జాతీయ వార్తలు

మా లక్ష్యం నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, 2029 నాటికి ఏపిని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఫిక్కి అధ్యక్షుడు రాకేష్ భారతి మిట్టల్‌తో జరిపిన చర్చల్లో విశాఖపట్నంలో జనవరి 27, 28 తేదీల్లో భాగస్వామ్య సదస్సు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో గత ఏడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 4 లక్షల 67 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 328 ఒప్పందాలపై సంతకాలు చేశామనీ, ఇంతవరకు 93 సంస్థల పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని, లక్షా అరవై వేల మందికి ఉపాధి లభిస్తోందని వివరించారు. కార్పొరేట్ పెట్టుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందనీ, ఎఫ్‌డిఐలు కూడా బాగా వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు, మార్కెట్లు ఉన్నాయన్నారు. గత సంవత్సరం దేశాభివృద్ధి 7.5 శాతం ఉంటే, ఏపీ 10.99 శాతం అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. చెన్నై-విశాఖపట్నం; బెంగళూరు- చెన్నై పారిశ్రామిక కారిడార్ల వల్ల పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా ఉంటుందన్నారు. సముద్ర రవాణాలో ప్రస్తుతం ఏపి రెండో స్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానం సాధిస్తామనే ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాలున్నాయని, మరో ఆరేడు విమానాశ్రయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ‘ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నాం, అత్యున్నత ఆసుపత్రుల, విశ్వవిద్యాలయాలు నిర్మిస్తున్నాం, దీనికి అంతర్జాతీయ స్థాయిలో అందరినీ ఆహ్వానిస్తున్నామ’ని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2015 నుండి ఇంతవరకు పరిశ్రమల స్థాపనకు సంబంధించిన 11వేల దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. దరఖాస్తు రాగానే 21 రోజుల్లో అనుమతి మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. 500, 1000 నోట్ల రద్దు వలన పెట్టుబడులు పెరుగుతాయనీ, నిజాయితీపరులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.
ఏపీ తీరానికి మహర్దశ: నిర్మలా సీతారామన్
విశాఖపట్నం కేంద్రంగా రానున్న రెండేళ్లలో ఏపిలో సముద్ర ఉత్పత్తుల వ్యాపారం పెద్దఎత్తున జరుగబోతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విశాఖపట్నం-చెన్నై, బెంగళూరు-చెన్నై కారిడార్లను జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి కార్యక్రమంతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తే మంచి పారిశ్రామిక ఫలితాలుంటాయని అన్నారు. ఏపీ తీరంలోని తొమ్మిది ఓడరేవులతో ఏర్పాటయ్యే సముద్ర తీర ఆర్థిక జోన్ వ్యవస్థ వలన రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి గణనీయంగా ఉంటుందని చెప్పారు. దీనికోసం నీతి ఆయోగ్ ఏపీతో కలిసి పని చేస్తోందన్నారు. కాకినాడలో త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజీంగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.

చిత్రం.... ఢిల్లీలో గురువారం విలేఖరులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
చిత్రంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు