జాతీయ వార్తలు

బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లుకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 2: ఈ నెల 20 తర్వాత ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును ఆమోదించేలా చూడడానికి ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు మంగళవారం చెప్పారు. జిఎస్‌టి బిల్లుసహా ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందడానికి వీలుగా పార్లమెంటు సాఫీగా జరుగుతుందని తాను ఆశిస్తున్నానని, దీనికోసం ప్రభుత్వం వివిధ పార్టీలతో టచ్‌లో ఉందని ఆయన అన్నారు. ‘జిఎస్‌టి బిల్లు పాస్ కావడం మాకు ముఖ్యం. జిఎస్‌టి బిల్లు గనుక ఆమోదం పొందినట్లయితే పన్నుల విధానంలో అది విప్లవాత్మకమైనది అవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం దీనివల్ల ప్రభుత్వ రాబడి 1.5 శాతంనుంచి 2 శాతం దాకా పెరుగుతుంది. పన్నుల వ్యవస్థకు సంబంధించి ఇది అత్యంత ముఖ్యమైన సంస్కరణ అవుతుంది. ఈసారి ఈ బిల్లు ఆమోదం పొందేలా చూడడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఏ అవకాశాన్నీ వదులుకోం’ అని వెంకయ్యనాయుడు విలేఖరులతో అన్నారు. అంతేకాదు దీనికోసం ప్రభుత్వం వివిధ పార్టీలతో రెగ్యులర్‌గా చర్చిస్తోందని కూడా ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కావడాన్ని వెంకయ్య నాయుడు ప్రస్తావిస్తూ, వారి అనుమానాలేమిటో తెలుసుకోవడానికి తాము ప్రయత్నించామని, వారి అనుమానాలను నివృత్తి చేయడానికి కూడా ప్రయత్నించామని చెప్పారు. జిఎస్‌టికి అనుకూలంగా దేశంలో రోజురోజుకు ప్రజాభిప్రాయం బలపడుతోందని, మిగతా పార్టీలు కూడా జిఎస్‌టి ప్రాధాన్యతను అర్థం చేసుకుని దానికి మద్దతు ఇస్తాయని అనుకుంటున్నానని ఆయన అన్నారు. అలాగే రియల్ ఎస్టేట్, దివాలా తదితర బిల్లులకు కూడా ఆమోదం పొందాలని ప్రభుత్వం యత్నిస్తోందని అన్నారు. ఈ బిల్లును ఎందుకు తీసుకువస్తున్నామో కారణం చూసి దీనికి మద్దతు ఇవ్వమని తాను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీసహా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. బడ్జెట్ సమావేశాలపై చర్చించడానికి ఈ నెల 4న పార్లమెంటు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమవుతుందని ఆయన చెప్పారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ఖండిస్తూ, ఇప్పటివరకు తేదీలు ఖరారు కాలేదని, ఫిబ్రవరి 20 తర్వాతే సమావేశాలు ప్రారంభమవుతాయనేది మాత్రం స్పష్టంగా చెప్పగలనని వెంకయ్యనాయుడు చెప్పారు. బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయడానికి తాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకు చెందిన కొన్ని రాజకీయ పార్టీల నేతలతో ఇష్టాగోష్ఠిగా మాత్రమే సమావేశమైనట్లు వెంకయ్యనాయుడు చెప్పారు.