జాతీయ వార్తలు

గిరిజన భాషలకు లిపిని రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,అక్టోబర్ 26: దేశంలోని వందలాది గిరిజన భాషలకు లిపిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఆసన్నమైందని టిఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు, సీనియర్ గిరిజన నాయకుడు ప్రొఫెసర్ సీతారాం నాయక్ కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని లక్షలాది మంది గిరిజనుల విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన జాతీయ గిరిజన కార్నివాల్‌లో సీతారాం నాయక్ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారి జాతీయ గిరిజన కార్నివాల్‌ను ఏర్పాటు చేసినందుకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. దేశంలోని వివిధ గిరిజన తెగలకు చెందిన ప్రజలు తమ సభ్యత, సంస్కృతి, జానపద సంస్కృతిని ప్రదర్శించేందుకు ఇది అద్భుతమైన అవకాశమని నాయక్ అన్నారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి అనుసరించవలసి వ్యూహాల గురించి కార్నివల్‌లో చర్చించాలన్న ప్రభుత్వం ఆలోచన అభినందనీయమని ఆయన తెలిపారు. దేశంలోని గిరిజనులు తమ భాషకు లిపి లేకున్నా జానపద సంస్కృతిని ఎన్నో వేల సంవత్సరాల నుండి కాపాడుకుంటున్నారని, అయితే ఇప్పుడు దేశంలోని దాదాపు 470 గిరిజన భాషలకు లిపిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని సీతారాం నాయక్ సూచించారు. తెలంగాణాలో గోండి, కోయ, బంజారా గిరిజనుల భాషలకు లిపి లేదన్నారు. భాషకు లిపి లేకపోవటం వలన గిరిజన సంస్కృతిని భావితరాలకు అందజేయటం కష్టమవుతోందన్నారు. పలు గిరిజన తెగలు మృగ్యమైపోయాయి, మరి కొన్ని గిరిజన తెగలు మృగ్యమైపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గిరిజనుల సంస్కృతిని భద్రపరిచేందుకు తగు చర్యలు తీసుకుంటారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్రం కోసం గిరిజనులు బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు తదితరుల నాయకత్వంలో బ్రిటీష్ పాలకులతో పోరాటం చేశారన్నారు. విద్య,వైద్య సౌకర్యం కల్పించటం ద్వారా గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనుల అభివృద్దికి ఉద్దేశించిన పథకాలను సమర్థంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి సక్రమంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.