జాతీయ వార్తలు

విమాన మంత్రిపై వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఏయిర్ ఇండియా విమానంలో గొడవ చేసిన లోకసభ సభ్యుడు రవీంద్ర గైక్వాడ్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసిన పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనంతగీతే, శివసేన ఎంపిలు లోకసభలో కొట్టినంత పని చేశారు. పార్లమెంటు చరిత్రలో మొదటిసారి ఒక క్యాబినెట్ మంత్రితో మరో క్యాబినేట్ మంత్రి సభలోనే వాగ్వివాదానికి దిగటంతోపాటు నీ సంగతి తేలుస్తానంటూ బెదిరించటం అనూహ్య పరిణామం. అనంతగీతే తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగటంతోపాటు ఆగ్రహంతో చేతులు ఊపుతూ అశోకగజపతిరాజు పైకి దూసుకుపోయారు. శివసేన ఎంపిలు విమానయాన శాఖమంత్రిని ఘెరావ్ చేశారు. శివసైనికుల చక్రబంధంలో ఇరుక్కున్న అశోక్‌గజపతిరాజును రక్షించేందుకు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్, సహాయ మంత్రులు అహ్లువాలియా, జయంత్‌సిన్హాలు జోక్యం చేసుకోవలసి వచ్చింది. శివసేన సభ్యులు తనను దూషిస్తున్నా అశోక్‌గజపతి వౌనంగా ఉండిపోయారు తప్ప పల్లెత్తు మాట అనలేదు. 15నిమిషాల పాటు లోక్‌సభలో సేన సభ్యులు నానా హంగామా చేశారు.
జీరో అవర్‌లో స్పీకర్ సుమిత్రా మహాజన్ రవీందర్ గైక్వాడ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అన్ని విమాన సంస్థలు టిక్కెట్లు గైక్వాడ్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో చార్టర్డ్ విమానంలో ఢిల్లీకి వచ్చిన గైక్వాడ్ తన వాదన వినిపిస్తూ ఏయిర్ ఇండియా అధికారులు దురుసుగా వ్యవహరించినందుకే కోపం వచ్చిందన్నారు. ఫిర్యాదు పుస్తకం ఇవ్వాలన్న తన డిమాండ్‌ను విమాన సిబ్బంది పట్టించుకోకుండా వాదనకు దిగారని ఆయన ఆరోపించారు. తనపై 308 కింద ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు. తనపై విధించిన నిషేధాన్ని తొలగించి, కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి అశోక్‌గజపతిరాజు సమాధానం ఇస్తూ విమానయానంలో ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విమానంలో ఎంపిలు కూడా ప్రయాణికులేనని ఆయన అన్నారు. ‘మీరు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటే పరిష్కారం అవుతుంటే పెంచుకోవాలంటే పెరుగుతుంది’ అని ఆయన అన్నారు. తరువాత పక్క టేబుల్‌పై కూర్చున్న అనంతగీతే మాట్లాడుతూ తమ ఎంపి పట్ల ఇలా వ్యవహరించటం మంచిది కాదన్నారు. తమ ఓపిక నశిస్తే పరిస్థితులు చేయి దాటుతాయని హెచ్చరించారు. ఈ దశలో శివసేన ఎంపిలు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. అనంతగీతేతో పాటు కొందరు శివసేన ఎంపిలు అశోక్‌గజపతిరాజు వద్దకు వెళ్లి వాదనకు దిగారు. అరవింద్ సావంత్ అనే ఎంపి అశోక్‌గజపతిరాజు ఆయనను దూషించటం ప్రారంభించారు. దీనితో సభ గందరగోళంతో పడిపోయింది. పరిస్థితిని గ్రహించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ వాయిదా పడగానే శివసేన సభ్యులందరు అశోక్‌గజపతిరాజుపై విరుచుకుపడ్డారు. శివసేన ఎంపిలను శివసేనకు చెందిన అరవింద్ సావంత్ ఆగ్రహంతో అశోక్‌గజపతిరాజును దూషిస్తూ నీ అంతు చూస్తానంటూ ఆయన బల్లపై పెద్ద ఎత్తున బాదారు. సేన ఎంపిలు