో ఈ సమస్య చక్కదిద్దగలిగిన స్థాయిలో ఉండగా, సౌదీలో మాత్రం అత్యంత దారుణంగా ఉందని మంత్రి వివరించారు.
జెద్దాలోని భారతీయులతో కలిసి భారత కాన్సులేట్ ఇప్పటికే 15,475 కిలోల ఆహార సామగ్రిని, ఇతర వస్తువులను బాధితులకు పంపిణీ చేసినట్లు సుష్మా స్వరాజ్ వెల్లడించారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న వందలాది మంది నిరుద్యోగ కార్మికులు ఉన్న జెద్దా సమీపంలోని హైవే శిబిరానికి భారత కాన్సులేట్ అధికారులు ఇప్పటికే వెళ్లారని ఆమె వివరించారు.