జాతీయ వార్తలు

ఉగ్రవాద దాడులన్నీ పాక్ పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: భారతదేశంలో జరిగిన అన్ని ఉగ్రవాద దాడులు పాక్ కేంద్రంగా జరిగినవేనని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్వరంతో స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిని బలపరచడానికి భారత్ సంసిద్ధంగా ఉందని వెల్లడించారు. ఉగ్రవాద నిరోధక చర్యలను పాక్ ఎంత గట్టిగా చేపడితే అంతగానూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటమే కాకుండా మొత్తం దక్షిణాసియా ప్రాంతంలోని శాంతి, సుస్థిరతల స్థాపనకు దోహదం చేస్తుందని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ‘్భరత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులకు పాక్‌లోనే కుట్ర జరిగిందని, పాక్‌ను కేంద్రంగా చేసుకున్న అనేక ఉగ్రవాద సంస్థలే ఇందుకు పాల్పడ్డాయని రాజ్‌నాథ్ తేల్చిచెప్పారు. ఉగ్రవాద నిరోధక సమావేశంలో బుధవారం నాడిక్కడ ఆయన మాట్లాడారు. రాజస్థాన్ ప్రభుత్వ సహకారంతో ఇండియా ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహించింది. భారత్‌కు సంబంధించినంత వరకు 26/11 ముంబయి దాడులు, పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రవాద దాడి తీవ్ర స్థాయిలోనే కఠిన వైఖరి అవలంబించడానికి దారితీశాయని తెలిపారు. సముద్ర మార్గంలో 2008లో భారత వాణిజ్య రాజధానిపై ఉగ్రవాదులు దాడి జరిపారని, ఆ దాడిలో అనేకమంది మరణించారని రాజ్‌నాథ్ తెలిపారు. పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై కూడా పాక్ ఉగ్రవాదులు గురిపెట్టారని, దీన్నిబట్టి చూస్తే దేశంలోని అత్యంత కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయాలని పాక్ ఉగ్రవాదుల కుట్ర స్పష్టమవుతోందని తెలిపారు. ఈ దాడుల ద్వారా భారత్‌పై తమ దృష్టిని ఉగ్రవాదులు మరింతగా పెంచారని కీలక స్థావరాలను ప్రాంతాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ఉగ్రవాదుల ఏరివేత విషయంలో తరతమ భేదాలకు తావుండకూడదన్నారు. ఉగ్రవాదులను బలమైన ఆయుధాలుగా చేసుకుని తమ భౌగోళిక రాజకీయ పట్టును పెంచుకోవడానికి ఎవరు ప్రయత్నించినా దానివల్ల ఈ జాడ్యాన్ని వదిలించుకోవాలన్న పోరాటం దెబ్బతినే అవకాశం ఉంటుందని రాజ్‌నాథ్ తెలిపారు.
ఉగ్రవాద దేశాలను నిలదీయాలి: జైశంకర్
ఉగ్రవాదాన్ని బాహాటంగానే సమర్ధిస్తున్న దేశాల పేర్లను బయటపెట్టి వాటి పరువుతీయాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా శాంతి భద్రతలకు పెనుముప్పుకలిగిస్తున్న ఉగ్రవాదాన్ని ఉమ్మడి శక్తితోనే ఎదుర్కోవాలని విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ బుధవారం ఇక్కడ జరిగిన ఉగ్రవాద నిరోధక సదస్సులో పిలుపునిచ్చారు. పాకిస్తాన్ పేరును పరోక్షంగా ప్రస్తావించిన ఆయన ‘కొన్ని దేశాలు ఉగ్రవాద చర్యల ద్వారానే శాంతిని సాధించగలమని భావిస్తున్నాయి. ఈ ఆలోచన వట్టి భ్రమ’ అని తెలిపారు. పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక కేంద్రంపై జరిగిన దాడి దర్యాప్తుపై పాకిస్తాన్‌తో సహకరించడానికి, సంప్రదింపులు జరపడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఏ దేశం బలపరిచినా సహించేందుకు వీలులేదని, దాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా పోరాడితే తప్ప ఈ జాఢ్యం అదుపులోకి వచ్చే అవకాశం లేదన్న జైశంకర్ బాధిత దేశాలకు కూడా ఈ విషయంలో సహకారం అందించకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా వాటిని తీవ్ర పదజాలంతో ఖండిస్తూ అన్ని దేశాలు పరస్పర సంఘీభావాన్ని తెలియజేసుకోవల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. పఠాన్‌కోట్‌పై గత నెలలో దాడి జరిగినప్పటి నుంచి పాక్‌కు అన్ని విధాలా సహకరిస్తున్నామని, అలాగే జాతీయ భద్రతాసలహాదారుల స్థాయిలో కూడా మంతనాలు జరుపుతున్నామని విదేశాంగ కార్యదర్శి వెల్లడించారు.
ఇప్పటి వరకూ పఠాన్‌కోట్‌కు సంబంధించి ఎన్నో కీలక వివరాలు, ఆధారాలను భారత్ అందించిందని వీటి ప్రాతిపదికగా పాకిస్తాన్ ముందుకు వెళ్లగలదని భావిస్తున్నట్టు జైశంకర్ స్పష్టం చేశారు.

