జాతీయ వార్తలు

భ్రమలు పటాపంచలు ( విశే్లషణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వ్యూహాల చుట్టూ తిరిగిన భ్రమలను నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పటాపంచలు చేశారు. అధికార సోపానాన్ని కైవసం చేసుకునేందుకు కులమతాలే కీలకమని భావిస్తూ వచ్చిన రాష్ట్రంలో 312 సీట్లను ఆర్జించి స్వతంత్ర భారతావనిలో సరికొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్టమ్రనీ, కులం మాత్రమే అక్కడ విజేతను నిర్ణయిస్తుందన్న తొలి భ్రమ తొలగిపోయింది. సంప్రదాయకంగా ముస్లిం-యాదవుల కూటమి మాత్రమే రాష్ట్రంలో విజయం సాధించగలుగుతుందన్నది ఒక వాదన. ఇప్పుడు అదీ నీరుగారిపోయింది. ముస్లింలు-యాదవులు చేతులు కలిపినా ఫలితం పూజ్యమన్నది తాజాగా కళ్లకు కట్టిన వాస్తవం. ముస్లింలు, యాదవులు తమవైపే ఉన్నారని, ఇక విజయం తమదేనని భ్రమించిన కాంగ్రెస్-సమాజ్‌వాది కూటమి ఆశలు అడియాసలయ్యాయి. ఏ విధంగా చూసినా ఇది ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి శుభ సంకేతం.
ఉత్తర ప్రదేశ్‌లో మైనారిటీలకు గాలం వేయగలిగే వారికే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయనేది రెండో భ్రమ. యుపి జనాభాలో ముస్లింలు 20 శాతానికి పైగా ఉండగా, కనీసం 70 నియోజవర్గాల్లో 30 శాతం మంది ముస్లింలే ఉన్నారు. బిఎస్పీ అధినేత్రి మాయావతి ఏకంగా 100 మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ద్వారా తాను ముస్లింల పక్షాన ఉన్నాననే సంకేతాలు ఇచ్చారు. కానీ విచారకరమైన విషయమేమిటంటే ఆమె గెలుచుకున్న సీట్లు కేవలం రెండంకెలకే పరిమితమయ్యాయి. అంతేకాదు, ఈ ఎన్నికలతో ఆమె రాజకీయ మనుగడకూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బిజెపి ఇటీవలి ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థినీ నిలబెట్టలేదు. ‘సబ్ కే సాథ్...సబ్ కా వికాస్’ అంటూ నినదించే బిజెపి, ఓ కీలకమైన వర్గాన్ని ఎలా విస్మరిస్తుంది? ఇది సహజంగానే విమర్శలకు తావిచ్చింది. బిజెపిలోని సీనియర్ నేతలు సైతం ఇది తప్పేనని పోలింగ్ చివరి దశలో అంగీకరించారు. కనీసం కొంతమంది ముస్లిం అభ్యర్థులకైనా టికెట్లు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాలను గమనిస్తే బిజెపికి లభించిన సీట్ల సంఖ్య 300 దాటిపోవడాన్ని బట్టి ఓటర్లు మతం ప్రాతిపదికన ఓటు వేయలేదని రుజువైంది.
ముస్లింలు చాలా తెలివిగా ఓటు వేస్తారన్నది మరో భ్రమ. బరిలో ఉన్నది బిజెపి అభ్యర్థి అయితే చాలు, అతణ్ణి ఓడించేందుకు ముస్లింలు గంపగుత్తగా ఓటేస్తారు. అవసరమైతే ‘లౌకిక పార్టీలు’ నిలబెట్టిన హిందూ అభ్యర్థికైనా ఓట్లు వేసి, బిజెపి టికెట్‌పై తమ మతస్థుడు పోటీ చేసినా ఓడించి తీరతారని ఇప్పటివరకూ అంతా అనుకునేవారు. మోదీ మైనారిటీల వ్యతిరేకి అని ఎంతగా ప్రచారం జరిగినా తాజా ఎన్నికల్లో ముస్లింలు బిజెపికి అనుకూలంగా ఓట్లు వేశారనేది సుస్పష్టం. బురఖాలు ధరించిన ఎంతోమంది ముస్లిం మహిళలు తాము మోదీకే ఓటు వేసినట్లు టీవీ చానళ్లలో బహిరంగంగా చెప్పడం చూశాం. బిజెపికి కాదు.. తాము మోదీకే ఓట్లు వేశామని వారు ఢంకా బజాయించి మరీ చెప్పారు. బిజెపి ఇటీవల ‘ట్రిపుల్ తలాక్’ అంశాన్ని తెరపైకి తేవడంతో సానుకూలంగా స్పందించిన ముస్లిం మహిళలు కమలాన్ని ఇలా పరిమళభరితం చేశారన్నమాట.
