జాతీయ వార్తలు

విద్యార్థినుల ఆత్మహత్యపై సిబిసిఐడి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 30: తమిళనాడులోని ఓ వైద్య కళాశాలలో ముగ్గురు విద్యార్థినుల బలవన్మరణం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బలవంతపు ఫీజుల వసూళ్లకు తట్టుకోలేక ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి జయలలిత ఈ మొత్తం వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు శనివారం ఆదేశించారు. అలాగే యోగా, నేచురోపతి విద్యార్థులను ప్రభుత్వ నిర్వహణలోని కళాశాలకు బదిలీ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య కేసుపై డిజిపి నేతృత్వంలో విచారణ జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని విల్లూపురంలోని ఎస్‌విఎస్ యోగా, నేచురోపతి మెడికల్ కళాశాల నుంచి ప్రభుత్వ యోగా, నేచురోపతికి వారిని బదిలీ చేస్తున్నట్టు జయలలిత వెల్లడించారు. ఈ నెల 23న ఎస్‌విఎస్ యోగా, నేచురోపతి విద్యార్థినులు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక వారీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి కళాశాల కరస్పాండెంట్ వాసుకి సుబ్రహ్మణ్యం 25న చెన్నై కోర్టులో లొంగిపోయారు. ఆయనను జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అలాగే ప్రిన్సిపాల్, మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. తమ కుమార్తెకు మళ్లీ శవపరీక్ష జరపాలన్న ఆమె తండ్రి అభ్యర్థన మేరకు 27న చెన్నై హైకోర్టు అనుమతి ఇచ్చింది. విద్యార్థినుల ఆత్మహత్యపై సిబిసిఐడి విచారణ జరపాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించాలని తమిళరసన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

పద్నాలుగేళ్ల
బాలికపై గ్యాంగ్‌రేప్

ముజఫర్‌నగర్, జనవరి 30: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 2013లో జరిగిన అల్లర్ల తర్వాత జిల్లాలోని అంబేట గ్రామంలో పునరావాసం పొందిన 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మాజీ గ్రామ ప్రధాన్ జహీర్ కుమారుడు జుల్ఫామ్, పరారీలో ఉన్న గుర్తుతెలియని మరో ఇద్దరు యువకులపైన అత్యాచారం సహా భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సర్కిల్ అధికారి ఎన్‌పి సింగ్ శనివారం చెప్పారు. శుక్రవారం బాలిక పొలాల్లోకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా ఎత్తుకు వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి సోదరుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను కనుగొన్నారు. సంఘటనపై నిరసన తెలియజేయడానికి ప్రయత్నించిన బాలిక కుటుంబ సభ్యులను నిందితులు చావకొట్టినట్లు కూడా తెలుస్తోంది.
బాలికను వైద్య పరీక్షలకోసం పంపించారు. 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల తర్వాత బాగ్‌పత్ జిల్లాకు చెందిన బాలిక కుటుంబం అంబేట గ్రామానికి వలసవచ్చింది.

ఐఎస్‌ఐలో చేరతావా?
బీహార్ విద్యార్థికి పాక్ నుంచి ఫోన్

భబువా (బీహార్), జనవరి 30: కాలేజీ విద్యార్థి ఒకరికి పాక్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, ‘ఐఎస్‌ఐలో చేరు, బోలెడంత డబ్బిస్తాం’. బీహార్ కైమూర్ జిల్లాలో ఇంటర్ చదువుతున్న ముఖేష్ కుమార్ ఈ ఫోన్ కాల్ అందుకున్నాడు. అయితే ఈ ఫోన్ అతనికి రెండవసారి వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు తేలిగ్గా తీసుకున్నాడు. అయితే రెండోసారి రావడంతో నేరుగా భబువా పోలీసు స్టేషన్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ముఖేష్ ఇంటర్ చదువుకుంటూనే ఒక బట్టల దుకాణంలో పార్ట్‌టైమ్ సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతని గురించి తెలిసివారే తన వివరాలు అందించివుంటారని అతడు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని పాట్నాలోని పై అధికారులకు తెలియజేశానని, తదుపరి చర్యలు తీసుకోవాల్సింగా విన్నవించానని ఎస్‌పి హర్‌ప్రీత్ కౌర్ విలేఖరులకు తెలిపారు.

