జాతీయ వార్తలు

ఓపిక పట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2:‘ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన చేస్తాం. అంతవరకు ఎంపిలు ఓపిక పట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించటంతో లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న తెలుగుదేశం ఎంపిలు తమ నిరసన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. జైట్లీ మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ ‘ఏపికి చేయాల్సిన సాయంపై చర్చిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఇంతక్రితమే ఈ అంశం గురించి మాట్లాడాను కాబట్టి మీరు శాంతించాల’ని విజప్తి చేశారు. అయితే జైట్లీ తన ప్రకటనలో ఎక్కడా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకపోవటం గమనార్హం. ఏపికి సాయం చేయటం గురించి మాత్రమే ఆయన మాట్లాడటంతో తెలుగుదేశం సభ్యులు గల్లా జయదేవ్, రామమోహన్‌రెడ్డి, తోట నరసింహం తదితరులు స్పందిస్తూ సాయం ఎప్పటిలోగా అందజేస్తారో చెప్పాలని పట్టుబట్టారు. దీనికి జైట్లీ స్పందించకపోవడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ లేచి ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు కాబట్టి సభ్యులు శాంతించటం మంచిదని సూచించారు. అయితే టిడిపి సభ్యులు మాత్రం ఏపికి చేసే సాయంపై ఎప్పటిలోగా ప్రకటన చేస్తారో చెప్పాలన పదే పదే పట్టుబట్టారు. దీనికి అనంతకుమార్ మళ్లీ స్పందిస్తూ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందని హామీ ఇవ్వటంతో తెలుగుదేశం సభ్యులు శాంతించారు.
సభలో నినాదాల హోరు
తెలుగుదేశం, వైకాపా సభ్యులు మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచే హోదాపై లోక్‌సభలో ఆందోళన ప్రారంభించారు. వైకాపా సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాదరావు, అవినాష్‌రెడ్డి పోడియం వద్దకు వచ్చి ప్రత్యేక హోదా డిమాండ్‌తో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ఇచ్చారు. టిడిపి సభ్యుడు జెసి దివాకర్ రెడ్డితోపాటు మొత్తం పనె్నండుమంది సభ్యులు అధికార పక్షంలో రెండో వరుసలో నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా కోసం గొడవ చేశారు. వారికి నచ్చజెప్పేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో స్పీకర్ నినాదాల హోరులోనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక దశలో ఇతర పార్టీల సభ్యులు మాట్లాడుతుంటే గల్లా జయదేవ్, అవంతి శ్రీనివాస్ తమ చేతిలోని ప్లకార్డులను మాట్లాడుతున్న సభ్యుల ముఖాలకు అడ్డం వచ్చేలా పెట్టేందుకు ప్రయత్నిండంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరిలా వ్యవహరిస్తే చర్య తీసుకోవలసి వస్తుంద’ని హెచ్చరించారు. చర్చకు అనుమతిస్తానని చెప్పినా వినకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీనికి తెలుగుదేశం సభ్యులు కూడా తీవ్రంగా స్పందించారు. ‘మాకు చర్చ వద్దు ప్రత్యేక హోదా మాత్రమే కావాలి. చర్చకు అంగీకరించే ప్రసక్తే లేద’ని జయదేవ్, అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జీరో అవర్‌లోనూ వారు నినాదాలు చేయడం ఆపలేదు. ఒక దశలో నినాదాలతో సభ దద్దరిల్లిపోవడంతో స్పీకర్ సభను పావుగంటసేపు వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశం కాగానే డిప్యూటీ స్పీకర్ సభలోకి వచ్చిన వెంటనే మరో పావుగంట సేపువాయిదా వేస్తున్నానని చెప్పి వెళ్లిపోయారు. ఈ సమయంలో సుమిత్రా మహాజన్ తమ ఛాంబర్‌లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సభను సజావుగా కొనసాగించటం గురించి చర్చించారు. ప్రత్యేక హోదా సాధించేందుకే తామీ విధంగా నిరసన తెలియజేస్తున్నామనీ, తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని తెలుగుదేశం సభ్యులు ఆమెను కోరారు. లోక్‌సభలో బుధవారం ఈ అంశంపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రతిపాదనను సుమిత్రా మహాజన్ ఆమోదించారు. అయితే తెలుగుదేశం సభ్యులు అందుకు సమ్మతించలేదు. లోక్‌సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా టిడిపి, వైకాపా సభ్యులు హోదా కోసం నినాదాలు కొనసాగించారు. సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు జైట్లీ ప్రకటన చేస్తూ ఏపికి ఆర్థిక సహాయంపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని హామీ ఇవ్వటంతో సభ సద్దుమణిగింది.

చిత్రం... ఢిల్లీలో మంగళవారం పార్లమెంట్ వెలుపల నినాదాలు చేస్తున్న తెలుగుదేశం, వైకాపా ఎంపీలు