జాతీయ వార్తలు

ఉమ్మడి వాటా ఇద్దరికీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కృష్ణా జలాల పంపిణీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకే వర్తింపచేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఉమ్మడి ఆంధ్రకు కేటాయించిన జలాలనే ఆంధ్ర, తెలంగాణలకు పంపిణీ చేయాలని తీర్పులో ఆదేశించింది. అంటే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం గడువు పొడిగించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు తెలుగు రాష్ట్రాలకే వర్తిస్తుంది తప్ప నాలుగు రాష్ట్రాలకు కాదన్న విషయం తాజా తీర్పుతో స్పష్టమైంది. ప్రాజెక్టులవారీ జలాలు కేటాయింపునకు సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రెండు రాష్ట్రాలు తమతమ వాదనలను బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ బుధవారం కీలక తీర్పు వెలువరించింది. రెండు తెలుగు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, వాదనలను నాలుగువారాల్లో దాఖలు చేయాల్సి ఉంటుందని తీర్పులో భాగంగా ఆదేశించింది. ట్రిబ్యునల్ తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. కృష్ణా జిల్లాల వివాదంపై బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తి శ్రీవాత్సవ, న్యాయమూర్తి రామమోహన్ రెడ్డి సభ్యులు. కృష్ణా జలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని పేర్కొంటూ, ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు, ఆపరేషనల్ ప్రొటోకాల్ కూడా రెండు రాష్ట్రాల మధ్యేనని ట్రిబ్యునల్ ప్రకటించింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కేటాయింపులు తెలుగు రాష్ట్రాలకే తప్ప, కర్నాటక, మహారాష్టల్రు దీని పరిధిలోకి రావని తేల్చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అసరం కూడా లేదని తీర్పులో స్పష్టం చేసింది. ‘రాష్ట్ర విభజన చట్టంలోని 85(8) (ఎ), 85(8) (ఈ)లను, పదకొండవ షెడ్యూలు సెక్షన్ 85(1)లు తమంత తాము కృష్ణా జలాల ట్రిబ్యునల్ తీర్పు పునఃపరిశీలించటాన్ని నిషేధించవు. అయితే గత ట్రిబ్యునల్ తీర్పుల్లో జోక్యం, లేదా పునఃపరిశీలన మంచిది కాదనే స్థాపిక చట్టాల వాదనకు ఇవి మద్దతిస్తున్నాయి’ అని బ్రిజేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. కృష్ణా నది ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు జరగనప్పుడు, తక్కువ వర్షపాతం కురిసిన సమయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు సాధ్యంకాకపోవచ్చని భావించేందుకు ఎలాంటి ఆస్కారం కనిపించటం లేదని ట్రిబ్యునల్ తన తాజా తీర్పులో పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదైన సమయంలో ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపు చేయవచ్చని ట్రిబ్యునల్ పేర్కొంది. ట్రిబ్యునల్ తాజా తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరదించుతుందని బ్రిజేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఆరవ విభాగంలోని సెక్షన్ 89పై తీర్పు ఇచ్చేందుకు తమ ట్రిబ్యునల్ ఇకమీదట పని చేస్తుందని స్పష్టం చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మొత్తం తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించింది.
చర్చించి నిర్ణయం తీసుకుంటాం
* ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంమీద ప్రభుత్వంతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ చెప్పారు. తీర్పు ప్రకటించిన అనంతరం దమ్మలపాటి విలేకరులతో మాట్లాడుతూ, నీటి కేటాయింపులు రెండు రాష్ట్రాల మధ్య
పరిమితం చేస్తూ తీర్పును ట్రిబ్యునల్ ప్రకటించిందన్నారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు సంబంధించి డిసెంబరు 14 నుండి వాదనలుంటాయని ఆయన వెల్లడించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ నిర్ణయిస్తుందని వెల్లడించారు.