తగులబడ్డ డంపింగ్.. 74 స్కూళ్లకు సెలవు!

ముంబయి, జనవరి 30: బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఒక డంపింగ్ యార్డు తగులబడి, దాని నుంచి ఘాటైన వాసనలు వెలువడంతో సమీపంలోని 74 సూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎం-వార్డులోని దియోనార్ డంపింగ్ యార్డు రెండు రోజుల క్రితం తగులబడింది. దీంతో ఘాటైన వాసనలు వెలువడడంతో పెద్దలు, పిల్లలు ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిపోయింది. దీంతో సమీపంలోని చెంబూర్, దియోనార్, తిలక్‌నగర్, పెస్టామ్ సాగర్, శివాజీ నగర్, మన్‌ఖుర్ద్, బైగాన్‌వాడి తదితర ప్రాంతాల్లోని సూళ్లకు శుక్రవారం, శనివారం సెలవులు ప్రకటించారు. ముంబయిలో ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డులలో దియోనార్ ఒకటి. డంపింగ్ యార్డులో మంటలు అంటుకోవడంతో నగరంలో పొల్యూషన్ శాతం కూడా పెరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో
ముగ్గురు మిలిటెంట్లు హతం

శ్రీనగర్, జనవరి 30: ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతమైనట్లు పోలీసు అధికారి ఒకరు శనివారం చెప్పారు. కుప్వారా జిల్లాలోని లోలాబ్ ప్రాంతంలోని దర్ద్‌పోరాలో శుక్రవారం రాత్రి భద్రతా దళాలు గాలింపు ఆపరేషన్ చేపట్టినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ ప్రారంభంలో ఒక మిలిటెంట్ చనిపోగా, మరో ఇద్దరు శనివారం సాయంత్రం హతమైనారు. చనిపోయిన మిలిటెంట్ల వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదని ఆ అధికారి చెప్తూ, సంఘటన జరిగినచోట మిలిటెంట్లకు చెందిన మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

న్యాయ సంస్కరణలకోసం
35 రోజుల యాత్ర ప్రారంభం

న్యూఢిల్లీ, జనవరి 30: దేశంలో న్యాయ సంస్కరణలను సమర్ధిస్తున్న ఒక గ్రూపు ‘మార్చ్ ఫర్ జస్టిస్’ పేరుతో శనివారం దేశవ్యాప్త యాత్రను మొదలుపెట్టింది. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించి సకాలంలో న్యాయాన్ని అందించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ప్రధాన లక్ష్యంతో వారు ముంబయికి చెందిన ‘సత్వర న్యాయ వేదిక’ (్ఫరం ఫర్ ఫాస్ట్ జస్టిస్) ట్రస్టు ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టారు. న్యూఢిల్లీలోని ‘రాజ్‌ఘాట్’లో జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించిన తర్వాత వారు ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొంటున్న వారిలో ఎక్కువమంది సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులే ఉన్నారు. దేశ వ్యాప్తంగా 35 రోజులపాటు జరిగే ఈ యాత్ర 22 రాష్ట్రాల్లో దాదాపు 170 జిల్లాలు, ప్రధాన పట్టణాల గుండా సాగి న్యూఢిల్లీలో మార్చి 4న జంతర్ మంతర్ వద్ద ముగుస్తుంది. ఈ యాత్ర ప్రారంభం సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో కర్నాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జిసి.్భరూకా, ‘్ఫరం ఫర్ ఫాస్ట్ జస్టిస్’ ట్రస్టు భగవాన్‌జీ రైయానీ మాట్లాడుతూ, న్యాయ సంస్కరణలను వేగవంతం చేయడంలో పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడాన్ని గర్హించారు. న్యాయ సంస్కరణల పట్ల పాలకులు ఆసక్తి చూపడం లేదని, దీంతో ఈ విషయమై ఎవరిపై వత్తిడి తీసుకురావాలో తెలియక ప్రజలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, అందువల్లనే ఇటువంటి యాత్రలను చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతోందని వారు స్పష్టం చేశారు.

శనివారం రాజ్‌ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సత్వర న్యాయం కోసం నినాదాలు చేస్తున్న ‘్ఫరం ఫర్ ఫాస్ట్ జస్టిస్’ సంస్థ సభ్యులు