జాతీయ వార్తలు

జనం గుండెల్లోనే అమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 7: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భౌతికంగా లేకపోయినా లక్షలాది మంది హృదయాల్లో సజీవంగానే ఉన్నారు. మెరీనా బీచ్‌లో ప్రియతమ నాయకురాలిని ఖననం చేసిన సమాధివద్దకు జయ అభిమానులు వెల్లువలా తరలివస్తున్నారు. తన రాజకీయ గురువు, దివంగత ఎంజి రామచంద్రన్ సమాధికి ఇరవై అడుగుల దూరంలోనే అన్నాడిఎంకె అధినేత్రి పార్దివదేహాన్ని మంగళవారం ఖననం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు మెరీనా బీచ్‌లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధిని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడు ప్రజలు అమ్మగా ఆరాధించే జయకు నివాళులు అర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చారు. తమ కుటుంబ సభ్యుని కోల్పోయినంత బాధ అందరి ముఖాల్లో కనిపించింది. మంగళవారం తమ ప్రియతమ అధినేత్రి అంత్యక్రియాల్లో పాల్గొనలేకపోయినవారితో మెరీనాబీచ్ ప్రాంతం జన సందోహంగా మారిపోయింది. అమ్మకు నివాళులు అర్పించడానికి వేలాదిగా వస్తున్న అభిమానులు ఎంతో క్రమశిక్షణతోనూ శాంతియుతంగానూ వ్యవహరిస్తున్నారు. విదేశాల్లో షూటింగ్ రద్దుచేసుకుని నగరానికి చేరుకున్న జయ అభిమాని, హీరో అజిత్ కుమార్, భార్య షామిలీతో కలిసి అమ్మ సమాధికి చేరుకుని అంజలి ఘటించారు. మెరీనాబీచ్ ప్రాంతంలో అభిమానులు, ముఖ్యంగా మహిళలు జయను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. భౌతికంగా లేకపోయినా అమ్మ తమ హృదయాల్లోనే చిరస్థాయిగా ఉండిపోతారని అన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి జయ అధికార నివాసమైన పొయెస్‌గార్డెన్‌లోని ‘వేద నిలయం’కు సందర్శకుల తాకిడి కనిపించింది. అనేక సందర్భాలో నివాసానికి వచ్చి జయను కలిసిన జ్ఞాపకాలను కార్యకర్తలు గుర్తుచేసుకున్నారు.
chitram...
మెరీనా బీచ్‌లో జయలలితను ఖననం చేసిన ప్రాంతానికి బుధవారం తరలివచ్చిన జనం