‘బిజెపి దళిత వ్యతిరేక పార్టీ’ అన్న నాలుగో అపోహ కూడా పటాపంచలైంది. గుజరాత్ సహా బిజెపి అధికారంలో ఉన్న మరికొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకున్న చిన్నపాటి సంఘటనలను మీడియా గోరంతలు కొండంతలు చేసిన ఫలితంగా జనంలో బిజెపిపై ఏర్పడిన అపోహ ఇది. బిఎస్‌పి అధినేత్రి మాయావతి మాత్రమే ‘దళిత సంరక్షురాలు’ అనే గుడ్డి నమ్మకం జనంలో పాతుకుపోయింది. తాజా ఫలితాలతో ఆ నమ్మకం కూడా పటాపంచలైంది. రాష్ట్రంలో 30 శాతం మేరకు ఉన్న దళితుల అండదండలు లేకుండా బిజెపి ఇంతటి ఘన విజయాన్ని నమోదు చేసే అవకాశమే లేదు.
ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తేనే ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇస్తారన్న భ్రమ కూడా ఇప్పుడు తొలగిపోయింది. యుపిలో తమ సిఎం అభ్యర్థి ఎవరన్నది చెప్పకుండానే బిజెపి కదన రంగంలోకి దూకి అఖండ మెజారిటీని సాధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముందుగానే సిఎం అభ్యర్థిని ప్రకటించి బిజెపి భంగపడింది. బిహార్‌లో ఎదురైన అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, యుపి ఎన్నికల్లో సిఎం అభ్యర్థిని ప్రకటించకుండానే కమలనాథులు బరిలోకి దిగారు. ప్రతిపక్షాలు, మీడియా కూడా ‘అఖిలేష్, మాయావతి మాదిరి మోదీ కూడా సిఎం అభ్యర్థి అవుతారేమోన’ని అపహాస్యం చేశాయి. ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ఈ విషయంలో బిజెపి అధినాయకత్వం దృఢచిత్తంతో వ్యవహరించింది. మోదీ ‘యుపి విధానసభలో కూర్చోరన్న’ ఇంగితజ్ఞానం ఉన్నందునే ఓటర్లంతా బిజెపిని అక్కున చేర్చుకున్నారు. సిఎం అభ్యర్థిత్వంపై బిజెపి వ్యూహం ఇలా ఫలించిందని అంతా అంగీకరించాల్సిందే.
మరోవైపు- పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలు మోదీ మెడకు చుట్టుకుంటాయని మీడియా, ప్రతిపక్షాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. అయితే, నగదు కోసం తాము పడిన ఇబ్బందులను జనం ‘ఓట్ల జాతర’లో అసలు గుర్తుపెట్టుకోలేదు. అవినీతిపరులకు, నల్లకుబేరులకు బుద్ధి చెప్పేందుకు తప్ప బడుగువర్గాలను దెబ్బ తీసేందుకు పెద్దనోట్లను రద్దు చేయలేదని మోదీ చెప్పిన మాటలను సామాన్యులు విశ్వసించారు. పెద్దనోట్ల ప్రభావం ఏ మాత్రం లేదని చెప్పేందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మోదీకి వ్యతిరేకంగా జరిగిన దుష్ప్రచారంలో నిజానిజాలను తెలుసుకున్న ఓటర్లు విపక్షాల ముఖంపై చాచికొట్టారు.
మోదీ ‘ఏకోన్ముఖ రాజకీయవేత్త’ అని, కులం పేరిట సమాజాన్ని చీల్చడానికి ఆయన ప్రయత్నిస్తుంటారని, రాజకీయ వ్యవస్థపై ఆయనకు నమ్మకం లేదన్న కొందరి అపోహలు శుద్ధ అబద్ధాలని తేలిపోయింది. సమాజంలోని అన్ని వర్గాలవారూ ఆయనను ఆమోదించి ఆశీర్వదించారని తేలింది. హిందువులు, ముస్లింలు, దళితులు, యాదవులు, యాదవేతరులు, ఓబిసిలు కులమతాలకు అతీతంగా ఆయనపై అచంచల విశ్వాసం ప్రకటించారు. ఏవో ‘ట్రిక్కులు’ చేయాలనుకొనే మీడియా సైతం ‘ఎగ్జిట్ పోల్స్’ ఫలితాలను చూసి అవాక్కయింది. యుపిలో ‘హంగ్’ తప్పదంటూ అంచనా వేసిన వారంతా ఇప్పుడు తలదించుకోవాలేమో!