చిత్రం... జైపూర్‌లో జరిగిన ఉగ్రవాద నిరోధక సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్

లష్కరే తోయిబా
ఉగ్రవాది అరెస్టు
విచారిస్తున్న తెలంగాణ పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 3: లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అబ్దుల్ అజీజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ అజీజ్ రెండు కేసుల్లో నిందితుడు. అజీజ్‌ను లక్నోలో అదుపులోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసులకు అప్పగించారు. నగరానికి చెందిన ఉగ్రవాది అజీజ్ 2003లో బెయిల్‌పై విడుదలై సౌదీ అరేబియాకు పారిపోయాడని విశ్వసనీయ సమాచారం. కాగా అబ్దుల్ ఇంతకాలం ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడనే కోణంలో తెలంగాణ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
వరద సహాయం కింద
5 వందల కోట్లివ్వండి
రాజ్‌నాథ్‌కు అశోక్ గజపతి వినతి
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్‌కు వరద సహాయం కింద కనీసం ఐదు వందల కోట్లు ఇవ్వాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్‌రావు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. అశోక్ గజపతిరాజు, రామమోహన్‌రావు బుధవారం రాజ్‌నాథ్ సింగ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాలకు కరవు సహాయం కేటాయించేందుకు ఉద్దేశించిన హోం శాఖ ఉన్నత స్థాయి కమిటీ రేపు సమావేశం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వరదల మూలంగా నష్టం సంభవించిన ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై నుండి మూడు వందల కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు వందల కోట్లు సరిపోవని వాదిస్తోంది. రాష్ట్రానికి కనీసం ఐదు వందల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలనీ, అప్పుడే వరదల మూలంగా సంభవించిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వీలు కలుగుతుందని అశోక్ గజపతిరాజు, రామమోహన్‌రావు హోంమంత్రితో చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ వారు చెప్పినదంతా సావకాశంగా విన్న తరువాత ఆంధ్రప్రదేశ్‌కు వీలున్నంత ఎక్కువ ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
స్మృతి ఇరానీని కలిసిన
తెలంగాణ ప్రతినిధులు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: నూతన విద్యామండలిపై తెలంగాణ రాష్ట్ర అభిప్రాయాలను, సలహాలను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని తెలంగాణ ప్రతినిధుల బృందం కలిసి ఒక నివేదిక సమర్పించింది. డిటెన్షన్ విధానం రద్దు చేయడంతోపాటు, కింద స్థాయి తరగతులకు సంబంధిత సబ్జక్టు ఉపాధ్యాయుల చేతనే విద్యాబోధన జరపాలని, దిగువ స్ధాయిలో తరగతులకు మాతృభాషలోనే బోధన ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు బుధవారం స్మృతి ఇరానీని కలిసిన తర్వాత విలేఖర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐఐఏం విద్యాసంస్థను కేటాయించినట్లే తెలంగాణకు ఇవ్వలని కోరినట్టు చెప్పారు. ప్రతినిధుల బృదంలో ఎంపీలు పసునూరి దయాకర్, గుండు సుధారాణి కూడా ఉన్నారు.
ఈజిప్టు విమానం కూల్చివేతే
బిన్ లాడెన్‌కు స్ఫూర్తి
9/11 దాడులపై అల్‌ఖైదా కథనం
జెరూసలెం, ఫిబ్రవరి 3: అమెరికాలో విమానాలతో న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టి కూల్చేసిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ 1999లో ఈజిప్టు ఎయిర్‌లైన్స్‌కు చెందిన కో పైలట్ ఒకరు ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చివేసిన సంఘటననుంచి స్ఫూర్తి పొందినట్లు అల్‌ఖైదా తన వీక్లీ మ్యాగజైన్‌లో పేర్కొంది. అప్పట్లో లాస్ ఏంజెల్స్‌నుంచి కైరో వస్తున్న ఈజిప్టు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని కో పైలట్ గమిల్ అల్-బతౌలి ఉద్దేశ పూర్వకంగా కూల్చివేయడంతో వందమంది అమెరికన్లు సహా మొత్తం మొత్తం 217 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈజిప్టు విమానం కూలిపోయిన వార్త విన్నప్పుడు ‘అతను దగ్గర్లో ఉన్న ఓ భవనంపై దాన్ని ఎందుకు కూల్చి వేయలేదు?’ అని లాడెన్ ప్రశ్నించినట్లు అల్‌ఖైదా తన వీక్లీ మ్యాగజైన్ ‘అల్ మస్రా’లో పేర్కొన్నట్లు ‘జెరూసలెం పోస్టు’ పత్రిక తెలిపింది.
నిరూపిస్తే
తప్పుకుంటా: చాందీ
సోలార్ స్కామ్‌పై కేరళ సిఎం సవాల్
తిరువనంతపురం, ఫిబ్రవరి 3: సోలార్ కుంభకోణంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే పదవి నుంచి వైదొలుగుతానని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సవాల్ చేశారు. తాను ఒక్కశాతం అవినీతికి పాల్పడినట్టు దమ్ముంటే ప్రతిపక్షాలు రుజువుచేయాలని ఆయన అన్నారు.‘నిజానిజాలేమిటో బయటకు రాకమానవు. విజ్ఞతతో కూడిన రాష్ట్ర ప్రజలకు ఏం జరిగిందో అన్నీ తెలుసు’ అని బుధవారం ఇక్కడ మీడియాకు తెలిపారు.
కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ‘నాపై వచ్చిన ఆరోపణల్లో ఒక్కశాతం నిరూపించినా ప్రజాజీవితం నుంచి తప్పుకుంటా’నని సవాల్ చేశారు. సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఐదేళ్ల యుడిఎఫ్ పాలన చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షం ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తోందని సిఎం ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరితా నాయర్‌ను ఎల్‌డిఎఫ్ ఎగదోస్తోందని ఊమెన్‌చాందీ విరుచుకుపడ్డారు. సోలార్ కుంభకోణం, దాని వెనక ఎవరున్నారన్నదానిపై ప్రభుత్వం త్వరలో విచారణ జరుపుతుందని ఆయన ప్రకటించారు.

