జాతీయ వార్తలు

ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఉమ్మడి పౌరస్మృతిని ఏకాభిప్రాయం లేకుండా దొడ్డిదారిన తీసుకురాబోమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓట్లు చీల్చడానికి బిజెపి వివాదాస్పద అంశాలను లేవనెత్తుతోందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరస్మృతి, రామమందిరం లాంటి అంశాలను లేవనెత్తమని చెప్పిన ఆయన అభివృద్ధి అజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇలాంటి కీలకమైన అంశాలను ఎన్నికల దృష్టికోణంలో చూడకూడదన్న వెంకయ్యనాయుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై మెరపుదాడులను ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలనుసైతం తోసిపుచ్చారు. ‘ట్రిపుల్ తలాక్‌ను మతపరమైన అంశంగా ప్రభుత్వం చూడడం లేదు. ఇది మహిళల మనోభావాలకు సంబంధించిన అంశం. ముస్లింలకు చెందిన విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నామనడం సరికాదు. ఇదే పార్లమెంటు, ఇదే రాజకీయ వ్యవస్థ హిందూ కోడ్ బిల్లును, విడాకుల చట్టాన్ని తీసుకువచ్చింది. వరకట్నం తీసుకోవడాన్ని, సతీ దురాచారాన్ని నిషేధించిందనే విషయాన్ని మరిచిపోరాదు’ అని పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెంకయ్యనాయుడు అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడానికి ఏకాభిప్రాయం అవసరమని స్పష్టం చేసిన ఆయన ఉమ్మడి పౌరస్మృతికోసం ట్రిపుల్ తలాక్ అంశాన్ని దొడ్డిదారిన తీసుకు వస్తున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. తాము ఇప్పుడు ట్రిపుల్ తలాక్ లేదా ఉమ్మడి పౌరస్మృతి అంశాలను చర్చించడం లేదని ఆయన అంటూ, లా కమిషన్ ఒక ప్రశ్నావళిని జారీ చేసి దానిపై స్పందించాలని ప్రజలను కోరిందన్నారు. ఏకాభిప్రాయం లేకుండా ఉమ్మడి పౌరస్మృతిని తేలేమన్న ఆయన ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో సుప్రీంకోర్టు సరయిన నిర్ణయం ప్రకటిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలను ఎన్నికలతో ముడిపెట్టరాదని, దేశంలో ఎన్నికలనేవి పండగల్లాంటివని, అవి తరచూ వస్తూ పోతూ ఉంటాయని వెంకయ్యనాయుడు అన్నారు. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ను ఆయన గట్టిగా సమర్థిస్తూ సతీ దురాచారాన్ని నిషేధించినప్పుడు ఎవరు కూడా అది హిందూ మతాచారమని, ప్రభుత్వం దానిలో జోక్యం చేసుకుంటోందని అనలేదన్నారు. మొత్తం దేశం దాన్ని సమర్థించిందన్నారు. మనల్ని మనం సంస్కరించుకున్నామని చెప్పిన ఆయన అలాగే ఏదయినా ఒక ఆచారం మహిళలపట్ల వివక్ష చూపిస్తున్నప్పుడు, వారికి అన్యాయం చేస్తున్నప్పుడు దానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని కోరుతున్నది ముస్లిం మహిళలు, ముస్లిం సంఘాలేనని, సుప్రీంకోర్టుకు వెళ్లిందీ వాళ్లేనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దీనిపై చర్చను ప్రారంభించింది కూడా తాము కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చర్చించిన సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని తన అభిప్రాయం చెప్పమని కోరిందని, ఇది అన్యాయం, అక్రమం, అనాగరికమైనదన్నది తమ అభిప్రాయమని పేర్కొంటూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన వివరించారు.