ఈ ఎన్నికల్లో అత్యంత విషాదకరమైన అంశం ఒకటుంది. అది- రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కడు దీనస్థితికి చేరడం. కాంగ్రెస్‌కు పట్టున్న అమేథీ, రాయ్‌బరేలీ కోటలు బీటలు వారాయి. అమేథీ అసెంబ్లీ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకోవడం మామూలు విషయం కాదు. కాంగ్రెస్ ‘యువరాజా’వారు ఇపుడు ధ్యానం చేసుకొంటూ సేద తీరేందుకు బ్యాంకాక్, మలేసియా, మయన్మార్‌లలో ఎక్కడికి వెళతారో? నిక్షేపంలా ఉన్న అఖిలేష్‌ను తనతోపాటు రాహుల్ అథఃపాతాళానికి లాగేశారన్న గుసగుసలకైతే అంతే లేదు. అఖిలేష్‌పై ఆయన చిన్నాన్నలు, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు కత్తులు నూరడం ఖాయం!
పోలింగ్ జరిగిన ఇతర రాష్ట్రాల విషయానికొస్తే- ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పాపాలే ఆ పార్టీకి శాపాలుగా మారాయన్నది నిష్ఠుర సత్యం. మణిపూర్‌లో బిజెపి అధికార పగ్గాలు చేపట్టినా, లేకున్నా ఈ ఎన్నికల్లో గణనీయమైన ప్రగతి సాధించిందనే చెప్పాలి. గోవాలో తాను చేసిన పొరపాటు వల్లనే బిజెపి భంగపడిందని అంగీకరించాలి. ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను కేంద్ర రక్షణ మంత్రిగా నియమించి, గోవాలో ‘కమలనాథులు’ తప్పులో కాలేశారు. అటు కేంద్రమంత్రిగా, ఇటు గోవాలో పార్టీ పర్యవేక్షకుడిగా రెండు బాధ్యతలను నిర్వహించడంలో పారికర్ ఇబ్బంది పడడం వల్లే అధికారం చేజారిందనుకోవాలి.
ఈ ఎన్నికల్లో కేవలం పంజాబ్ వల్లనే కాంగ్రెస్ పరువు కొంతైనా నిలిచింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ కారణంగానే పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. సుపరిపాలన అందించడంలో అకాలీదళ్ ప్రభుత్వ దారుణ వైఫల్యం కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. అకాలీదళ్ మిత్రపక్షంగా బిజెపి కూడా ఓటమిలో పాలు పంచుకోవలసి వచ్చింది. యుపిలో మోదీ హవా సాగినట్లే పంజాబ్‌లో అమరీందర్ జోరు కనిపించింది. అకాలీదళ్ భ్రష్టుపట్టడంతో ఆ లోటును ఆమ్ ఆద్మీ పార్టీ తీరుస్తుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. ‘అరాచక’ ఆప్‌ను సైతం పంజాబ్ ఓటర్లు నమ్మలేదు. జాతీయ రాజకీయాలపై ఆశలు పెంచుకున్న ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్‌కు ఇప్పుడు కళ్లు బైర్లుకమ్మాయి!
మొత్తమీద ఈ ఎన్నికలు మార్పుకు బాట వేసేవిగాను, సంప్రదాయ పార్టీలకు పాతర వేసినట్టుగానూ భావించాలి. పాతతరం రాజకీయాలకు చెల్లుచీటీ రాసి, భారతీయ రాజకీయాల్లో ఆహ్లాదకరమైన సరికొత్త వాతావరణాన్ని తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుంది.
‘లౌకికవాదాన్ని’ పునర్నిర్వచించాల్సిన తరుణమిది. ఎవరు ‘లౌకికవాదులు’ ఎవరు ‘మతతత్వవాదులు’ అనే అంశాలను తేల్చాల్సిన సందర్భమూ ఇదే.

ఎస్‌ఆర్ రామానుజన్