జాతీయ వార్తలు

ఏపీలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం కాపుల సమస్యలను పరిష్కరించటంలో ఘోరంగా విఫలమైనందుకే వారు ఉద్యమించవలసి వస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. అభిషేక్ సింఘ్వి సోమవారం ఎఐసిసి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం కావటంపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పరిపాలన అనేది లేకుండాపోయింది, కాపులకు ఇచ్చిన హామీలను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయటంలో విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు, ఆయన మిత్రపక్షం బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన ఇవ్వటంలో ఘోరంగా విఫలమైనందుకే కాపులు ఉద్యమం చేయవలసి వస్తోంది, రాష్ట్రంలోని ప్రజలందరి సర్వతోముఖాభివృద్ధికి ఈ ప్రభుత్వం పనిచేయటం లేదనేది అందరికీ తెలిసిందని సింఘ్వి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే ప్రజలకు ఉద్యమం చేయవలసి అవసరం ఉండదని ఆయన వివరించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయనందుకే కాపులు ఉద్యమం చేయవలసి వస్తోందని అభిషేక్ సింఘ్వి చెప్పారు. తెలుగుదేశం పాలకులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తుల సంపాదనకు పాల్పడ్డారు కాబట్టే ప్రజలు తమ ప్రయోజనాలకోసం ఉద్యమించవలసి వస్తోందని సింఘ్వి వివరించారు. కాపులకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నది కాంగ్రెస్ డిమాండ్ అని ఆయన ప్రకటించారు. కాపుల సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కాపు కమిషన్ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేస్తుందని సింఘ్వి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపుల ఓట్లు సంపాదించేందుకు తెలుగుదేశం, బిజెపి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాపు వర్గానికి చెందిన సినీనటుడు పవన్ కళ్యాణ్‌ను తమవైపు తిప్పుకోవటం ద్వారా తెలుగుదేశం, బిజెపి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగలిగిందని ఆయన చెప్పారు. కాపులను బిసి వర్గంలో చేరుస్తామని 2014 పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలుగుదేశం హామీ ఇవ్వలేదా? వారి ఆశలను పెంచలేదా? అని సింఘ్వి నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీను ఎందుకు నిలబెట్టుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం గుజరాత్, రాజస్థాన్‌లో కూడా పటేల్, జాట్‌లకు రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జీ అమానుషం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య పట్ల జరుగుతున్న ఆందోళనలో భాగంగా శనివారం ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేశారని సింఘ్వి ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. పోలీసులు మహిళా విద్యార్థుల జుట్టు పట్టుకుని కొట్టటం అమానుషమని సింఘ్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ను వెంటనే తొలగించాలని సింఘ్వి డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి తగు నష్టపరిహారం చెల్లించాలి, విశ్వవిద్యాలయాల్లో కులాల ఆధారంగా వివక్ష చూపించటాన్ని అరికట్టేందుకు అవసరమైన చట్టాన్ని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించాలని అభిషేక్ సింఘ్వి కేంద్రంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.