జాతీయ వార్తలు

ప్యాకేజీయే హోదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం. దాని ప్రయోజనాలను ప్యాకేజీగా మాత్రమే ఇవ్వగలం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుండబద్ధలు కొట్టారు. అయితే కేంద్రం ఇస్తానన్న నిధులను ఎలా తీసుకోవాలన్న అంశంపై ఏపీ తేల్చుకోలేకపోవడం వల్లే ఇబ్బంది వస్తుందని స్పష్టం చేశారు. దానికి కేంద్రాన్ని బాధ్యుల్ని చేయడం సహేతుకం కాదని అంటూనే, విభజన చట్టంలోని ప్రతి హామీనీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘పన్ను రాయితీలు ఇదివరకే ప్రకటించాం. హోదా అంశాన్నీ రాజకీయం చేస్తే ఎక్కువ నిధులు రావు. కేంద్రంవద్ద నిధుల అక్షయపాత్ర లేదు. భావోద్రేకాలు నిధులను ఏమాత్రం పెంచలేవని గ్రహించాలి’ అని జైట్లీ ఉద్ఘాటించారు. బుధవారం తన కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశంలో ఏపీకి హోదా విషయంలో కేంద్రం వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ ఉద్యమాలు కొనసాగుతున్నాయి కనుక నిధులకు పట్టబట్టడం సహేతుకం కాదని స్పష్టం చేశారు.
ఆర్థికంగా బలహీనంగావున్న ఇతర రాష్ట్రాలను కాదని ఏపీకి అధికంగా నిధులిచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. బీహార్, ఝార్కండ్‌కు నిధులు ఇవ్వకూడదా? అని ప్రశ్నించారు. హోదాకు బదులు ఇస్తున్న ఆర్థిక సాయం, రెవెన్యూ లోటు భర్తీ అనేవి ప్రధాన అంశాలని, ఈ రెండూ పరిష్కారమైతే అన్నీ సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. ‘14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తరువాత ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కావటం లేదు. అందుకే ఏపీకి హోదా ప్రయోజనాన్ని ప్యాకేజీగా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అన్నారు. హోదా వలన ఏపీకి కేంద్ర ప్రాయోజిత పథకాల్లో అదనంగా 30శాతం నిధులు లభిస్తాయి. వీటిని విదేశీ సహాయ పథకాల ద్వారా ఇచ్చేందుకు మొదట అంగీకారం కుదిరింది. అయితే వీటిని నాబార్డు ద్వారా అందించాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. నాబార్డ్ ద్వారా నిధులందిస్తే అవి లోటులో కలిసిపోతాయి కనుక, ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు సూచించామన్నారు. దానిపై ఏపీనుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదని, ఈ విషయంలో కేంద్రం ఏంచేస్తుందని జైట్లీ ప్రశ్నించారు. అంతకుముందు ప్రభుత్వ అధికారులు, మొన్నటికి మొన్న ఎంపీలు, మంత్రులకూ ఇదే విషయం చెప్పామని అన్నారు. హోదా ప్రయోజనాలను మరో రూపంలో ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగావున్నా, ఎలా తీసుకోవాలో నిర్ణయించుకోలేని స్థితిలో రాష్ట్రంవుంటే అందుకు కేంద్రానికి తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాతా నెంబరిస్తే, ఇస్తామన్న మేరకు నిధులు డిపాజిట్ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. వాళ్లు ఖాతా నెంబర్ చెప్పకుంటే, నిధులు ఎలా డిపాజిట్ చేస్తామని జైట్లీ చలోక్తి విసిరారు.
ఇక ఏపీ డిమాండ్ చేస్తున్న రెండో ప్రధాన అంశం రెవిన్యూ లోటు భర్తీ అన్నారు. ఈ విషయంలో కేంద్రం, ఏపీ మధ్య కేవలం పది నెలలకు సంబంధించిన రెవెన్యూ లోటు నిర్దారణపైనే చిక్కులున్నాయని అన్నారు. ‘రెవెన్యూ లోటుకింద ఇప్పటికే 4వేల కోట్లు ఇచ్చాం. ఇక పది నెలల లోటునూ హేతుబద్ధమైన పద్ధతిలో నిర్ణయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పది నెలల రెవెన్యూ లోటును అంతకుముందు ఏడాది నిర్థారించిన లోటుతో లెక్కేస్తే, రాష్ట్రానికి 138 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనికి బదులు 2015-16లో నిర్థారించిన రెవెన్యూ లోటుతో లెక్కకడితే 16 వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఏపీకి లాభం కలిగించేందుకు 1600 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పినా, ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు. లోటు భర్తీకి మరో 10వేల కోట్లు ఇవ్వాలన్న ఏపీ డిమాండ్‌ను ఆమోదించే పరిస్థితి లేదని ప్రకటించారు. మొత్తం నిధులన్నీ రాష్ట్రాలకు పంచేసి, కేంద్రం చేతులు ముడుచుకుని కూర్చోలేదుకదా? అన్నారు. సైన్యానికి నిధులు తగ్గించి ఏపీకి ఇవ్వగలమా? అని జైట్లీ ఆవేశంగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇస్తున్నామనేది మరిచిపోకూడదని జైట్లీ అన్నారు.
పన్ను రాయితీలపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, రెండేళ్ల క్రితమే మూడు పన్ను రాయితీలకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంతవరకు దాదాపు 5వేల కోట్లు విడుదల చేశాం. పోలవరంలో ఆ మేరకు పని జరిగిందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 2.5వేల కోట్లు విడుదల చేసినా, ఆమేరకు అక్కడ పనులు జరిగాయా? అని నిలదీశారు. ఏ రాష్ట్రానికి ఏమేరకు నిధులివ్వాలనేది రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఆర్థిక సంఘం నిర్థారిస్తుందన్నారు. విభజన వలన నష్టం కలిగింది కనుకే ఏపీ పట్ల కేంద్రానికి సానుభూతి ఉందన్నారు. అందుకే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏడు ఈశాన్య రాష్ట్రాలు, మూడు హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏపీకి ఎందుకివ్వలేరని బాబు ప్రశ్నిస్తున్నారన్న మీడియా ప్రశ్నకు జైట్లీ జవాబిస్తూ, 14వ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రాలను భిన్నంగా చూడాలని సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. అందుకే వాటికి 90:10 నిష్పత్తిలో హోదా ప్రయోజనాలు కల్పిస్తున్నామని జైట్లీ వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన మాట నిజమే. కానీ, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీగా ప్రయోజనాలు కల్పిస్తున్నామని జైట్లీ వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలనూ దృష్టిలో పెట్టుకునే కేంద్రం పని చేయాల్సి ఉంటుందని, కేంద్రం పటిష్టంగా ఉంటేనే దేశం నిలబడుతుందని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటు ఏమైందన్న ప్రశ్నకు హోదా, రెవెన్యూ లోటుపై ఉభయుల మధ్యవున్న విభేదాలు సమసిపోతే మిగిలిన సమస్యలన్నీ తొలగిపోతాయని జైట్లీ అభిప్రాయపడ్డారు.