అశోక్‌గజపతిరాజును మూడు వైపుల నుండి చుట్టిముట్టి విమర్శలు గుప్పించారు. ఒక దశలో అనంతగీతే ఆగ్రహంతో చేతులు ఊపుతూ అశోక్‌గజపతిరాజు మీదికి పోయారు. ఆ సమయంలో రామమోహన్‌నాయుడు, తోట నరసింహం ముందుకు వచ్చి అశోక్‌గజపతిరాజుకు అండగా నిలబడ్డారు. మరోవైపు నుండి అవంతి శ్రీనివాస్ మాగుంట బాబు వచ్చి ఆయనకు రక్షణగా నిలబడ్డారు. శివసేన సభ్యులు మాత్రం తమకు అడ్డంగా నిలబడిన రామమోహన్ నాయుడు, తోట నరసింహంను తోసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సేన ఎంపిలు అశోక్‌గజపతిని చుట్టుముట్టి సభ నుండి బైటికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. పరిస్థితిని చక్కబెట్టడానికి ఇతర కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, అనంతకుమార్, అహ్లువాలియా మరికొందరు ఆయన వద్దకు వెళ్లారు. సేన ఎంపిలు వారిని కూడా అడ్డుకున్నారు. అహ్లువాలియా శివసేన ఎంపిలను పక్కకు నెట్టుతూ అశోక్‌గజపతిరాజు వద్దకు వెళ్లారు. స్మృతి ఇరానీ మరోవైపు నుండి అనంతగీతే చేయిపట్టుకుని పక్కకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. రాజ్‌నాథ్‌సింగ్ వెనక వైపు నుండి అనంతగీతే భుజం చుట్టు చేయి వేసి తన సీటు వైపు ఆయనను తీసుకుపోయేందుకు ప్రయత్నించారు. స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్‌లు నచ్చచెబుతున్నా అనంతగేతే మాత్రం ఆవేశంతో ఊగిపోతూ అశోక్‌గజపతిరాజుపై విమర్శలు గుప్పించారు. ముంబాయి విమానాశ్రయం నుండి ఒక్క విమానాన్ని కూడా ఎగరనివ్వమంటూ ఆయన హెచ్చరించారు. మరోవైపు అహ్లూవాలియా, అనంతకుమార్ తదితర మంత్రులు అశోక్‌గజపతిరాజును శివసేన ఎంపిల రింగ్ నుండి బైటికి తెచ్చేందుకు ప్రయత్నించారు. అశోక్‌గజపతిరాజు తన సీటు నుండి లేచేందుకు ప్రయత్నించినా శివసేన ఎంపిలు ఆయనను లేవనివ్వలేదు. దీంతో అహ్లువాలియా సేన ఎంపిలను పక్కకు అశోక్‌గజపతిరాజును ఆయన సీటు నుండి లేపారు. మరోవైపు నుండి అనంతకుమార్ ఆయనను పక్కకు తీసుకు వచ్చారు. ఇది జరుగుతున్నంత సేపు శివసేన ఎంపిలు ఆయనను విమర్శిస్తూనే ఉన్నారు. అశోక్‌గజపతిరాజు వెళ్లిపోయిన తరువాత కూడా శివసేన ఎంపిలు ఆయనను దూషిస్తూనే ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆవేశంతో ఊగిపోతున్న అనంతగీతేను స్పీకర్ చాంబర్‌కు తీసుకుపోయారు.
లోకసభ రెండు సార్లు వాయిదా పడిన అనంతరం మూడో సారి సమావేశమైనప్పుడు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ అశోక్‌గజపతిరాజు, అనంతగీతే పరస్పర చర్చల ద్వారా ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరిస్తారని ప్రకటించారు. సభ వాయిదా పడిన అనంతరం స్పీకర్ చాంబర్‌లో కుదిరిన ఒప్పందం మేరకు రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రకటన చేయటం గమనార్హం. రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన అనంతరం సభ సద్దుమణిగింది.
నిషేధం ఎత్తివేయకుంటే ఎడ్డీఏ సమావేశం బహిష్కరణ
తమ ఎంపి రవీంద్ర గైక్వాడ్‌పై నిషేధాన్ని ఎత్తివేయకుంటే ఏప్రిల్ పదిన జరగబోయే ఎన్డీయే సమావేశానికి హాజరయ్యేది లేదని శివసేన ఎంపి సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

అశోక్‌గజపతి ఎదుట శివసైనికుల నినాదాలు