జాతీయ వార్తలు

చేతల్లో చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని ఫలితాలు చూపించాలని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను డిమాండ్ చేశారు. షరీప్ మంగళవారం సాయంత్రం మూడు గంటల ముప్ఫై నిమిషాలకు శ్రీలంకనుండి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఎయిర్ బేస్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ఎయిర్ బేస్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన మోదీకి హామీ ఇచ్చారు. తీవ్రవాదులతో జరుపుతున్న పోరాటంలో పాకిస్తాన్ భారత దేశానికి తోడుగా ఉంటుందని షరీఫ్ చెప్పినట్లు తెలిసింది. దీనికి నరేంద్ర మోదీ స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తే సరిపోదు, చర్యల ఫలితాలు కనిపించాలి, దాడికి బాధ్యులైన వారిని అరెస్టు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కఠినంగా చెప్పారని అంటున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ఫలితాలు లేని హామీలు ఇస్తే సరిపోదని మోదీ ఆయనకు స్పష్టం చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఉగ్రవాదులపై గట్టి చర్యలు తీసుకొనకపోతే శాంతి చర్చలు దెబ్బతినటంతోపాటు పాక్ మనుగడకే ప్రమాదం వస్తుందని స్పష్టం చేశారని అంటున్నారు. ఎయిర్ బేస్‌పై దాడికి కుట్ర చేసిన సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
నవాజ్ షరీఫ్‌తో కేవలం కొన్ని నిమిషాల పాటు జరిగిన టెలిఫోన్ సంభాషణలో మోదీ కరుకుగా మాట్లాడారనే మాట వినిపిస్తోంది. మోదీ లాహోర్ ఆకస్మిక పర్యటన చేసి వచ్చిన వారం రోజులకే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దేశంలోని అతి పెద్ద ఎయిర్ బేస్‌పై దాడి చేయటం రెండు దేశాల మధ్య శాంతి చర్చలను దెబ్బ తీస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ బేస్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షరీఫ్ హామీ ఇచ్చినా ఇది అమలు జరుగుతుందని ఎవ్వరూ విశ్వసించటం లేదు. గతంలో ముంబయిపై దాడి చేసిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులపై ఇంతవరకు పెద్దగా చర్య తీసుకోలేదు. ముంబయి దాడి సూత్రదారులు ప్రస్తుతం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ముంబయి కుట్ర దారులపై చర్య తీసుకుంటామని పాక్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంత వరకు అమలు కానప్పుడు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై తాజాగా జరిగిన దాడికి కుట్ర చేసిన వారిపై షరీఫ్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోగలుగుతుందనే నమ్మకం ఎవ్వరికీ కలగటం లేదు. భారత దేశంతో నవాజ్ షరీఫ్ ఎప్పుడు శాంతి చర్చలు జరిపినా పాక్ సైన్యం దానిని దెబ్బ తీయటం ఎప్పుడూ జరిగేదే. ఇప్పుడు మోదీ ఆకస్మిక లాహోర్ పర్యటన మూలంగా నెలకొన్న సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టేందుకే పాక్ సైన్యం జైషే మహమ్మద్ ద్వారా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ పై దాడి చేయించిందనే మాట వినిపిస్తోంది. పాక్‌లో సైన్యం మాట నెగ్గుతుంది తప్ప ప్రజలు ఎన్నుకొన్న పాలకుల మాట కాదనేది మరోసారి రుజువైంది. ఇదిలా ఉంటే భారత జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ సోమవారం పాకిస్తాన్ జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుకు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దాడికి సంబంధించిన కొంత సమాచారం అందజేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చిత్రం.. పఠాన్‌కోట్‌లో ఆపరేషన్ గరుడ ముగియడంతో పరిస్థితిని సమీక్షించుకుంటున్న భద్రతా బలగాలు