జాతీయ వార్తలు

గోవాలో నాలుగు స్తంభాలాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ అనివార్యం కావటంతో అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లకు ఊపిరాడటం లేదు. నలభై సీట్లున్న గోవా శాసనసభకు ఫిబ్రవరి నాలుగో తేదీన పోలింగ్ జరుగుతుంది. బిజెపి, కాంగ్రెస్, మహారాష్టవ్రాదీ గోమంతక్ పార్టీ, గోవా సురక్షా సమితి కూటమితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగటంతో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ లోటు బిజెపిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రెండోసారి సునాయసంగా విజయం సాధించేదనే మాట వినిపిస్తోంది. పారికర్ స్థానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన లక్ష్మీకాంత్ పర్సేకర్ ఆశించిన స్థాయిలో ఓటర్లను ఆకట్టుకోలేకపోతున్నారు. పారికర్ అంతా తానై ఎన్నికల వ్యూహాన్ని నడిపిస్తున్నా పర్సేకర్ పట్ల రాష్ట్ర ఓటర్లకు విశ్వాసం కలగటం లేదు. దీనికితోడు ఆర్‌ఎస్‌ఎస్ గోవా విభాగం సీనియర్ నాయకుడు సుభాష్ వెలింగ్కర్ గోవా సురక్షా మంచ్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసుకుని బిజెపి మిత్రపక్షాలైన మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ, శివసేనలను కూడగట్టి ఎన్నికల బరిలోకి దిగారు. క్రైస్తవ మిషనరీల ఆధిపత్యంలో పని చేస్తున్న ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు గ్రాంట్లు ఇవ్వటం ద్వారా గోవా భాష, సంస్కృతులను బిజెపి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆయనతోపాటు మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, శివసేన పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. మనోహర్ పారికర్ కేంద్రానికి వెళ్లిపోయినప్పటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. క్రైస్తవులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మిషనరీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. గూండాయిజం పెరిగిపోయింది, అందుకే తమకు భద్రత కల్పించేవారికే ఓటేస్తామని ఆ సంస్థలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కామత్ నాయకత్వంలోని కాంగ్రెస్ విజయంకోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. క్రైస్తవుల మద్దతు సంపాదించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌తోపాటు గోవా అసెంబ్లీ ఎన్నికలపైనా దృష్టిపెట్టి విజయంకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయన ఇప్పటికే పలుమార్లు గోవాలో పర్యటించారు. ఢిల్లీ మాదిరిగా గోవాలో కూడా వీధి క్లినిక్స్ ఏర్పాటు చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. దబోలిన్‌లో పౌర విమానాశ్రయం ఏర్పాటుతోపాటు హోప్సియో, ఆసిలో ఆసుపత్రులను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ స్థాయికి పెంచుతానని హామీ ఇచ్చారు. శాసనసభలో మొత్తం నలభై సీట్లుండగా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 21 సీట్లు గెలిచి మూడు సీట్లు గెలిచిన మహారాష్టవ్రాదీ గోమంతక్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తొమ్మిది సీట్లు గెలుచుకుంటే, ఐదుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. గోవా వికాస్ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. బిజెపికి 35 శాతం ఓట్లు లభిస్తే, కాంగ్రెస్‌కు 31 శాతం ఓట్లు లభించాయి. అయితే గత ఐదేళ్లలో బిజెపి, కాంగ్రెస్ పార్టీల ఓటు శాతం బాగా తగ్గింది.
గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఇంతవరకు నాలుగు సర్వేలు జరుగగా మూడు సర్వే ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఉంటే ఒక సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఏకైక పెద్దపార్టీగా ఆవిర్భవిస్తుందని అంచనా వేసింది. ఇండియా టుడే-యాక్సిస్ సర్వే ప్రకారం బిజెపికి 20 నుండి 24 సీట్లు, కాంగ్రెస్‌కు 13 నుండి 15 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు నుండి నాలుగు సీట్లు, ఇతరులకు ఒకటి నుండి నాలుగు సీట్లు లభిస్తాయని అంచనా వేసింది. కౌటిల్య సంస్థ జరిపిన సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 14, బిజెపికి 11, కాంగ్రెస్‌కు 7, ఎంజిపికి 6, స్వతంత్రులకు 2 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. ప్రూడెంట్ మీడియా నిర్వహించిన సర్వే బిజెపికి 17-18, ఎంజిపికి 3-4,కాంగ్రెస్‌కు 12-13, ఆమ్ ఆద్మీ పార్టీకి 4-5, ఇతరులకు 1-2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. విడిపిఏ అసోసియేట్స్ జరిపిన సర్వే ప్రకారం బిజెపికి 22, ఆమ్ ఆద్మీ పార్టీకి 9, కాంగ్రెస్‌కు 6, ఇతరులకు రెండు సీట్లు వస్తాయని చెబుతోంది.