జుడీషియల్ కమిషన్ ఎదుట హాజరైన ప్రధాన నిందితురాలు సరిత ముఖ్యమంత్రి చాందీ అనుచరుడికి 1.90 కోట్లు, విద్యుత్ మంత్రి ఆరయాదన్ మహ్మద్‌కు 40 లక్షలు లంచం ఇచ్చినట్టు వెల్లడించింది. సోలార్ వ్యవహారంలో తాను ఒక్క నయాపైసా లంచం తీసుకోలేదని, అలాగే ప్రభుత్వానికి రూపాయ నష్టం వాటిల్లలేదని చాందీ పేర్కొన్నారు.

బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ పేరు మార్పు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 3: నైరుతి రైల్వే బెంగుళూరు డివిజన్ పరిధిలోని ‘బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్’ పేరు మార్పు జరిగిందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ ‘క్రాంతి వీర సంగొళ్లి రాయన్న’గా మారినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు.

అవినీతిని అరికట్టలేకపోతే
పన్నులు కట్టకండి
ప్రజలకు బొంబాయ హైకోర్టు పిలుపు
నాగ్‌పూర్, ఫిబ్రవరి 3: అవినీతి కేసులు పెరిగిపోవడం పట్ల బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో ప్రజలు పన్నులు కట్టకుండా సహాయ నిరాకరణ చేయాలని జస్టిస్ అరుణ్ చౌదరీ పిలుపునిచ్చారు. లోక్‌షాహీర్ అన్నభువ్ సతే వికాస్ మహామండల్(ఎల్‌ఏఎస్‌విఎం) అనే సంస్థలో 385 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన కేసును విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.‘అవినీతి ఏ రూపంలో ఉన్నప్పటికీ దాన్ని అదుపుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి చర్యలను అదుపుచేయకపోతే ప్రజల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు పెరిగిపోతాయి. పన్ను చెల్లింపుదారులు ఎంతో ఆవేదకు లోనవుతారు’అని కోర్టు పేర్కొంది. అవినీతిని నిర్మూలించడం ద్వారా ప్రభుత్వాలు ప్రజల్లో విశ్వాసాన్ని పాదగొల్పాలని న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు. సమాజంలో అవినీతి అన్నది వేయి తలల రాక్షసుడిగా మారిపోయిందన్న బెంచ్ ప్రజలంతా దీనిపై సమష్టిగా పోరాడలని పిలుపునిచ్చింది. అవినీతి చీడను విరగడ చేయడానికి ప్రజలు ముందుకురావాలని, పన్నులు చెల్లించడం ఆపేయడం ద్వారా సహాయ నిరాకరణ తెలపాలని కోర్టు పిలుపునిచ్చింది.
తాగి వాహనం నడపడం
ఆత్మాహుతి బాంబు వంటిదే
