జాతీయ వార్తలు

భారీ మానవ హారం .. చరిత్ర సృష్టించిన బిహార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జనవరి 21: మద్యపాన నిషేధాన్ని సమర్ధిస్తూ బిహార్‌లో శనివారం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ హారాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ మానవ హారంలో పాల్గొని మద్యపాన నిషేధం పట్ల తమకు గల నిబద్ధతను చాటుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు నితీశ్ కుమార్ చారిత్రక గాంధీ మైదానంలో మువ్వనె్నల బెలూన్లను ఎగురవేసి ఈ మానవ హారాన్ని ప్రారంభించారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భారీ మానవ హారం మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ప్రజలతో ఒకవైపు నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూప్రసాద్ యాదవ్, మరోవైపు రాష్ట్ర శాసనసభ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి చేతులు కలిపి ఈ మానవ హారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరంతా మద్యపాన నిషేధానికి మద్దతు తెలుపుతూ ఐక్యంగా గళమెత్తారు. బిహార్ శాసన మండలి చైర్మన్ అవ్‌దేశ్ నారాయణ్ సింగ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రి అశోక్ చౌదరి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు తారిక్ అన్వర్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష బిజెపి మద్దతు తెలపడంతో పాటు శివాన్‌లో ఆ పార్టీ నాయకులు సుశీల్ కుమార్ మోడీ, కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్, అసెంబ్లీ ప్రతిపక్ష నేత ప్రేమ్ కుమార్, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్, పార్లమెంట్ సభ్యుడు జనార్ధన్ సింగ్ సిగ్రివాల్ తదితరులు ఈ మానవ హారంలో పాల్గొన్నారు. గాంధీ మైదానంలో నితీశ్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్, ఇతర నాయకులు బిహార్ మ్యాప్ రూపంలో మానవ హారాన్ని నిర్మించగా, దాని మధ్యలో మరికొంత మంది మద్యం సీసా రూపంలో మానవ హారాన్ని నిర్మించి మద్యపానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్న సందేశాన్ని ఇచ్చారు. ఈ ఘట్టాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఉపగ్రహాలతో పాటు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా చిత్రీకరించారు. రెండు కోట్ల మంది పౌరులతో దాదాపు 11,292 కిలోమీటర్ల పొడవున ఏర్పాటైన ఈ మానవ హారం ప్రపంచంలోనే అత్యంత భారీ మానవ హారంగా చరిత్రకెక్కింది. 2004లో బంగ్లాదేశ్‌లో 1,050 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన మానవ హారం ఇప్పటివరకూ ప్రపంచంలో అతిపెద్ద మానవ హారంగా రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అయితే దీనికంటే ఎన్నో రెట్లు పెద్దదైన బిహార్ మానవ హారం ఈ రికార్డును చెరిపేసింది.

చిత్రం... మద్యపాన నిషేధాన్ని సమర్ధిస్తూ శనివారం పాట్నాలో
మానవహారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు