జాతీయ వార్తలు

30 మంది పౌరుల ఊచకోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, అక్టోబర్ 26: సెంట్రల్ ఆఫ్గనిస్తాన్‌లో ఐఎస్ మిలిటెంట్లు మారణహోమం సృష్టించారు. 30 పౌరులను అపహరించుకుపోయి దారుణంగా చంపేశారు. మృతుల్లో చిన్న పిల్లలూ ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ జిహాదీ గ్రూపుతో సంబంధాలున్న మిలిటెంట్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వారన్నారు. ఘోర్ ప్రొవిన్స్ రాజధాని ఫిరోజ్ ఖోలో జరిగిన ఐఎస్ కమాండర్ హత్యకు ప్రతీకారంగా ఈ సామూహిక హత్యలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సిరియా, ఇరాక్ భూభాగంపై తిరుగులేని ఆధిపత్యం సాధించిన ఐఎస్‌ఐఎస్ ఆఫ్గనిస్తాన్‌లో పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. కాగా ఫిరోజ్‌ఖో కాల్పులు తమ పనేనని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థా అధికారికంగా ప్రకటించుకోలేదు. ‘స్థానికుల సహకారంతో మా భద్రతా దళాలు మంగళవారం దయేష్ (ఐసిఎస్) కమాండర్‌ను మట్టుబెట్టాయి. దీనికి ప్రతికారంగా దయేష్ మిలిటెంట్లు 30 మందిని కిడ్నాప్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు’ అని ఘోర్ గవర్నర్ నసీర్ ఖాజే వెల్లడించారు. మృతుల్లో అత్యధికులు గొర్రెల కాపరులేనని ఆయన అన్నారు. బుధవారం ఉదయం స్థానికులు మృతదేహాలను కనుగొన్నారని ఘరో ప్రొవిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్ హమీద్ నతేఖీ చెప్పారు. ఆఫ్గనిస్తాన్‌లో విస్తరించాలని ఐఎస్‌ఐఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే సానుభూతిపరులను మచ్చికచేసుకుంటూ రిక్రూట్‌మెంట్లు చేస్తోంది. దేశ తూర్పు ప్రాంతంలో ఇప్పటికే తిష్టవేసిన తాలిబన్లకు ఐఎస్ సవాల్‌గానే పరిణమించింది. ఐఎస్ జిహాదీలను తమ భద్రతాదళాలు కట్టడి చేశాయని ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గత మార్చిలో ప్రకటించారు. అయినప్పటికీ దేశంలో ఐఎస్ ఉగ్రవాద చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పౌరులను ఊచకోత కోయడం ద్వారా ఐసిస్ ఉనికిని చాటుకుంది. ఘోర్ ఒకప్పుడు తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండేదని, ఇప్పుడాపరిస్థితి మారినట్టు కనిపిస్తోందని ఆఫ్గనిస్తాన్ అనలైస్ట్ నెట్‌వర్క్ పరిశోధకుడు బొర్హాన్ ఒస్మాన్ చెప్పారు.

కేంద్ర సిబ్బందికి
రెండుశాతం డిఎ
నేడు కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దాదాపు 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58లక్షల మంది పెన్షనర్లకు దీపావలి కానుకగా రెండు శాతం కరవుభత్యం లభించబోతోంది. జూలై 1 నుంచి అమలులోకి వచ్చే విధంగా ఈ మేరకు కరవు భత్యాన్ని కేంద్రం ప్రకటించబోతోంది. గురువారం జరుగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ధరల పెరుగుదల కారణంగా సిబ్బంది, పెన్షనర్ల ఆదాయంపై పడే ప్రభావాన్ని తొలగించేందుకే ప్రభుత్వం డిఎను ప్రకటించనుంది. అయితే తమకు మూడు శాతం కరవుభత్యాన్ని ప్రకటించాలని కేంద్ర ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత పనె్నండు నెలల వినియోగదారుల సూచి సగటును లెక్క గడితే ఇది 2.92శాతంగా వస్తోందని, దీని దృష్ట్యా రెండు శాతం డిఎ యోచన ఎంత మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

జెఎన్‌యు హాస్టల్‌లో
పిహెచ్‌డి స్కాలర్ మృతి
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి నజీబ్ అహ్మద్ ఆచూకీకోసం ఆందోళన చేస్తున్న వర్శిటీ విద్యార్థులు ఓ హాస్టల్ గదిలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థి మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. మృతిచెందిన విద్యార్థిని మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లాకు చెందిన జెఆర్ ఫిలేమన్ (31)గా గుర్తించారు. బ్రహ్మపుత్ర హాస్టల్‌లోని రూమ్ నెంబర్ 171లో మంగళవారం సాయంత్రం ఫిలేమన్ మృతదేహం కనిపించినట్టు పోలీసులు చెప్పారు. పశ్చిమాసియా అంశంపై పిహెచ్.డి చేస్తున్న ఫిలేమన్ గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. రూమ్ నెంబర్ 171 నుంచి దుర్వాసన రావడంతో సమీపంలో ఉన్న రూమ్ విద్యార్థి ఇతర విద్యార్థులను, వర్శిటీ భద్రతా సిబ్బందిని పిలిచారు. తరువాత బలవంతంగా గది తలుపులు తెరవడంతో ఫిలేమన్ గదిలో మృతిచెంది ఉన్నాడు. ఫిలేమన్‌కు మద్యం సేవించే అలవాటు ఉందని, ప్రాథమిక అంచనాను బట్టి అతనిది సహజ మరణం అయి ఉంటుందని మరో పోలీసు అధికారి పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టుకోసం వేచి చూస్తున్నామని ఆ అధికారి తెలిపారు.
పది రోజుల క్రితం అదృశ్యమైన నజీబ్ అహ్మద్ ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. దీంతో అతని ఆచూకీ చెప్పిన వారికి ఇచ్చే రివార్డును పోలీసులు రూ. 50వేల నుంచి రూ. ఒక లక్షకు పెంచారు. నజీబ్ ఆహ్మద్ ఆచూకీకోసం ఆందోళన చేస్తున్న జెఎన్‌యు విద్యార్థులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన తరువాత పోలీసులు ఈ రివార్డు మొత్తాన్ని పెంచారు.