జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ర్యాంక్ సాధించాయి. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2016వ సంవత్సరానికి సంబంధించి సులభతర వాణిజ్య విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు 98.78 శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచాయని మంత్రి సీతారామన్ వెల్లడించారు. 2015 ర్యాంకుల్లో గుజరాత్ మొదటిస్థానం, ఆంధ్ర రెండోస్థానంలో వుంటే, తెలంగాణ 13వ స్థానంలో ఉంది. అయితే ఈ ఏడాది గుజరాత్ మూడోస్థానం దక్కించుకోగా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సమాన శాతాలతో అగ్రస్థానం దక్కించుకున్నాయి. నాలుగో స్థానం చత్తీస్‌గఢ్‌కు దక్కితే, మధ్యప్రదేశ్, హర్యానా, జార్కండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్టల్రు తరువాతి వరుస స్థానాలు సాధించాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక 13వ స్థానం, సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు 14వ స్థానం, మమతాబెనర్జీ సిఎంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌కు 15 స్థానం దక్కాయి. దేశ రాజధాని ఢిల్లీకి 19స్థానం లభించింది.
సింగిల్ విండో విధానం, పన్ను సంస్కరణలు, నిర్మాణ అనుమతులు, పర్యావరణం, కార్మిక, తనిఖీ సంస్కరణలు, వాణిజ్య విధానాలు, పేపర్హ్రిత కోర్టులు తదితర అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకులు కేటాయించినట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర వాణిజ్య శాఖ ప్రతిపాదించిన 340 పాయింట్ల వ్యాపార సంస్కరణల్లో ఎక్కువ శాతం అమలు చేసిన ఆంధ్ర, తెలంగాణకు 98.78 శాతం పాయింట్లు లభించటంతో అవి మొదటి స్థానంలో నిలిచాయని ఆమె వివరించారు. ఆంధ్ర రెండోస్థానం నుంచి మొదటి స్థానానికి చేరితే, తెలంగాణ 13 స్థానం నుంచి మొదటి స్థానానికి చేరడం గమనార్హం. దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలు తాము అమలు చేసిన ఏడు వేల 124 సంస్కరణల సమాచారాన్ని కేంద్రానికి అందించగా, ప్రపంచబ్యాంకు బృందం ఈ సమాచారాన్ని అధ్యయనం చేసి ర్యాంకులు కేటాయించింది. వ్యాట్ కోసం రిజిస్ట్రేషన్ కచ్చితం చేయటం, ఆన్‌లైన్ చెల్లింపులకు అనుమతులిచ్చే విధానాన్ని కల్పించటం, పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేయటం, నిర్మాణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో భవన ప్రణాళికల సమర్పణ, అనుమతులు మంజూరు చేయటం, ఆటోక్యాడ్ వ్యవస్థ ద్వారా ప్రణాళిక నమూనాలను పర్యవేక్షించి నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటికి అనుమతులు మంజూరు చేయటాన్ని ప్రవేశ పెట్టిన తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణలు అగ్రస్థానంలో ఉన్నాయి. గత ఏడాది చాలా రాష్ట్రాలు 75కంటే తక్కువ శాతం సంస్కరణలు అమలు చేయగా, ఈ ఏడాది మాత్రం మెజారిటీ రాష్ట్రాలు 75కంటే ఎక్కువ శాతం సంస్కరణలు అమలుచేసి పెద్ద ర్యాంకు కోసం పోటీ పడ్డాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పలు రాష్ట్రాలు తమ విధానాలను సంస్కరించటం ద్వారా వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆమె తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము-కాశ్మీర్‌లో సంస్కరణలను పెద్దఎత్తున చేపట్టాల్సిన ఉందని ఆమె సూచించారు. ఈ ఏడాది ఆ రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గ్రామస్థాయిలోనూ సంస్కరణలను అమలు చేస్తే మరింత మంచి ఫలితాలు లభిస్తాయని సీతారామన్ సూచించారు.
రైతు సానుకుల సంస్కరణల అమలులో
ఏపీకి 7, తెలంగాణకు 9వ ర్యాంకు
రైతు సానుకూల సంస్కరణల అమలులో ఏపీ 7, తెలంగాణ 9వ ర్యాంకు సాధించాయ. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్, రైతుల సానుకూల సంస్కరణల అమలులో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు సాధించిన ర్యాంకుల వివరాలను నీతిఆయోగ్ ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలు తొలి మూడు స్థానాలలో నిలిచాయ. వ్యవసాయరంగ అభివృద్ధికి రాష్ట్రాలు చేపడుతున్న విధానాల ఆధారంగా మొదటిసారి నీతి ఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది. సాగు అడ్డంకులు అధికమించి రైతుకు సానుకూల సంస్కరణలను రాష్ట్రాలు ప్రవేశపెట్టడాన్ని ప్రోత్సహిస్తూ ర్యాంకులు ప్రకటిస్తున్నట్టు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియ వెల్లడించారు. రైతు ఆదాయ పెంపునకువున్న మూడు ఆంశాలపై దృష్టి సారించనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్, కౌలు భూములు, అడవుల పెంపకంపై సంస్కరణలు ప్రవేశపెట్టాడానికి నీతి ఆయోగ్ కసరత్తు చేస్తుందన్నారు. రైతు సానుకూల సంస్కరణల అమలులో ఏపీకి 56.2, తెలంగాణకు 54.3 శాతం పాయంట్లు వచ్చాయన్నారు. మహారాష్ట్ర అత్యధికంగా 81.7 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.