ఢిల్లీ సెషన్స్ కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: మద్యం సేవించి వాహనం నడపడం ఆత్మాహుతికి పాల్పడే మానవబాంబు వంటిదని ఢిల్లీలోని ఒక కోర్టు వ్యాఖ్యానించింది. తాగి వాహనం నడిపిన ఒక వ్యక్తికి కింది కోర్టు విధించిన ఆరు రోజుల జైలుశిక్షను సమర్థిస్తూ అదనపు సెషన్స్ న్యాయమూర్తి లోకేశ్ కుమార్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టు తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ బదర్‌పూర్ నివాసి జోగి వర్ఘీస్ అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీలును న్యాయమూర్తి కొట్టివేశారు. ట్రయల్ కోర్టు వర్ఘీస్‌కు ఆరు రోజుల జైలుశిక్ష, రూ. రెండు వేల జరిమానాను విధించింది. వర్ఘీస్ స్కూటర్‌ను నడుపుతున్న సమయంలో ఆయన రక్తంలో అనుమతించిన దానికన్నా 42 రెట్లు అధికంగా ఆల్కహాల్ ఉందని, అందువల్ల అతనికి ట్రయల్ కోర్టు విధించిన శిక్ష సరయినదేనని సెషన్స్ కోర్టు అభిప్రాయపడింది. నిందితుడి పట్ల ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని, అతని శిక్షను తగ్గించాల్సిన అవసరం లేదని పేర్కొంది. జైలుశిక్షను అమలు చేయడానికి వర్ఘీస్‌ను కస్టడీలోకి తీసుకోవాలని కూడా సెషన్స్ కోర్టు ఆదేశించింది.

మోటారు వాహనాల చట్టం కింద గత సంవత్సరం డిసెంబర్ 21న వర్ఘీస్‌కు జైలుశిక్షను విధించిన ట్రయల్ కోర్టు అతని డ్రైవింగ్ లైసెన్సును కూడా ఆరు నెలల పాటు రద్దు చేసింది.

మోదీ కాన్వాయ్‌లో మహిళ హల్‌చల్
నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఓ మహిళ బుధవారం కొద్ది సేపు పోలీసులు ముచ్చెమటలు పట్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ కోసం సౌత్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఛేదించుకొని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడమే కాక అడ్డుకున్నారన్న ఆగ్రహంతో ఓ పూలకుండీని మరి కొద్ది సేపట్లో ప్రధాని కాన్వాయ్ వెళ్లనున్న రోడ్డుపైకి విసిరేసింది. ప్రధాని కాన్వాయ్ కోసం భద్రతా దళాలు ఆ మార్గాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్న సమయంలో ఓ మహిళ హటాత్తుగా అక్కడికి వచ్చి కొంతమంది పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒక బారికేడ్‌ను దాటి ముందుకెళ్లడానికి ఆమె ప్రయత్నించగా పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. దీంతో కోపంతో ఆ మహిళ పక్కనే ఉన్న ఓ పూలకుండీని తీసుకుని రోడ్డుపైకి విసిరేసింది. ప్రధాని మోదీ కాన్వాయ్ మరికొద్ది సమయంలో అక్కడికి రానున్న సమయంలో ఇదంతా జరిగిందని ఆ అధికారి తెలిపారు. వెంటనే పోలీసులు ఆమెను అక్కడినుంచి బలవంతంగా తీసుకెళ్లారని, అనంతరం ఆమెను పార్లమెంట్ హౌస్ పోలీసు స్టేషన్‌లో నిర్బంధించినట్లు ఆ పోలీసు అధికారి చెప్పారు.