జాతీయ వార్తలు

అణు కేంద్రాల జాబితాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: భారత పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం శుక్రవారం తమ దేశాల్లోని అణు కేంద్రాల జాబితాను పరస్పరం అందజేసుకున్నాయి. ఈ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఒక దేశానికి చెందిన అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయడానికి వీలు లేదు. ఇటు ఢిల్లీలో, అటు ఇస్లామాబాద్‌లో ఏకకాలంలో ఇరు దేశాలు తమ దౌత్య వర్గాల ద్వారా ఈ జాబితాలను పరస్పరం అందజేసుకున్నాయి. మామూలు ఖైదీలు, మత్స్యకారులు సహా తమ జాతీయుల జాబితాను కూడా ఇరు దేశాలు పరస్పరం అందజేసుకున్నాయి. అణు కేంద్రాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 1988 డిసెంబర్ 31న కుదిరిన ఈ ఒప్పందం 1991 జనవరి 27న అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ అణు కేంద్రాల వివరాలను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన పరస్పరం తెలియజేసుకోవాల్సి ఉంటుంది. ఇరు దేశాలు మరో దేశంలోని జైళ్లలో ఉన్న తమ జాతీయుల జాబితాను కూడా పరస్పరం అందజేసుకున్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2008 మే 31న కుదిరిన ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు ప్రతి సంవత్సరం రెండుసార్లు- జనవరి ఒకటో తేదీన, జూలై ఒకటో తేదీన- ఇలా ఖైదీల జాబితాను పరస్పరం అందజేసుకోవాల్సి ఉంటుంది.
కాశ్మీర్‌లో ఘర్షణలు
అణచివేసిన భద్రతా సిబ్బంది
కాశ్మీర్, జనవరి 1: కాశ్మీర్‌లో శుక్రవారం రెండు చోట్ల హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అల్లరి మూకలు భద్రతా సిబ్బందిపై రాళ్లు విసురుతూ దాడికి దిగగా, భద్రతా సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించడం ద్వారా తిప్టికొట్టాయని అధికారులు చెప్పారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే కొంతమంది యువకులు నిరసన ప్రదర్శనలకు పూనుకున్నారు. ఈ నిరసన ప్రదర్శనల సందర్భంగా బుధవారం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు మిలిటెంట్లకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ మిలిటెంట్ల మృతికి సంతాపంగా వరుసగా రెండో రోజు శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బంద్ జరిపారు. పాత శ్రీనగర్‌లోని నవ్‌హట్టా ప్రాంతంలోనూ శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే ఘర్షణలు తలెత్తాయని అధికారులు చెప్పారు. జామా మసీదులో ప్రార్థనలు ముగిసిన వెంటనే ఒక యువకుల బృందం వీధుల్లోకి వచ్చి మిలిటెంట్లకు అనుకూలంగా నినాదాలు ఇస్తూ నౌహట్టా చౌక్ వైపుకు దూసుకుపోవడానికి ప్రయత్నించారు. అయితే భద్రతా బలగాలు జోక్యం చేసుకొని ఆ బృందాన్ని ముందుకు పోకుండా నిలిపివేశాయి. దీంతో ఆ యువత భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వింది. కొంత మంది నిరసనకారులు ఐఎస్‌ఐఎస్ పతాకాన్ని కూడా ప్రదర్శించారు. భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రదర్శించటం ద్వారా వారిని చెదరగొట్టారు. అయితే ఈ ఘర్షణల్లో ఎవరూ గాయపడలేదని వివరించారు.
ఇక ఇద్దర్ని కనొచ్చు!
చైనాలో ‘వన్ చైల్డ్’ పాలసీకి మంగళం
బీజింగ్, జనవరి 1: మూడు దశాబ్దాలుగా అమలులో వున్న ‘వన్ చైల్డ్’ పాలసీకి చైనా చరమగీతం పాడింది. ఈ ఏడాది జనవరి 1నుంచి ఇద్దరికి జన్మనిచ్చేందుకు అనుమతి ఇస్తూ కుటుంబ నియంత్రణ తాజా విధానం అమలులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో 1978లో ప్రవేశపెట్టిన వన్ చైల్డ్ పాలసీ విమర్శలకు కేంద్ర బిందువైంది. పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు వన్ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ, చివరకు వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, శ్రామిక శక్తి తగ్గిపోయి సంక్షోభానికి దారితీయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వం గత అక్టోబర్‌లో ప్రకటించడం, దానికి జాతీయ లెజిస్లేచర్ డిసెంబర్‌లో ఆమోదముద్ర వేయడంతో ఇద్దరు పిల్లల విధానం ఈ ఏడాది జనవరి 1నుంచి అమలులోకి వచ్చింది. ‘వన్ చైల్డ్’ పాలసీని బలవంతంగా అమలుచేయడం, ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడంతో పాటు బలవంతంగా గర్భస్రావాలు చేయడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడటంతో ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. చైనా ప్రభుత్వం అమలుచేసిన ఈ చర్యలవల్ల 400 మిలియన్ జననాలను అడ్డుకుంది. ఈ చర్యల వల్ల 2013 గణాంకాల ప్రకారం జనాభాను 1.357 బిలియన్‌కు నియంత్రించగలిగింది.