జాతీయ వార్తలు

రెచ్చగొట్టేవారి పట్ల అప్రమత్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 27: భారత్-పాకిస్తాన్ సంబంధాల్లో ఇటీవల నెలకొన్న సుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేసే రెండు దేశాల్లోని జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మితవాద హురియత్ కాన్ఫరెన్స్ రెండు దేశాల్లోని రాజకీయ అగ్రనాయకత్వాన్ని కోరింది. కాశ్మీర్‌సహా అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాలు ధైర్యంగా ముందుకు సాగుతాయన్ని ఆశాభావాన్ని మిర్వైజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని హురియత్ కాన్ఫరెన్స్ అభిప్రాయ పడింది. అంతేకాదు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తమ వర్గం వెనకాడదని, ఏ చర్చలైనా సరే ఎలాంటి అరమరికలు లేకుండా సహృదయంతో జరగాలని అభిప్రాయపడింది. గత శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్‌లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సమావేశం కావడం రెండు దేశాల ప్రజలకేకాక మొత్తం దక్షిణాసియా ప్రాంతానికి కూడా కొత్త ఆశలను రేకెత్తించిందని ముస్లిం మత పెద్ద కూడా అయిన మిర్వైజ్ ఫరూక్ అన్నారు. ఎన్నో స్పీడ్ బ్రేకర్ల తర్వాత ప్రారంభమైన చర్చల ప్రక్రియ ఊపందుకుంటుందని, రెండు దేశాల నేతలు చర్చించుకుని కాశ్మీర్ ప్రజలకు చెందిన సమస్యలతోపాటు అన్ని అపరిష్కృత సమస్యలకు పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నట్లు మిర్వైజ్ ఆదివారం ఇక్కడ పిటిఐతో అన్నారు.
అయితే ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడం ఇష్టం లేని ఉగ్రవాద శక్తులు ఈ శాంతి ప్రక్రియకు గండికొట్టడానికి ప్రత్నించవచ్చని ఆయన హెచ్చరించారు. రెండు దేశాల ప్రధానులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనవారేనని, తమ దేశాల్లో బలమైన ప్రజాదరణ ఉన్నవారని, ఒకవేళ వారు శాంతిప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే అందుకు ప్రతిపక్షాలు, ప్రజల మద్దతు అవసరమని అన్నారు. శాంతిని సాధించడానికి జరిపే కృషికి అడ్డుగా వచ్చే ఏ పార్టీ, గ్రూపు అయినా దక్షిణాసియా ప్రజలకు శత్రువులే. ఈ ప్రక్రియలో భాగస్వాములు కావడానికి రెండు దేశాల్లోని నాయకత్వం ఇందులో పాత్ర ఉన్న వారినందరినీ ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలను ఆహ్వానించి పాలుపంచుకునేలా చేయాలని అన్నారు. దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలంటే ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే వారిని కట్టడి చేయాలని మిర్వైజ్ అన్నారు. ఒకప్పుడు మిత్రుడైన సయ్యద్ అలీ షా జిలానీ సహా కొన్ని వేర్పాటువాద ముఠాలను విచ్ఛిన్నకర శక్తులని అంటారు కదా అని అడగ్గా, కాశ్మీర్‌లో ప్రతి ఒక్కరు కూడా అర్థవంతమైన చర్చలను సమర్థిస్తారని ఆయన చెప్పారు. కాశ్మీర్ ఒక రాజకీయ సమస్య అని, చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరముందనేది తమ వర్గం నమ్ముతోందని, శాంతిప్రక్రియ విజయవంతమయ్యేలా చూడడానికి అవసరమైతే ఒక అడుగు ముందుకేయాలనేది తమ అభిప్రాయమని అన్నారు. కాశ్మీర్ రెండు దేశాల మధ్య స్నేహవారధిగా ఉండాలే తప్ప వివాదానికి కారణంగా ఉండకూడదని తాను అనేక సందర్భాల్లో చెప్పినట్లు కూడా మిర్వైజ్ వివరించారు. హురియత్ కాన్ఫరెన్స్ కేంద్రంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందా అని అడగ్గా, కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి పాకిస్తాన్‌తో కానీ, భారత్‌తో కానీ చర్చలు జరపడానికి తాము ఎప్పుడూ వెనకాడలేదని ఆయన అన్నారు. తాము మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్‌తోను, అలాగే పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తోను చర్చలు జరిపామని, ముందుకు వెళడానికి కొన్ని సూచనలు కూడా చేసామని ఆయన చెప్పారు. అయితే చర్చలు ఎలాంటి అరమరికలు లేకుండా జరగాలని మిర్వైజ్ అన్నారు.