జాతీయ వార్తలు

విశ్వసనీయతే గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: అతివేగంగా విస్తరిస్తున్న నేటి సాంకేతిక యుగంలో విశ్వసనీయతే మీడియాకు ఎదురవుతున్న పెద్ద సవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశ్వసనీయతే గీటురాయిగా మీడియా రాణించాలని, ఈ లక్షణాన్ని నిరంతరం కాపాడుకునేందుకు ప్రయత్నించాలని ఉద్బోధించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నిర్వహించిన రామ్‌నాథ్ గోయంకా జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో బుధవారం నాడిక్కడ పాల్గొన్న ప్రధాని మోదీ గతంలో పాత్రికేయ వృత్తిలోకి వచ్చిన వారందరికీ తగిన శిక్షణ, విద్యార్హతలుండేవని చెప్పారు. కానీ, నేటి టెక్నాలజీ యుగంలో ఓ మొబైల్ ఫోన్‌తో ఫొటో తీసి అప్‌లోడ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రచురించే వార్తలకు సంబంధించి మీడియా సంస్థలు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ రకమైన విశ్వసనీయతనే మీడియా నుంచి ప్రజలు కోరుకుంటున్నారని ఉద్ఘాటించారు. మీడియాకు దేనిమీదైనా వ్యాఖ్యానించే, ఎవరిపైనైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని చెప్పిన మోదీ ‘..కానీ తనపై ఇతరుల అభిప్రాయాలను అంగీకరించదు..’ అంటూ వ్యంగ్యోక్తి విసిరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక స్థాయిలో మీడియా దృష్టిలో పడ్డ ఏకైక నేతను తనేనని.. అందుకు మీడియాకు నిరంతరం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం తనకు ఉందని మోదీ అన్నారు. మీడియా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాల్సిన సమస్యలు ప్రభుత్వానికి ఏమీ లేవని పేర్కొన్న ప్రధాని వార్తల ప్రచురణ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాల్సిన అవసరం మీడియాకు ఎంతైనా ఉందని అన్నారు. భారత్ వైవిధ్య భరితమైన దేశం కాబట్టి దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణే మీడియా ధ్యేయం కావాలన్నారు. ‘మీ కంటే రాజకీయ నాయకులు ఎక్కువ తప్పులు చేయవచ్చు కానీ, దయచేసి జాతీయ భావాలు కలిగిన శక్తుల్ని బలోపేతం చేసేందుకే ప్రయత్నించండి’ అని మీడియాకు మోదీ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయంగా భారత దేశ అభిప్రాయాలను బలంగా వినిపించడానికి ప్రపంచ స్థాయి భారత మీడియా సంస్థ ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇలాంటి సంస్థకు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదని స్వతంత్య్రంగానే అది పనిచేసి భారత అంతర్గత శక్తిని విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు.

చిత్రం... ఢిల్లీలో బుధవారం ఫొటో జర్నలిస్టు బుర్హాను కినుకు రామనాథ్ గోయంకా
అవార్డు కింద చెక్కును అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