జాతీయ వార్తలు

తమిళనాడులో సంచలనం .... సిఎస్‌పై ఐటి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 21: ఆదాయం పన్ను శాఖ అధికారులు బుధవారం తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ మోహన్ రావు, ఆయన కుమారుడి నివాసంపైన దాడులు చేశారు. రామమోహన్ రావు నివాసంతో పాటుగా చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, బెంగళూరులలో ఉన్న ఆయన బంధువులకు చెందిన మరో 12 నివాసాలపైన ఏకకాలంలో దాడులు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయానికి నగరంలోని అన్నానగర్ ఆరో నంబరు వీధిలో ఉన్న రామమోహన్ రావు నివాసానికి చేరుకున్న ఆదాయం పన్ను అధికారులు సోదాలు మొదలుపెట్టారు. దాదాపు వందమంది ఆదాయం పన్ను శాఖ అధికారులు సుమారు 35 మంది ఉండే ఒక సిఆర్‌పిఎఫ్ ప్లాటూన్ సాయంతో ఈ దాడుల్లో పాల్గొన్నారు. రామమోహన్ రావు కుమారుడు వివేక్ పాపిశెట్టి నివాసంపైన, ఆయన బంధుల నివాసాలపైన జరిపిన దాడుల్లో 18 లక్షల రూపాయల విలువైన కొత్త నోట్లు ఒక్కోటి కిలో బరువుండే రెండు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయం పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. అయితే అంతకుమించి భారీ మొత్తంలోనే నగదు, బంగారం, విలువైన పత్రాలు పట్టుబడినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న వివేక్ మామగారి ఇంట్లో సైతం భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు, ప్రముఖ కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి, ఆయన బంధువుల నివాసాల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు ఈ నెల 9న జరిపిన దాడుల్లో వందల కోట్ల విలువైన బంగారం, బంగారు, వెండి ఆభరణాలు, రద్దయిన పాతనోట్లతో పాటుగా భారీ మొత్తంలో కొత్త నోట్లు కూడా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యగానే ఇప్పుడు ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. శేఖర్ రెడ్డికి, రామమోహన్ రావు కుమారుడు వివేక్‌కు మధ్య వ్యాపార సంబంధాలున్నట్లు శేఖర్ రెడ్డి కేసు దర్యాప్తు సందర్భంగా లభించిన పక్కా సమాచారం ఆధారంగానే ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు.
కాగా, దాడుల సందర్భంగా ఆదాయం పన్ను శాఖ అధికారులకు రామమోహన్ రావు పూర్తిగా సహకరిస్తున్నారని, వివేక్ స్టేట్‌మెంట్‌ను సైతం అధికారులు రికార్డు చేశారని ఐటి వర్గాలు తెలిపాయి. ఐటి అధికారులు రామమోహన్ రావు నివాసంతో పాటుగా సెక్రటేరియట్‌లోని ఆయన కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం రామమోహన్ రావును గత జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన అంతకు ముందు జయలలితకు ముఖ్య కార్యదర్శిగా కూడా పని చేశారు. జయలలితతో పాటుగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు సైతం రామమోహన్ రావు సన్నిహితుడని చెప్తారు. ఆయన వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిటైర్ కావలసి ఉంది. కాగా, ఒక ప్రధాన కార్యదర్శిపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరగడం తమిళనాడు చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్ రావు నివాసంపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
వియ్యంకుడి ఇంట్లో సోదాలు
చిత్తూరు: ఇదిలా ఉండగా చిత్తూరులోని తమిళనాడు సిఎస్ రామ్‌మోహన్‌రావు వియ్యంకుడు, టిడిపి నేత బద్రీనారాయణ ఇంట్లో ఐటి అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. చెన్నైకి చెందిన పలువురు ఐటి అధికారులు రెండు బృందాలుగా వచ్చి చిత్తూరులోని లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న బద్రీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో చిత్తూరుతో పాటు బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఎమ్మెల్యే సంస్థలపైనా ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మరిది అయిన బద్రీనారాయణ ఇంటిపై ఐటి అధికారులు దాడి చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేకెత్తించింది. అయితే ఈ దాడుల్లో కొన్ని రికార్డులతోపాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

చిత్రం... తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామమోహన్‌రావు ఇంట్లో ఐటి అధికారుల దాడులు. బయట
భారీగా పోలీసుల మోహరింపు